'టాక్సిక్' తర్వాత మరో పాన్ ఇండియా సినిమాపై దిల్ రాజు ఫోకస్- భారీ ధరకు డీల్?
టాక్సిక్ తర్వాత మరో పెద్ద సినిమా కోసం దిల్ రాజు ప్రయత్నాలు- రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతిలో డీల్ జరిగే ఛాన్స్- ఫైనల్ అయితే దిల్ రాజు చేతికి మరో భారీ డీల్

Published : August 28, 2026 at 12:09 PM IST
Dil Raju Eyes Ramayana Telugu Rights : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఇతర భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కే సినిమాలను కూడా ఆయన తీసుకుంటుంటారు. ఇటీవల యష్ నటించిన 'టాక్సిక్' తెలుగు హక్కుల విషయంలో పెద్ద మొత్తంతో ముందుకు వెళ్లారు. ఆ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఆయన పేరు వినిపిస్తోంది. ఈసారి మాట్లాడుతున్న మొత్తం కూడా చిన్నది కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే!
టాక్సిక్‌కు ఎంత పెట్టారంటే
'టాక్సిక్' తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం మొదట దాదాపు రూ.108 కోట్ల వరకు కమిట్‌మెంట్ ఉన్నట్లు టాక్ వచ్చింది. తర్వాత ఆ మొత్తం రూ.80 కోట్లకు మారినట్లు సమాచారం. రిలీజ్ సమయానికి బయ్యర్లు దాదాపు రూ.75 కోట్ల వరకు చెల్లించినట్లు కూడా వార్తలు వచ్చాయి. యష్‌కు 'కేజీఎఫ్' సినిమాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఏర్పడటంతో 'టాక్సిక్' హక్కులకు మొదటి నుంచే భారీ ధర పలికింది. అయితే ఈ డీల్‌ను దిల్ రాజు పూర్తిగా ఔట్‌రైట్ పద్ధతిలో తీసుకోలేదని టాక్. రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతిలో హక్కులు తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు రామాయణం కోసం బిగ్ డీల్?
ఇప్పుడు దిల్ రాజు, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అయితే థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపు రూ.105 కోట్ల వరకు ఆఫర్‌పై చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఈ డీల్ కూడా రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతిలోనే ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పటివరకు ఒప్పందం పూర్తయినట్లు అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం రెండు వైపులా ధర, ఇతర షరతులపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రిటర్నబుల్ అడ్వాన్స్ అంటే
రిటర్నబుల్ అడ్వాన్స్‌లో డిస్ట్రిబ్యూటర్ ముందుగా నిర్మాతకు ఒక మొత్తం ఎమౌంట్ చెల్లిస్తారు. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్ల నుంచి వచ్చే షేర్‌తో ఆ డబ్బును రికవర్ చేసుకుంటారు. అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగకపోతే మిగిలిన మొత్తాన్ని నిర్మాత నుంచి సెటిల్ చేసుకుంటారు. ఇక ఎలా సెటిల్ చేయాలన్నది ముందుగా చేసుకున్న ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. అందుకే పూర్తిగా ఔట్‌రైట్‌గా హక్కులు కొనడం కంటే ఈ పద్ధతిలో డిస్ట్రిబ్యూటర్‌పై రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. 'టాక్సిక్' విషయంలో కూడా దిల్ రాజు ఇదే మార్గం ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పుడు 'రామాయణం'కు కూడా అలాంటి డీల్ ఫైనల్ అయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
డీల్ ఫైనల్ అయితే పెద్ద లెక్కే
'రామాయణం' భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ గట్టిగానే ఉంది. ఇక 105 కోట్లకు డీల్ పూర్తయితే మాత్రం థియేట్రికల్ బిజినెస్‌లో అది భారీ డీల్ అవుతుంది. దిల్ రాజు ఇప్పటికే ‘టాక్సిక్’లాంటి పెద్ద సినిమాతో వచ్చారు. ఇప్పుడు మరో పెద్ద డీల్ అంటే వారి కెరీర్లో కూడా మరో రికార్డ్ అవుతుంది. రామాయణ సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు. మొదటి భాగాన్ని ఓవర్సీస్ లో నవంబర్ 6న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. భారత్‌లో మాత్రం దీపావళి రోజు నవంబర్ 8న విడుదల చేయనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు. రెండో భాగం 2027 దీపావళికి రానుంది.
'టాక్సిక్' ఫస్ట్ డే వసూళ్లు- 'యశ్' గ్యాంగ్‌స్టర్ డ్రామాకు తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
వామ్మో! ఒక్కడే ఏడు పాత్రలు - 'రామాయణ'లో ఆ నటుడి డిఫరెంట్ రోల్స్!

