మెగాస్టార్ 'సంక్రాంతి బాక్సాఫీస్ జాతర'- 1979 నుంచి 32 సినిమాలు!-మరోసారి పొంగల్ బరిలో!
దశాబ్దాలుగా తెలుగు సినిమాలో సంక్రాంతి బరిలో మెగాస్టార్- 'సంక్రాంతి అంటే చిరంజీవి - చిరంజీవి అంటే సంక్రాంతి' అనేలా ముద్ర- 2026లో మరోసారి 'మన శంకరవరప్రసాద్ గారు'తో పండగ బరిలోకి మెగాస్టార్

Published : January 11, 2026 at 7:54 PM IST
Chiranjeevi Movies Sankranti Release : మెగాస్టార్ చిరంజీవికి, సంక్రాంతి సీజన్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. 1980 దశకం నుంచి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన ప్రభంజనాలు, సాధించిన విజయాలు సగటు సినీ అభిమానిని ఉర్రూతలూగించాయి. తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం పంటల పండుగ మాత్రమే కాదు, అది థియేటర్ల వద్ద మెగాస్టార్ చిరంజీవి సృష్టించే 'బాక్సాఫీస్ జాతర'. చిరంజీవి తన కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా దాదాపు 32 చిత్రాలను జనవరి మాసంలో, ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిపి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల పంట పండించారు.
ఆయన వేసే స్టెప్పులు, పలికే డైలాగులు, ఆ మాస్ మేనరిజమ్స్ పండగ జోష్‌ను రెట్టింపు చేస్తూ టాలీవుడ్‌లో ఆయన్ను సంక్రాంతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిపాయి. 1979లలో ప్రారంభమైన సంక్రాంతి మెగా ప్రయాణం దశాబ్దాలుగా కొనసాగుతూ 2026లో 'మన శంకరవరప్రసాద్ గారు' వరకు చేరుకుంది. సంక్రాంతి బరిలో నిలిచిన అంచనాలను అందుకోవడం వసూళ్లతో చరిత్ర సృష్టించడం ఒక ఆనవాయితీగా మారింది. మెగాస్టార్ కెరీర్‌లో సంక్రాంతి చిత్రాల సుదీర్ఘ ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తాయారమ్మ బంగారయ్య (Jan 12, 1979)
చిరంజీవి కెరీర్ ఆరంభంలో సంక్రాంతికి వచ్చిన ఆయన తొలి చిత్రం ‘తాయారమ్మ బంగారయ్య’. ఈ సినిమాలో చిరంజీవి కీలక పాత్రలో నటించారు. ప్రాణం ఖరీదు రిలీజైన కొద్ది నెలలకే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సామాజిక సందేశంతో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. అలాగే, చిరంజీవి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
నాగో కా రాజా (Jan 1, 1980)
ఇది చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో హిందీలో నటించిన సినిమా. 1980 జనవరి1న సంక్రాంతి సీజన్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజైంది. ఆ రోజుల్లో చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ పెట్టుకుని, ఆయన యాక్షన్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ డబ్బింగ్ చిత్రాన్ని తెలుగులోకి సంక్రాంతికి విడుదల చేశారు.
ఆడవాళ్లు మీకు జోహార్లు (Jan 15, 1981)
చిరంజీవి కెరీర్‌లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఒక మైలురాయి వంటి చిత్రం. అగ్ర దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై చిరంజీవిని కేవలం మాస్ హీరోగానే కాకుండా మంచి నటుడిగా నిలబెట్టింది. ప్రయోగాత్మక చిత్రంగా చిరంజీవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఒకే నెలలో నాలుగు సినిమాలు
- వైశాలి (Jan 1, 1983): చిరంజీవి కెరీర్‌లో 1983వ ఏడాది చాలా అరుదైనది. ఎందుకంటే ఆ ఏడాది జనవరిలోనే ఆయన నటించిన దాదాపు మూడు సినిమాలు విడుదలయ్యాయి. జనవరి ఒకటో తేదీనే రెండు సినిమాలు విడుదల కావడం గమనార్హం. అందులో 'వైశాలి' ఒకటి.
