ETV Bharat / entertainment

స్టైలిష్ లుక్​లో నాగార్జున - 'కింగ్ 100' గ్లింప్స్‌ చూశారా? - రిలీజ్ ఎప్పుడంటే?

నాగార్జున బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్‌ విడుదల- నాగ్ స్వాగ్, స్టైల్‌తో ఆకట్టుకున్న వీడియో- డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమా రిలీజ్

Nagarjuna 100th film Glimpse
కింగ్ నాగార్జున 100వ చిత్రం టైటిల్ గ్లింప్స్ (Source: Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 12:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

King 100 Title Glimpse : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 100వ చిత్రం అప్‌డేట్‌ వచ్చేసింది. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న వందో చిత్రం టైటిల్​, గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్​ను కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ సినిమాతో కింగ్ నాగార్జున తన సినీ జీవితంలో అరుదైన మైలురాయికి చేరుకోబోతున్నారు. ఈ చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ఈ మూవీని విడుదల చేయనున్నారు.

భారీ అంచనాలు
నాగార్జున సినీ ప్రయాణంలో 100వ సినిమా కావడంతో ఆ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా గురించి చిత్రబృందం ఇప్పటివరకు పెద్దగా వివరాలు వెల్లడించలేదు. ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్‌ను కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారిగా గ్లింప్స్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఒక నిమిషం 20 సెకన్ల నిడివితో గ్లింప్స్‌ను కట్ చేశారు. 'మనుషుల్లో రెండు రకాలు. డబ్బున్నోళ్లు, డబ్బు లేనోళ్లు' అంటూ నాగార్జున వాయిస్‌తో వీడియో మొదలవుతుంది. 'డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు. డబ్బు ఉన్నప్పుడు దే కాల్ మీ ది కింగ్' అనే పవర్‌ఫుల్ డైలాగ్ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

గ్లింప్స్‌లో నాగార్జున లుక్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా కనిపించాయి. స్టైలిష్ డ్రెస్సింగ్ అండ్ లుక్‌తో కింగ్ తన అభిమానులను ఆకట్టుకున్నారు. దాదాపు 70 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్నా నాగార్జునలోని గ్లామర్, స్టైల్ ఏమాత్రం తగ్గలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా పాత నాగార్జునను గుర్తు చేస్తోంది. గ్లింప్స్‌ను చూస్తే సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డబ్బు లేని సమయంలో ఎదుర్కొన్న అవమానాల నుంచి బయటపడిన ఓ వ్యక్తి ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు, స్థానం సంపాదించుకునే కథాంశంతో సినిమా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం వెల్లడించలేదు.

దేవిశ్రీ సంగీతం
గ్లింప్స్‌కు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నాగార్జున పాత్రను ఎలివేట్ చేసేలా మ్యూజిక్​ను అందించారు. గ్లింప్స్‌లోని యాక్షన్ సీన్స్, నాగ్ స్టైల్‌కు తగ్గట్టుగా బీజీఎం ఉండటంతో వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు రాజా మహదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచేలా సినిమా ఉండాలనే ఉద్దేశంతో మూవీ టీమ్ ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది.

30 ఏళ్ల తర్వాత టబుతో
సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున, టబు జోడీకి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలిసి చాలా ఏళ్ల క్రితం ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఆసక్తి నెలకొంది. టబు పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పేలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం సీక్రెట్​గా ఉంచింది. ఐశ్వర్య రాజేశ్, సుస్మితా భట్, విజయేంద్ర తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మిగిలిన నటీనటుల వివరాలను కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

క్రిస్మస్ బరిలో కింగ్
ఇక విడుదల తేదీని కూడా చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. క్రిస్మస్ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఆ తేదీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ముందే వచ్చే క్రిస్మస్ సెలవులు సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ తమ సినిమాలతో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు నాగార్జున తన 100వ సినిమాతో ఎలాంటి వసూళ్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

బేబీ కోసం అప్పుడే అన్నీ కొనేశా- కానీ వాటిని చూస్తేనే కంగారుగా ఉంది: సమంత

ప్యారడైజ్​ నుంచి 'యేష నాగుల కట్టమీద'- నాటు మాస్​ బీట్​తో ఊపు ఊపేస్తుందిగా!