ETV Bharat / entertainment

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత- రేపు ముంబయిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు!

Asha Bhosle
Asha Bhosle (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 12, 2026 at 12:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

Asha Bhosle Passed Away : భారతీయ ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను కుటుంబ సభ్యులు ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే ధ్రువీకరించారు. ఇక ఆశా భోస్లే మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.

రేపు అంత్యక్రియలు
ఆశా భోస్లే పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ముంబయిలోని ఆమె నివాసానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం రేపు ఉ.11 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఆమె పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకు ముంబయిలోని శివాజీ పార్క్​లో అంత్యక్రియలు జరపనున్నట్లు కుమారుడు ఆనంద్ భోస్లే చెప్పారు.

12వేలకుపైగా పాటలు
ఆశా భోస్లే 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్‌లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్, ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి శేవంతి మంగేష్కర్. దివంగత గాయనీ లతా మంగేష్కర్, ఆశా భోస్లే సోదరే. మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్ ఆమె తొబుట్టువులు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆమె బాల్యంలోనే మరణించారు. అయితే ఆయన నుంచి వారసత్వంగా అందించిన సంగీతం, ఆమెకు ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చింది. ఆమె సంగీతం ప్రస్థానం 11వ ఏటనే మొదలైంది. 1943లో తొలిసారి మరాఠీ చిత్రం మజాబాల్​లో 'చలా చలా నవ్ చలా' అనే పాట పాడారు. అలా ఇప్పటివరకు ఆశా భోస్లే వెయ్యికి పైగా చిత్రాల్లో 12 వేలకుపైగా పాటలకు తన గాత్రం అందించారు. ఇందులో 'దమ్ మార్ దమ్' (Dum Maro Dum), 'యే మెరా దిల్ ప్యార్​ కా దీవానా' పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇవి ఇప్పటికీ హైలైటే!

అనేక అవార్డులు
సుదీర్ఘ కెరీర్​లో అనేక అవార్డులు సాధించాడు. ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్న ఆమె, రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు. ఇక 2000లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, 2001లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, 2002లో బీబీసీ 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' పురస్కారం అందుకున్నారు. ఇక 2008లో ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. ఇక 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆశా భోస్లేకు చోటు దక్కింది.

విదేశీ భాషల్లోనూ
ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు పాడి, ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్‌లు చేసిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. గజల్స్‌, పాప్‌, ప్రైవేట్‌ ఆల్బమ్స్ విభిన్న శైలిల్లో ఆమె శ్రోతలను ఉర్రూతలూగించారు. దశాబ్దాల తరబడి బాలీవుడ్‌లోనే కాదు 20కి పైగా దేశవిదేశీ భాషలలో వివిధ చిత్రాల్లో పాటలు పాడారు.

వ్యక్తిగత జీవితం!
16 ఏళ్ల వయసున్నప్పుడే ఆశ, 31 ఏళ్ల గణపత్‌ రావ్‌ భోస్లేను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. అయితే పలు కారణాలతో 1960లో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఇక 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్‌ను వివాహమాడారు. 1994లో ఆయన మృతి చెందారు. అప్పట్నుంచి తన పిల్లలు, మనవడు- మనవరాలే లోకంగా గడుపుతున్నారు. ఇప్పుడు ఆమె మరణంతో ఒక శకం ముగిసినట్లైంది! కానీ ఆశా భోస్లే పాటలు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచి ఉంటాయి.

ఆస్పత్రిలో చేరిన ప్రముఖ సింగర్ ఆశా భోస్లే

రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠకు ధోనీకి ఆహ్వానం - అయోధ్యకు వెళ్లనున్న ఆశా భోస్లే