- పులి బెబ్బులి (Jan 1, 1983): చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజుల కాంబోలో సంక్రాంతికి వచ్చిన పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్ 'పులి బెబ్బులి'. కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.
- ఏక్ చల్బాజ్ (Jan 1, 1983): 'ఏక్ చల్బాజ్' అనేది లెజెండరీ డైరెక్టర్ బాపు దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'మంత్రిగారి వియ్యంకుడు' సినిమాకు హిందీ డబ్బింగ్ మూవీ. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి 'ఏక్ చల్బాజ్' పేరుతో హిందీలోకి అనువదించి సంక్రాంతి కానుకగా విడుదల చేశారు.
- ప్రేమ పిచ్చోళ్లు (Jan 14, 1983): చిరంజీవి మాస్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయనలోని కామెడీ టైమింగ్‌ను బయటకు తీసిన వినోదాత్మక చిత్రం 'ప్రేమ పిచ్చోళ్లు'. 1983 సంక్రాంతి పండుగ రోజే (జనవరి 14) విడుదలైన ఈ సినిమా యువతను ఆకట్టుకుని హిట్ అందుకుంది. సామాజిక అంశంతో ఈ సినిమా పర్వాలేదనిపించింది.
ఒకటే రోజు రెండు సినిమాలు
- రోషగాడు (Jan 1, 1984): చిరంజీవి కెరీర్‌లో 1983లో 'ఖైదీ' సినిమాతో వచ్చిన భారీ విజయం తర్వాత ఆయన మాస్ ఇమేజ్‌ను శిఖరాగ్రానికి తీసుకెళ్లిన చిత్రం 'రోషగాడు'. 1984 నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ మూవీకి కేఎస్ఆర్. దాస్ డైరెక్టర్ కాగా, మాధవి హీరోయిన్.
- రాకా (Jan 1, 1984): చిరంజీవి మాస్ ఇమేజ్ పతాక స్థాయిలో ఉన్న సమయంలో వచ్చిన మరో భారీ యాక్షన్ చిత్రం 'రాకా'. 1984 జనవరి 1న 'రోషగాడు'తో పాటే విడుదలైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. సంక్రాంతి సెలవుల్లో ఈ రెండు ఈ సినిమాలు మాస్ ఆడియన్స్‌కు అసలైన వినోదాన్ని పంచాయి.
చట్టంతో పోరాటం (Jan 11, 1985)
కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి స్టామినాను బాక్సాఫీస్ వద్ద మరోసారి చాటించి. ఆయనను తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది. సంక్రాంతి బరిలో సోలో హీరోగా చిరంజీవి భారీ విజయాన్ని అందుకున్న తొలి చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమా నుంచి ఆయనకు పండగ సెంటిమెంట్ బలపడింది. చక్రవర్తి సంగీతానికి రాఘవేంద్రరావు కమర్షియల్ హంగులు తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
1986 సంక్రాంతిని శాసించిన సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 1986సంక్రాంతి సీజన్‌ను శాసించిన రెండు సినిమాలు కిరాతకుడు, కొండవీటి రాజా.
- కిరాతకుడు (Jan 10, 1986): ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ఒక పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. చిరు- కోదండరామిరెడ్డిలది హిట్ కాంబినేషన్ అని మరోసారి నిరూపించింది.
- కొండవీటి రాజా (Jan 31, 1986): కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ చిత్రం, సంక్రాంతి సీజన్ చివరలో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విజయశాంతి, రాధ నటించిన ఈ చిత్రం మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలించింది. పండగ తర్వాత విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ బాక్సాఫీస్ రేంజ్‌ను మరింత పెంచింది.
దొంగ మొగుడు (Jan 9, 1987)
ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే యాక్షన్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కామెడీతో ఈ సినిమా సంక్రాంతి విందుగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించి, అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
మంచి దొంగ (Jan 14, 1988)
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి మాస్ ఇమేజ్‌ను మరింత శిఖరాగ్రానికి తీసుకెళ్లింది మంచి దొంగ. వరుసగా మూడో ఏడాది కూడా సంక్రాంతి సీజన్‌లో భారీ విజయాన్ని అందుకోవడం చిరంజీవికి ఈ సినిమాతోనే సాధ్యమైంది. చిరంజీవి - విజయశాంతి - రాధల హిట్ కాంబినేషన్ ఈ సినిమా విజయానికి మరో ప్రధాన కారణం.
