పెద్ది రివ్యూ: ఆట కాదు పోరాటం- రామ్ చరణ్ మూవీ ఎలా ఉందంటే?
గుర్తింపు కోసం పోరాడే క్రీడాకారుడి భావోద్వేగ ప్రయాణం - క్రికెట్, కుస్తీ నేపథ్యాల్లో ఆకట్టుకునే స్పోర్ట్స్ డ్రామా - నటుడిగా మరో మెట్టు ఎక్కిన రామ్‌చరణ్

Published : June 4, 2026 at 6:56 AM IST
Peddi Movie Review : తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో పెద్ది ఒకటి. ఉప్పెన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించగా, జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, భారీ నిర్మాణ విలువలు, విభిన్నమైన కథాంశం సినిమాపై విడుదలకు ముందే అంచనాలను పెంచాయి. మరి ఆ అంచనాలను పెద్ది ఎంతవరకు అందుకుందో చూద్దాం.
గుర్తింపు కోసం
కథ విషయానికి వస్తే విజయనగరం జిల్లా అడవుల మధ్య ఉన్న కొండకింద ఊరు ప్రభుత్వ రికార్డుల్లోనే లేని గ్రామం. అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి గ్రామంలో పుట్టి పెరిగిన యువకుడే పెద్ది (రామ్‌చరణ్). జీవనోపాధి కోసం కూలీ పనులు చేస్తూనే క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తాడు. అతడి ఆటను చూసి వివిధ జట్లు పోటీ పడేంత స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. అయితే జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అతడిని క్రికెట్ నుంచి దూరం చేస్తాయి. తర్వాత కుస్తీ రంగంలోకి అడుగుపెడతాడు. తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన అతడి ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ క్రమంలో అప్పలసూరి (జగపతిబాబు), గౌర్‌నాయుడు (శివరాజ్‌కుమార్) వంటి పాత్రలు అతడి జీవితంపై ప్రభావం చూపిస్తాయి. చివరకు పెద్ది తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే సినిమా ప్రధాన కథ.
ప్రేక్షకులను మనసు కదిలించేలా!
సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గుర్తింపు లేని గ్రామం నేపథ్యాన్ని చూపించిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. పెద్ది పాత్ర పరిచయం తర్వాత సినిమా వేగం అందుకుంటుంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌ల సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. హీరో ఆడే వినూత్న షాట్లు, మైదానంలో చూపించే దూకుడు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటాయి. మొదటి భాగంలో హీరోయిన్ ట్రాక్, కొన్ని సరదా సన్నివేశాలు కథ వేగాన్ని కొద్దిగా తగ్గించినా, అప్పలసూరి పాత్ర చుట్టూ జరిగే పరిణామాలు కథను మళ్లీ గాడిలో పెడతాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే భావోద్వేగ ఘట్టాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతాయి. రెండో భాగంలో కథ పూర్తిగా కుస్తీ నేపథ్యానికి మారుతుంది. కుస్తీ పోటీలు, శిక్షణ సన్నివేశాలు, పోరాట ఘట్టాలను దర్శకుడు బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా క్రికెట్, కుస్తీ అంశాలను కలిపి హీరో ప్రయాణాన్ని చూపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ఆస్పత్రి నేపథ్యంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల మనసును కదిలిస్తాయి.
నటనతో ఆకట్టుకున్న చెర్రీ
అయితే ఒక ఆట నుంచి మరో ఆటకు హీరో మారే ప్రక్రియను మరింత వివరంగా చూపించి ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది. అలాగే మొదటి భాగంలో కనిపించే కొన్ని పాత్రల ప్రవర్తన రెండో భాగంలో ఒక్కసారిగా మారిపోవడం సహజంగా అనిపించదు. కొన్ని సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపించినా, మొత్తం కథనంపై అవి పెద్దగా ప్రభావం చూపవు. నటీనటుల విషయానికి వస్తే రామ్‌చరణ్ ఈ చిత్రానికి ప్రధాన బలం. కూలీగా, క్రికెటర్‌గా, కుస్తీ క్రీడాకారుడిగా మూడు కోణాల్లో కనిపిస్తూ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ముఖ్యంగా కుస్తీ క్రీడాకారుడిగా కనిపించేందుకు ఆయన చేసిన శారీరక మార్పులు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి. భావోద్వేగ సన్నివేశాల్లోనూ, స్పోర్ట్స్ ఘట్టాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు.
నిర్మాణ విలువలు ప్రతి సన్నివేశంలో
జాన్వీ కపూర్ పాత్ర ప్రధానంగా మొదటి భాగానికే పరిమితమైంది. ఆమె అందం, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. జగపతిబాబు అప్పలసూరి పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. శివరాజ్‌కుమార్ పోషించిన గౌర్‌నాయుడు పాత్రకు హుందాతనం తీసుకొచ్చారు. ఇతర నటులకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో ఉంది. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక బలంగా నిలిచాయి. రత్నవేలు ఛాయాగ్రహణం ప్రతి ఫ్రేమ్‌ను అందంగా మలిచింది. గ్రామీణ నేపథ్యం, క్రీడా సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా కథనానికి అవసరమైన వేగాన్ని అందించింది. నిర్మాణ విలువలు ప్రతి సన్నివేశంలో కనిపిస్తాయి.
భావోద్వేగ ప్రయాణం
దర్శకుడు బుచ్చిబాబు సానా మరోసారి భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథనే ఎంచుకున్నారు. కమర్షియల్ అంశాలను జోడిస్తూ, ఒక స్పూర్తిదాయకమైన కథను చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, గుర్తింపు కోసం పోరాడే ఓ యువకుడి కథను హృద్యంగా చెప్పడంలో విజయం సాధించారు. మొత్తంగా చూస్తే పెద్ది కేవలం స్పోర్ట్స్ సినిమా మాత్రమే కాదు. ఆత్మగౌరవం, గుర్తింపు, పట్టుదల గురించి చెప్పే భావోద్వేగ ప్రయాణం. రామ్‌చరణ్ నటన, క్రీడా నేపథ్య సన్నివేశాలు, సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కమర్షియల్ హంగులతో పాటు మంచి కథ కోరుకునే ప్రేక్షకులకు పెద్ది మంచి అనుభూతిని అందించే చిత్రం.
పెద్ది ప్రీమియర్ షోలు- పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
పెద్దిలో మూడు ఆటలు- తెలుగు ప్రేక్షకులకు కిక్ ఇచ్చిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలివే!

