విమర్శల నుంచి నేషనల్ అవార్డ్ వరకు- బన్నీ ప్రయాణం 'తగ్గేదేలే'!- ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్
విమర్శలను ఎదుర్కొని నేషనల్ అవార్డ్ అందుకున్న తొలి టాలీవుడ్ హీరోగా రికార్డ్- మలయాళం, ఉత్తరాదిలో కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఏకైక తెలుగు హీరో

Published : April 8, 2026 at 8:27 AM IST
Allu Arjun Birthday 2026 : టాలీవుడ్‌లో వారసత్వంతో అడుగుపెట్టినా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న నటుడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ ఈ ఏప్రిల్ 8న 44వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైనప్పుడు బన్నీపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఒక సాధారణ నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన బన్నీ నేడు భారతీయ సినిమా గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు. విమర్శించిన నోళ్లే ప్రశంసించేలా తనను తాను మలుచుకున్న తీరు అద్భుతం. కేవలం డ్యాన్సులతోనే కాకుండా తన విలక్షణమైన నటనతో ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సాధించిన అరుదైన విజయాలు, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
విమర్శల నుంచి విజయాల వైపు- ఆర్యతో మొదలైన సెన్సేషన్
తొలి చిత్రం 'గంగోత్రి' విడుదలైనప్పుడు అల్లు అర్జున్ నటనపై భారీగా ట్రోల్స్ వచ్చాయి. అయితే 2004లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' సినిమా బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 'ఫీల్ మై లవ్' అంటూ యూత్‌కు ఫ్యాషన్ ఐకాన్‌గా మారారు. ఆ తర్వాత వచ్చిన 'దేశముదురు' కోసం సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సృష్టించారు. 'పరుగు' సినిమాలో ఒక బాధ్యతాయుతమైన యువకుడిగా నటించి నంది అవార్డును అందుకున్నారు. 'జులాయి', 'రేసుగుర్రం' వంటి చిత్రాలు ఆయనలోని మాస్ కామెడీ టైమింగ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ప్రతి సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ వెళ్లి నేడు ఈ స్థాయికి చేరుకున్నారు.
నటుడిగా కొత్త కోణం
స్టార్ హోదాను పక్కనపెట్టి 'వేదం' సినిమాలో కేబుల్ రాజు పాత్రలో నటించి బన్నీ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక నిరుపేద యువకుడిగా ఆయన కనిపించిన విధానానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మరికొన్నాళ్లకు బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టించింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులోని పాటలు బన్నీ మేనరిజమ్స్ ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ విజయాలు బన్నీని కేవలం డ్యాన్సర్‌గానే కాకుండా ఒక గొప్ప నటుడిగా నిలబెట్టాయి.
నేషనల్ అవార్డ్ సాధించిన తొలి తెలుగు నటుడు
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఏళ్లుగా అందకుండా మిగిలిపోయిన 'ఉత్తమ నటుడు' జాతీయ అవార్డును అల్లు అర్జున్ సాధించి చరిత్ర సృష్టించారు. 'పుష్ప: ది రైజ్' చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో ఆయన చూపించిన మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. 2023లో నేషనల్ అవార్డ్ అందుకోవడమే కాకుండా ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అలాగే 5 సైమా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం నటనతోనే కాకుండా తన హార్డ్ వర్క్‌తో టాలీవుడ్ ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన హీరోగా బన్నీ నిలిచిపోయారు.
పుష్ప 2తో మరో బిగ్గెస్ట్ హిట్
గత ఏడాది చివరలో విడుదలైన 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. విదేశాల్లో కూడా పుష్పరాజ్ మ్యానరిజమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయంటే బన్నీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మలయాళంలోనే కాకుండా అక్కడ కూడా కల్ట్ ఫ్యాన్ బేస్
ఒక తెలుగు హీరోకు పరభాషలో క్రేజ్ రావడం అరుదు. కానీ కేరళలో 'మల్లు అర్జున్' అనే పేరు వచ్చేలా అభిమానం లభించడం అల్లు అర్జున్ తోనే సాధ్యమైంది. మలయాళంలో అతని సినిమాలకు ఉండే డిమాండ్ మరే ఇతర తెలుగు హీరోకు లేదు. అలాగే 'పుష్ప' సినిమా తర్వాత ఉత్తరాదిలోనూ బన్నీకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. హిందీ ప్రేక్షకులు ఆయన నటనకు, స్టైల్‌కు ఫిదా అవుతున్నారు. భాషతో సంబంధం లేకుండా ఒక నటుడిగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలగడం మామూలు విషయం కాదు. కానీ బన్నీ జెట్ స్పీడులో ఆ క్రేజ్ అందుకున్నారు. సోషల్ మీడియాలో కూడా మోస్ట్ ఫాలోడ్ సౌత్ ఇండియన్ హీరోగా బన్నీ రికార్డు సృష్టించారు.
రాబోయే అతిపెద్ద సినిమాలు
అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టులు మరింత భారీగా ఉండబోతున్నాయి. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక బిగ్ బడ్జెట్ మూవీ రెడీ అవుతోంది. సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ మాస్ అడ్వెంచర్ ఫిల్మ్ అని ఇందులోని బన్నీ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్తోనే అంచనాలు ఊహించని స్థాయికి పెరిగాయి. అట్లీ సినిమాతో పాటు మరికొందరు దిగ్గజ దర్శకులతో బన్నీ సినిమాలు లైన్లో ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌పై ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అలాగే 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక సినిమాకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే మూడేళ్లలో అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం పక్కా అనిపిస్తోంది.