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (Jan 14, 1989)
అత్తా- అల్లుళ్ల మధ్య జరిగే పోరు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సంక్రాంతి అంటే చిరంజీవిదే అనే నమ్మకాన్ని ఈ సినిమా టాలీవుడ్‌లో బలంగా ముద్ర వేసింది. ఈ విజయంతో చిరంజీవి నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.
రాజా విక్రమార్క (Jan 1, 1990)
ఈ సినిమాలో చిరంజీవి ఒక యువరాజు పాత్రలో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. పండగ బరిలో వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. మెగాస్టార్ సరసన రాధిక, అమల తమ నటనతో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు.
పదిరోజుల వ్యవధిలో మూడు సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్‌లో 1991 జనవరి అనేది అరుదైన మాసంగా నిలిచింది. పది రోజుల వ్యవధిలో ఆయన నటించిన మూడు భారీ చిత్రాలు విడుదలయ్యాయి.
- రుద్రనేత్ర (Jan 1, 1991): యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ స్పై థ్రిల్లర్. ఇందులో చిరంజీవి 'ఏజెంట్ నేత్ర' అనే గూఢచారి పాత్రలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ, అండర్ వరల్డ్ డాన్‌లను అరికట్టే సాహసాలు చేస్తారు. నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
- స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్ (Jan 9, 1991): గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. చిరంజీవి ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, స్టూవర్ట్‌పురం దొంగలను అదుపు చేసే పాత్రలో తన నటనతో విశ్వరూపం చూపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా చిరంజీవి కెరీర్‌లో ఒక విభిన్నమైన ప్రయత్నంగా నిలిచింది.
- పోలీస్ స్టేషన్ (Jan 1, 1991): ఇది చిరంజీవి నటించిన ఒక తమిళ చిత్రానికి ('త్యాగి') తెలుగు అనువాదం అయినప్పటికీ, పండగ సీజన్‌లో పంపిణీదారులు దీనిని భారీగా విడుదల చేశారు. 'రుద్రనేత్ర' విడుదలైన రోజే ఈ సినిమా కూడా విడుదల కావడం విశేషం, దీంతో థియేటర్ల వద్ద చిరంజీవి సందడి రెట్టింపు అయ్యింది.
1993లో అటు హిందీ, ఇటు తెలుగులో!
చిరంజీవి కెరీర్‌లో 1993 ఏడాది ఆయన మాస్ ఫాలోయింగ్‌ను మరొక స్థాయికి తీసుకెళ్లింది. ఆ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ రెండు చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
ముఠా మేస్త్రి (Jan 17, 1993): ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే ఒక ఐకానిక్ మాస్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. ఇందులో చిరంజీవి ఒక సామాన్య కూలీ (మేస్త్రి) నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే పాత్రలో తన నటనతో, విలక్షణమైన మేనరిజమ్స్‌తో రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. రాజ్-కోటి సంగీతంలో వచ్చిన 'ఈ పేటకి నేనే మేస్త్రి' వంటి పాటలు ఇప్పటికీ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.
సికందర్ కి లల్కార్ (Jan 1, 1993) : ఇది చిరంజీవి నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ హిందీ మువీ. దీనిని ఉత్తరాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సీజన్‌లో భారీగా విడుదల చేశారు. అప్పట్లో చిరంజీవికి బాలీవుడ్‌లో పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఒకే నెలలో అటు 'ముఠా మేస్త్రి'తో తెలుగులో, ఇటు 'సికందర్ కి లల్కార్'తో హిందీ మార్కెట్‌లో మెగాస్టార్ తన సత్తా చాటడం అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు.
ముగ్గురు మొనగాళ్లు (Jan 7, 1994)
చిరంజీవి తన కెరీర్‌లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా ముగ్గురు మొనగాళ్లు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పండగ పూట ముగ్గురు చిరంజీవిలతో అభిమానులకు కనువిందు చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి, ఆ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది.
