ETV Bharat / entertainment

'కేరళ స్టోరీ 2' రిలీజ్​పై స్టే విధించిన హైకోర్టు - విడుదలకు ఒక్క రోజు ముందు షాక్

Kerala Story 2 Release : కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్​పై స్టే విధించిన హైకోర్టు- ఫిర్యాదులను సెన్సార్‌ బోర్డు పరిగణనలోకి తీసుకోవాలని సూచన

Kerala Story 2
Kerala Story 2 (Source : Film Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 3:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kerala Story 2 Release Date : 'ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్' సినిమా విడుదల పై ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. సినిమా విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కురియన్ థామస్ రిలీజ్​పై స్టే విధిస్తూ​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సినిమాను సర్టిఫై చేసే క్రమంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయకుండా చూసుకునే మార్గదర్శకాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పాటించనట్లు కనిపిస్తోందని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. 15 రోజులపాటు ఈ తీర్పు అమలులో ఉండనుంది. అయితే థియేటర్లలోకి వచ్చే ఒక్క రోజు ముందు కోర్టు తీర్పు మేకర్స్​కు షాక్ ఇచ్చినట్లైంది!

కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్​ రిలీజైంది. అయితే ఇందులో పలు సీన్లు వివాదానికి దారితీశాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు కేరళ సంప్రదాయం, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ట్రైలర్‌ తమను దిగ్బ్రాంతికి గురిచేసిందని, ఇందులోని సన్నివేశాలు కేరళను భిన్నంగా చూపిస్తున్నాయని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం విచారించిన ధర్మాసనం, రిలీజ్​పై స్టే విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. సినిమాకు సర్టిఫికేషన్ జారీ చేయడాన్ని మరోసారి పరిశీలించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. దీంతో రేపు ఈ సినిమా విడుదల కావడం లేదు.

ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం ఈ సినిమాపై స్పందించారు. ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ట్రైలర్​లోని సన్నివేశాలు కేరళ సంప్రదాయం, మతసామరస్యం, లౌకిక వాదాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఇలాంటి వివాదాస్పద సినిమాలకు సెన్సార్స్ క్లియరెన్స్ ఎలా ఇస్తారని బోర్డుపై మండిపడ్డారు. కేరళపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, తమ రాష్ట్ర లౌకిక సంప్రదాయాన్ని అవమానించడమే లక్ష్యంగా ఈ సినిమా రూపొందిందని సీఎం విమర్శించారు. లౌకిక పునాదులపై ఏర్పడ్డ కేరళ సంప్రదాయాన్ని ఇలాంటి అవాస్తవమైన ప్రచారాలతో నాశనం చేయలేరని నిరూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని అన్నారు. ఈ మేరకు ఇటీవల ఆయన ఎక్స్​లో ఓ పోస్టు షేర్ చేశారు.

U/A సర్టిఫికెట్
అయితే ఈ సినిమాకు గత గురువారమే సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేషన్ జారీ చేసింది. దీనిపై మూవీటీమ్ కూడా సంతోషం వ్యక్తం చేసింది. తమ సినిమాకు సెన్సార్ రావడం విజయంగా భావిస్తున్నట్లు మూవీటీమ్ పేర్కొంది. 'సెన్సార్ నుంచి యూ/ఏ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా తెరకెక్కించడం వెనుక ఉన్న మా ఉద్దేశం దేశ పౌరులందకీ చేరుతుంది. కొన్ని విషయాల్లో మహిళలకు అవగాహన తీసుకురావడమే మా లక్ష్యం. ఇక్కడితో ఆగిపోకుండా తదుపరి తరానికి కూడా మా మెసెజ్​ వెళ్లాలనే ఉద్దేశంతోనే సినిమా తెరకెక్కించాం' అని మూవీటీమ్ తెలిపింది. అయితే ఈ సర్టిఫికేషన్​ను మరోసారి పరిశీలించాలని కోర్టు సీబీఎఫ్​సీకి సూచించింది.

కామాఖ్యా నారాయణ్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందింది. ఇందులో ఉల్క గుప్తా, ఐశ్వర్యా ఓజా, అదితి భాటియా కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజై మంచి విజయం అందుకున్న 'ది కేరళ స్టోరీ' సినిమాకు సీక్వెల్​గా పార్ట్​ 2 తెరకెక్కింది. అయితే ఈ ట్రైలర్ రిలీజైన తర్వాత కాంట్రవర్సీ షురూ అయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్​కు ఎప్పుడు చిక్కులు వీడుతాయో చూాడాలి!

'ది కేరళ స్టోరీ 2'కు సెన్సార్ క్లియర్- థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

ఓటీటీలోకి 'ది కేరళ స్టోరీ'- స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?