ETV Bharat / entertainment

'వారణాసి'లో చిన్నమస్తా దేవి- కథంతా ఆమె చుట్టూనేనా? అసలు రాజమౌళి ప్లాన్​ అదేనా?

వారణాసి గ్లోబల్ ఈవెంట్‌లో మహేశ్ బాబు – రాజమౌళి మ్యాజిక్- చిన్నమస్తా దేవి కాన్సెప్ట్‌తో సంచలనం!

Chinnamasta Devi In Varanasi
Chinnamasta Devi In Varanasi (Movie video poster)
author img

By ETV Bharat Telugu Team

Published : November 17, 2025 at 4:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chinnamasta Devi In Varanasi: సూపర్ స్టార్ మహేశ్ బాబు– విజనరీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ టైటిల్ రివీల్ ఈవెంట్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. వేలాది మంది అభిమానులు హాజరైన ఈ వేడుకలో విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారంతా ఒకే మాట చెబుతున్నారు "ఇలాంటి కాన్సెప్ట్‌ను రాజమౌళి మాత్రమే ఆలోచించగలరు" అని అంటున్నారు. ఈ క్రమంలో ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ అందులోని కొన్ని విజువల్స్​ను ఉద్దేశించి కథను ఊహిస్తున్నారు. ఆ ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

భూత–భవిష్యత్–వర్తమానాలను కలిపిన మహా కథ!
రిలీజ్ చేసిన విజువల్స్ ప్రకారం 'వారణాసి' కథ ఏక కాలంలో మూడు దిక్కుల్ని తాకుతున్నట్లు తెలుస్తోంది భూతం, భవిష్యత్, వర్తమానం. భూమి ఆవిర్భావం నుంచి త్రేతా యుగం వరకు వివిధ కాలాల్ని ఒకే కథలో కలిపి పెద్ద కాన్వాస్ మీద చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కాలాలన్నింటినీ ఒకే తీగతో కట్టే శక్తి రుద్ర పాత్రలో కనిపించే మహేశ్ బాబుకే ఉందని గ్లింప్స్ సూచిస్తోంది.

చిన్నమస్తా దేవి విజువల్‌తో సంచలనం
ఈ గ్లింప్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించినది దశమహావిద్యలలో ఒకరైన చిన్నమస్తా దేవి దర్శనం. పురాణాల ప్రకారం ఆమెను ప్రసన్నం చేసుకున్నవారికి అతీంద్రియ శక్తులు వస్తాయని నమ్మకం. అలాగే ఎంతటి శక్తిమంతులనైనా ఒక్క అణచివేస్తూ చీల్చిచెండాడగల మహాబలం లభిస్తుందని నమ్మకం. చిన్నమస్తా దేవి రూపం రౌద్రరసమూర్తి. తన శిరస్సును తానే నరికి చేతిలో పట్టుకుని ఆ రక్తాన్ని రెండు శక్తులైన డాకిని, వర్ణినిలు సేవిస్తున్న రూపం అత్యంత గంభీరంగా, భయంకరంగా ఉంటుంది. సృష్టి–వినాశనాల రెండింటినీ ఒకేసారి సూచించే ఈ అవతారం తంత్ర విద్య, ఘోర తపస్సులతో సంబంధం కలిగిన అత్యంత ప్రత్యేక రూపంగా భావిస్తారు.

వారణాసితో చిన్నమస్తా దేవికి ఉన్న అనుబంధం
పురాణ కధనాల ప్రకారం చిన్నమస్తా దేవి భూత, భవిష్యత్, వర్తమానాలన్నింటిని గ్రహించే వరాన్ని ప్రసాదించగలదని చెబుతారు. ఇది గ్లింప్స్‌లో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. రుద్ర అవతారంలో ఉన్న మహేశ్ బాబు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు ఆమె శక్తిని అందుకుని రాక్షసులను అంతం చేసే సంకల్పం ఇవన్నీ గట్టిగా కనెక్ట్‌ అవ్వడం ఆసక్తికరం.

ప్రియాంక చోప్రా పాత్ర మందాకిని కూడా ఈ కథలో కీలకం. దేవి ఖడ్గం నుంచి కిందకు జారి పడే విజువల్‌ పురాణాల్లో చెప్పిన రక్తదాహం తీరని కథల్ని గుర్తు చేస్తోంది. రాక్షస సంహారం చేసిన తర్వాత కూడా తన వెంటనున్న శక్తులకు రక్తాన్ని అందించేందుకు తానే తల నరుక్కునే ఘోర త్యాగం ఆమెది. ఈ తీవ్ర శక్తులన్నింటిని పొందేది ధైర్యవంతుల్లో ధైర్యవంతుడు మాత్రమే. అందుకే రాజమౌళి రుద్ర రూపంలోని మహేశ్ బాబుకు ఈ దివ్యశక్తిని లింక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉత్తర్​ప్రదేశ్‌లోని వారణాసి సమీప రామ్‌నగర్‌లో ఒక ప్రసిద్ధ చిన్నమస్తా దేవి ఆలయం ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్ ప్రాంతంలో కూడా అమ్మవారి పీఠం ఉంది.

వారణాసి గ్లింప్స్‌ ఎలా ఉన్నాయంటే?
వారణాసి గ్లింప్స్‌ చూస్తే కథ పరంగా ఇది సాధారణ సినిమా కాదని అర్థమవుతోంది. పురాణాలు, కాలాలని దాటే కాన్సెప్ట్, దివ్యశక్తులు, రాక్షస సంహారం, రుద్రకు లభించే అతీంద్రియ బలం ఇవన్నీ రాజమౌళి మైండ్‌లో ఎంత గొప్ప విజన్ దాగి ఉందో చూపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కెరీర్‌లోనే కాదు భారత సినిమా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన పాత్రను పోషించనున్నారనే మాట స్పష్టంగా వినిపిస్తోంది. ఇక రాజమౌళి చూపే వారణాసి ప్రపంచం ఎలా ఉంటుందో? మరెంతటి విజువల్స్ మనల్ని ఎదురుచూస్తున్నాయో? ప్రేక్షకుల నుంచి మాత్రం ఒకే మాట వినిపిస్తుంది వారణాసి ఇండియన్ సినిమా లెవల్‌ని మరోసారి మార్చేస్తుంది!

'వారణాసి' కోసం కొత్త​ టెక్నాలజీ- ఇక థియేటర్లలో గూస్​బంప్సే!

'మహేశ్ ఫొటోను నా ఫోన్​ వాల్​పేపర్​గా పెట్టుకున్నా'- రాజమౌళి