హిట్లర్ (Jan 4, 1997)
వరుస పరాజయాల తర్వాత చిరంజీవి చేసిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద కమ్‌బ్యాక్ మూవీగా నిలిచిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి హిట్‌గా నిలిచింది. ఐదుగురు చెల్లెళ్ల కోసం తపించే కఠినమైన అన్నయ్య పాత్రలో చిరంజీవి తన నటనతో అందరినీ కదిలించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మెగాస్టార్‌ను కుటుంబ ప్రేక్షకులకు మళ్లీ దగ్గర చేసింది. ఈ విజయంతో చిరంజీవి తన బాక్సాఫీస్‌పై మళ్లీ తన పట్టు సాధించుకున్నారు.
నెం. 1 మర్ద్ (Jan 1, 1998)
చిరంజీవి నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రానికి హిందీ/తెలుగు సినిమా. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ప్రేక్షకులను అలరించాయి. చిరంజీవి ఉంటే డబ్బింగ్ సినిమాలకు కూడా కాసుల వర్షం కురుస్తుందని ఇది నిరూపించింది.
స్నేహం కోసం (Jan 1, 1999)
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. స్నేహం విలువను, త్యాగాన్ని చాటిచెప్పే ఈ కథ ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసి ఘనవిజయం సాధించింది. 1999 సంక్రాంతికి ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది.
అన్నయ్య (Jan 4, 2000)
చిరంజీవి నటించిన ఈ చిత్రం 2000 సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాధ్యత గల అన్నయ్యగా చిరంజీవి, అల్లరి తమ్ముళ్లుగా రవితేజ, వెంకట్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు సెంటిమెంట్ కలగలిసిన ఈ చిత్రం పక్కా పండగ విందుగా నిలిచింది. ముత్యాల సుబ్బయ్య-చిరంజీవి కాంబినేషన్లో 'హిట్లర్' తర్వాత వచ్చిన మరో సూపర్ హిట్ ఇది.
మృగరాజు (Jan 11, 2001)
మ్యాన్ ఈటర్‌గా మారిన సింహం చుట్టూ తిరిగే అడ్వెంచర్ కథతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద ప్రయోగం. అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం చిరంజీవి ఎంతో శ్రమించారు. అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. చిరంజీవి ప్రయోగాత్మక చిత్రాలలో ఒకటిగా ఇది ఫ్యాన్స్‌కు గుర్తిండిపోయింది.
అంజి (Jan 15, 2004)
దాదాపు ఆరేళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం టెక్నికల్ వండర్‌గా నిలిచింది. ఇందులో చిరంజీవి 'ఆత్మలింగం'ను రక్షించే సాహసోపేతమైన పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్‌కు జాతీయ అవార్డు లభించడం విశేషం. సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలై, గ్రాఫిక్స్ పరంగా తెలుగు సినిమా స్థాయిని పెంచింది.
స్టైల్ (Jan 12, 2006)
డ్యాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి ఒక అతిథి పాత్రలో మెరిశారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు చిరంజీవి అప్పియరెన్స్ అదనపు ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి సీజన్‌లో యువతను డ్యాన్స్ మాయలో పడేసిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఖైదీ నంబర్ 150 (Jan 11, 2017)
రాజకీయాలకు స్వస్తి చెప్పి దాదాపు పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి చేసిన ఈ రీ-ఎంట్రీ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. సంక్రాంతి బరిలో రికార్డు స్థాయి వసూళ్లతో చిరంజీవి గ్రాండ్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 'అమ్మడు కుమ్ముడు' పాటలో చిరంజీవి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి.
వాల్తేరు వీరయ్య (Jan 13, 2023)
వింటేజ్ చిరంజీవిని మళ్లీ చూపిస్తూ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ 2023 సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇందులో చిరంజీవి కామెడీ టైమింగ్, రవితేజతో ఆయన కాంబినేషన్ అదిరిపోయింది. భారీ వసూళ్లతో ఈ సినిమా చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటింది.

మన శంకరవరప్రసాద్ గారు (Jan 12, 2026)
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రంపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ తన అసలు పేరుతోనే పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి మార్క్ కామెడీ మేనరిజమ్స్, అనిల్ రావిపూడి టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

