KVN సంస్థకు కష్టకాలం- విజయ్, యశ్ సినిమాలకు వరుస అడ్డంకులు- అసలేం జరుగుతోంది?
టాప్ హీరోల సినిమాలతో కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు వరుస కష్టాలు- విజయ్ 'జన నాయగన్'కు సెన్సార్ కష్టాలతో పాటు పైరసీ సెగ- యశ్ 'టాక్సిక్' విడుదల తేదీ పదేపదే వాయిదా- అసలు కారణం ఇదేనా?

Published : April 15, 2026 at 7:34 PM IST
KVN Productions Movies Troubles : కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరున్న కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ప్రస్తుతం వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న మూడు మెగా ప్రాజెక్టులను ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. విజయ్ 'జన నాయగన్', యశ్ 'టాక్సిక్', ధ్రువ సర్జా 'కేడీ: ద డెవిల్' చిత్రాలు వరుస వివాదాలతో సమస్యలతో సతమతమవుతున్నాయి. అగ్ర నటులతో సినిమాలు తీస్తున్నా, ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుండటం ఆ నిర్మాణ సంస్థను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కి సినిమాలను ప్రేక్షకులకు అందించడం తమ బాధ్యత అని సంస్థ ప్రతినిధులు చెబుతున్నా, పరిస్థితులు మాత్రం అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అసలు ఈ మూడు సినిమాలకు ఏయే రూపాల్లో సమస్యలు వస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
జన నాయగన్- సెన్సార్ కష్టాలు
దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో 'జన నాయగన్'పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.300 నుంచి రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ సెన్సార్ బోర్డు దగ్గర చిక్కుకుపోయింది. చిత్రంలోని రాజకీయపరమైన అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చివరకు ఎన్నికల కమిషన్ కూడా ఈ సినిమాను సమీక్షించాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా అమేజాన్ ప్రైమ్ వీడియో తన రూ.120 కోట్ల ఓటీటీ డీల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
షాకిచ్చిన పైరసీ- లీక్ కావడంతో ఆందోళన
జన నాయగన్ నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ పైరసీ రూపంలో తగిలింది. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా మొత్తం HD వెర్షన్‌లో ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. థియేటర్లలో విడుదల కాకముందే ఇలా జరగడంతో మేకర్స్‌కు భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఘటనను రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య వంటి ప్రముఖ నటులు తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు ఈ లీకేజీకి సంబంధించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, 300 పైగా పైరసీ లింకులను తొలగించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. విడుదలకు ముందే ఇంతటి అడ్డంకులు ఎదురవ్వడంతో సినిమా ఆర్థికంగా ఎంతవరకు నిలబడుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టాక్సిక్ విడుదల మళ్లీ వాయిదా!
కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న 'టాక్సిక్' మూవీ కూడా విడుదల తేదీ విషయంలో పదేపదే మారుతోంది. మొదట 2025 ఏప్రిల్ నెలలో రావాల్సిన ఈ సినిమాను 2026 మార్చికి మార్చారు. తీరా విడుదల దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చెబుతున్నా, మేకింగ్‌లో జరుగుతున్న ఆలస్యం కూడా ఒక కారణమని ఇండస్ట్రీ టాక్. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సినిమా కాబట్టి, అన్ని భాషల్లో పర్ఫెక్ట్గా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ డేట్ మార్చినట్లు తెలుస్తోంది.
బ్యాడ్ టైమ్ నడుస్తోంది- కేవీఎన్ ప్రతినిధుల ఆవేదన
నిర్మాణ సంస్థకు సంబంధించిన ఒక సన్నిహిత ప్రతినిధి ఈ సమస్యలపై స్పందిస్తూ ప్రస్తుతం తమకు సమయం కలిసి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సినిమాలూ భారీ స్థాయిలోనే నిర్మించామని, కానీ ఒక్కసారిగా ఇన్ని అడ్డంకులు ఎదురవ్వడం బ్యాడ్ టైమింగ్ అని పేర్కొన్నారు. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగానే మార్పులు చేస్తున్నామని, ఈ నెలలోనే 'కేడీ' సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి నిర్మించిన ఈ చిత్రాలను ప్రేక్షకులకు చేరవేయడమే తమ బాధ్యతని, మిగిలినది ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని సంస్థ స్పష్టం చేసింది. మరి ఈ వరుస సమస్యలను అధిగమించి ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయో లేదో చూడాలి.
యశ్ ‘టాక్సిక్’ వాయిదా- కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్

