ETV Bharat / entertainment

60ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్​కు మళ్లీ పెళ్లి- నెట్టింట వెడ్డింగ్ డేట్ వైరల్!

మళ్లీ పెళ్లి చేసుకోనున్న ఆమిర్ ఖాన్- డేట్ కూడా ఫిక్స్!- సోషల్ మీడియాలో ఇదే హాట్​టాపిక్

Aamir Khan Marriage
Aamir Khan Marriage (Source : IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : June 3, 2026 at 6:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Aamir Khan Marriage : బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆయన పెళ్లి చేసుకోనున్నారని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముంబయిలోని ఆయన ఇంట్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంటారని తెలిసింది. అలాగే ఈ వివాహానికి వచ్చే నెల 05వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఇది బీ టౌన్ వర్గాల్లో హాట్​టాపిక్​గా మారింది. అయితే, ఈ వార్తలపై ఆమిర్ ఖాన్ గానీ, ఆయన టీమ్​ గానీ ఇప్పటివరకు స్పందించలేదు.

60వ పుట్టిన రోజున గౌరీని పరిచయం చేసిన ఆమిర్
2025 మార్చిలో తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గౌరీ స్ప్రాట్‌ను మీడియాకు పరిచయం చేసిన ఆమిర్ ఖాన్, తమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పటికే ఏడాదిన్నర నుంచి ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఆమెను మీడియాకు పరిచయం చేస్తూ తనకెంతో మద్దతు ఇస్తుందని తెలిపారు. తమ దృష్టిలో వివాహమంటే రెండు మనసుల కలయిక అని, అలా చూస్తే తాము పెళ్లి చేసుకున్నట్టేనని అప్పుడు వ్యాఖ్యానించడం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇక, గౌరి విషయానికొస్తే కొంత కాలంగా ఆమిర్‌ఖాన్‌ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పనిచేస్తున్నారామె.

హాజరుకానున్న ప్రముఖులు!
సినీ వర్గాల సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలోనే ఈ వివాహం జరగనుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఆమిర్- గౌరీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో సాధారణంగా కనిపించే భారీ రిసెప్షన్లు, గ్రాండ్ వేడుకలకు దూరంగా ఉండాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం. వివాహం పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమంగానే జరగనున్నప్పటికీ, బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు హాజరయ్యే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా షారుక్ ఖాన్, సల్మాన్​ వంటి స్టార్ హీరోలు ఈ వేడుకకు హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమిర్ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం
ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం కానుంది. 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనాదత్తాను వివాహం చేసుకున్న ఆయనకు జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు 16 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2002లో వారు విడిపోయారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్​ రావ్​ను వివాహం చేసుకున్న ఆమిర్‌కు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2021లో ఈ జంట కూడా విడిపోతున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ కిరణ్ రావుతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆమిర్ పలుమార్లు వెల్లడించారు.

గౌరీకు ఇప్పటికే కుమారుడు
గౌరీ స్ప్రాట్‌కు ఇప్పటికే ఏడేళ్ల కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఆమిర్ కుటుంబ సభ్యులతో కూడా ఆమె సన్నిహితంగా మెలుగుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ బంధం వివాహంగా మారుతుందా అనే చర్చ చాలా కాలంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పెళ్లి అంశం తెరమీదకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఆమిర్ ఖాన్ వివాహంపై వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జూలై 5న నిజంగానే ఈ జంట పెళ్లి పీటలెక్కుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్తలను కేవలం ప్రచారంగానే పరిగణించాల్సి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఆమిర్ ఖాన్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాఠశాల నుంచి పంపేస్తారనే భయంతో ఆమిర్ ఉండేవాడు

ఒక్క సినిమా కోసం 10 వేల కిళ్లీలు తిన్న ఆమిర్