ETV Bharat / entertainment

బుడ్డోడితో హీరో సూర్య- వెంకీ అట్లూరి మూవీ టైటిల్ ఇదే

తమిళ్​ సూపర్​ స్టార్​ సూర్య 46వ సినిమా మొదటి లుక్​తో పాటు టైటిల్​ రిలీజ్​ - కొత్త లుక్​లో అదరగొట్టిన నటుడు

Suriya 46 Movie Title
Suriya 46 Movie Title (Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 10:34 AM IST

3 Min Read
Choose ETV Bharat

Suriya 46 Movie Title : తమిళ్ సూపర్ స్టార్ సూర్య అభిమానులకు తాజాగా సర్‌ప్రైజ్ అందింది. ఆయన 46వ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్‌లో సూర్య ఓ చిన్న బాబును ఎత్తుకొని నిల్చున్న తీరు ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠను పెంచుతోంది. కుటుంబ నేపథ్యంతో కూడిన ఈ చిత్రం జూలైలో థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఫస్ట్ లుక్‌లో వింటేజ్ సూర్య
ఫస్ట్ లుక్ పోస్టర్‌ చూసిన వెంటనే అభిమానులు ఒక విషయాన్ని గమనించారు. ఈ మూవీ పూర్తిగా "వింటేజ్ సూర్య" స్టైల్‌లో ఉండబోతోందని అనుకుంటున్నారు. చిరునవ్వుతో, భావోద్వేగాన్ని కళ్లల్లో మెరిపిస్తూ చిన్నారిని ఎత్తుకున్న సూర్య లుక్ ప్రేక్షకుల హృదయాలను తాకుతోంది. ‘గజిని’ సినిమాలో సంజయ్ రామస్వామిగా, ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’లో కొడుకు క్యారెక్టర్​లో ఎలా ఉన్నారో ఇందులో కూాడా అంతే చార్మింగ్ లుక్‌లో సూర్య కనిపించారు. చిత్రబృందం కూడా ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్​టైనర్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కుటుంబ బంధాలు, తండ్రి-కూతురు లేదా తండ్రి-పిల్లల మధ్య ఉండే అనుబంధం చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం.

దర్శకుడు వెంకీ అట్లూరి హ్యాట్రిక్ దిశగా?
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీని ద్విభాషా చిత్రంగా టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. 'తొలిప్రేమ', 'సార్' , ఇటీవల 'లక్కీ భాస్కర్' చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా లక్కీ భాస్కర్ మూవీ ఎంతలా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భావోద్వేగాలను సున్నితంగా చూపించడంలో వెంకీ అట్లూరి తనదైన ముద్ర వేసుకున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో కూడా ఒక తండ్రికి, తన కొడుకులకు లేదా తన కుటుంబానికి మధ్య ఉండే అనుబంధాన్ని చాలా లోతుగా చూపించబోతున్నారని టైటిల్ ద్వారా అర్థమవుతోంది.

కథానాయికగా మమిత బైజు
ఇక ఈ సినిమాలో హీరోయిన్​గా మలయాళ బ్యూటీ మమితా బైజు నటిస్తోంది. 'ప్రేమలు' మూవీతో మమితా బైజు మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీలో ఆమె పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, సీనియర్ నటి రవీనా టాండన్ చాలా కాలం తర్వాత దక్షిణాది సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె ఒక పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే రాధికా శరత్‌కుమార్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. చెన్నై, హైదరాబాద్, కేరళలోని అందమైన లొకేషన్లలో ఇప్పటికే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథ 1990ల కాలంలో సాగే పీరియాడిక్ ఫ్యామిలీ డ్రామా అని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్
టైటిల్ ప్రకటన తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అభిమానులు పోస్టర్‌ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది "ఇది కచ్చితంగా భావోద్వేగాల తుపాన్ అవుతుంది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు అయితే "సూర్య మళ్లీ ఫ్యామిలీ డ్రామాతో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాడు" అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.