అన్నపూర్ణ స్టూడియోస్‌లో చైతూ రోల్ ఏంటి? ఎప్పుడు రంగంలోకి దిగారు?
అత్యాధునిక డిజైన్‌ను స్టూడియోలో నిర్మించడమే తన లక్ష్యమన్న చైతన్య - స్టూడియోలో తన పాత్ర కేవలం నటనకు మాత్రేమే పరిమితం కాదన్న అక్కినేని హీరో

Published : May 2, 2026 at 8:08 AM IST
Naga Chaitanya On Annapurna Studios అన్నపూర్ణ స్టూడియోస్‌లో తన పాత్ర గురించి నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ స్టూడియోలో తన పాత్ర కేవలం నటనకు మాత్రేమే పరిమితం కాదని, సాంకేతికంగా దీన్ని అభివృద్ధి పరచడంలో తోడ్పడుతానని ఆయన అన్నారు. సుమారు ఏడెనిమిది సంవత్సరాల కింద తన తండ్రి ఆ స్టూడియోలో ప్రపంచ స్థాయి సౌండ్ మిక్సింగ్ సదుపాయాన్ని కల్పించాలనుకున్నప్పుడు తాను సినీ రంగంలోకి దిగానని చైతన్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రపంచ స్థాయిలో డాల్బీ ప్రీమియర్ సర్టిఫికేషన్ ప్రమాణాలను, అత్యాధునిక డిజైన్‌ను స్టూడియోలో నిర్మించడమే తన లక్ష్యమని చైతన్య తెలిపారు. స్టూడియో డెవలప్మెంట్లో సరైన విధానాలను అన్వేషించడంతో పాటు పోస్ట్ - ప్రొడక్షన్ సిస్టమ్‌లో సాంకేతికతను నిరంతరం మెరుగుపరచడం ద్వారా అన్నపూర్ణ స్టూడియోస్ డెవలప్మెంట్లో తాను నిమగ్నమై ఉన్నానని చైతన్య అన్నారు.
వృషకర్మ షూటింగ్ 90 శాతం పూర్తి
నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ " వృషకర్మ" ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయిందని, ఆగస్టు లేదా అక్టోబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నాగచైతన్య ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో నిధి అన్వేషకుడు అర్జున్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ క్యారెక్టర్ రెఫరెన్స్ కోసం పలు హాలీవుడ్ సినిమాలు చూశానన్నారు. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యం ఉందని తెలిపారు. 'విరూపాక్ష'తో థ్రిల్ పంచిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాత్సవ విలన్‌గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో తాను నటించిన 'దూత' వెబ్‌సిరీస్ సీజన్ 2 అప్‌డేట్ కూడా చైతన్య ఇచ్చారు. సీజన్ 1 జర్నలిజం ప్రధానంగా రూపొందగా సీజన్ 2లో మెడికల్ ప్రొఫెషన్ గురించి చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా లార్జర్‌దేన్ లైఫ్ కథ అని నాగచైతన్య అన్నారు. చివరి 25 నిమిషాలు ప్రేక్షకుడిని మరో ప్రపంచానికి తీసుకెళ్తుందన్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అంశాన్ని చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫ్యాన్సీ రేటుకు థియేట్రికల్ హక్కులు
'వృషకర్మ' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫ్యాన్సీ రేటుకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ.45 కోట్లకు ఈ డీల్ కుదిరినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆ ఏరియాలలో ఇది నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ అని తెలుస్తోంది. చైతూకి నాగవంశీతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. సితార బ్యానర్ స్టార్ట్ అయిందే 'ప్రేమమ్' సినిమాతో. ఆ తర్వాత 'శైలజా రెడ్డి అల్లుడు' మూవీ చేశారు. చైతన్యతో మరో సినిమా చేయడానికి నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందు ఇప్పుడు 'వృషకర్మ' సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
నిజంగా కష్టపడితే గుర్తింపు
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో 'తండేల్'లో నటనకు గానూ నాగచైతన్య ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు. " తండేల్ నా హృదయానికి చాలా దగ్గరైన కథ. అది నిజంగా సాహసవంతమైన ప్రయాణం. మనం నిజంగా కష్టపడితే గుర్తింపు తప్పకుండా వస్తుంది. అలా వచ్చింది జీవితాంతం ఉత్సాహాన్ని ఇస్తూనే ఉంటుంది " అని అవార్డు గెలుచుకున్న సందర్భంగా చైతన్య అన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ 50ఏళ్ల పండగ- సిబ్బందితో అక్కినేని ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు
'నిజాయితీగానే చేశాను, ఆదరించినందుకు థాంక్స్!'- నాగచైతన్య లేటెస్ట్ పోస్టు

