Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా దివ్య - భరణిపై ట్రోలింగ్!
- డీజే టాస్కులో "న్యూట్రల్"గా భరణి - ఆట తీరుపై నెటిజన్ల చర్చ

Published : November 1, 2025 at 4:38 PM IST
Bigg Boss 9 Telugu Updates: బిగ్‌బాస్ సీజన్ 9లో ఎనిమిదో వారానికిగానూ కెప్టెన్‌గా దివ్య ఎన్నికైంది. చివరి వరకు నిలిచిన దివ్య - తనూజలో హౌజ్‌మేట్స్ దివ్యకు మద్దతుగా నిలిచారు. అయితే తనూజ ఓడిపోవడానికి కారణం నాన్న నాన్న అంటూ పిలిచే భరణియే అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఎందుకు? అసలు కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
భరణికి స్పెషల్ పవర్: బిగ్‌బాస్ హౌజ్‌లో కెప్టెన్‌ను ఎన్నుకునే విధానం నార్మల్‌గానే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా హౌజ్‌మేట్స్‌ను రెండు గ్రూపులుగా విడగొట్టి వాళ్లకు కొన్ని టాస్కులు పెడతారు. గెలిచిన టీమ్‌లోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలుస్తారు. ఆ కంటెడర్స్కు టాస్క్‌లు పెడితే.. అందులో గెలిచిన వారు కెప్టెన్ అవుతారు. ఇది మొదటి సీజన్ నుంచి జరుగుతున్న వ్యవహారమే. అంతెందుకు ఈ సీజన్లో ఏడో వారం వరకు కూడా ఇదే పద్ధతిలో కెప్టెన్సీ టాస్క్‌లు జరిగాయి. అయితే ఎనిమిదో వారంలో సీన్ రివర్స్ అయ్యింది. ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజలకు రీఎంట్రీ అవకాశం కల్పిస్తూ వాళ్లిద్దరినీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. ఈ ఇద్దరికీ పలు టాస్క్‌లు నిర్వహించారు. దీంతో ఈ వారం మొత్తం వీళ్లకు సంబంధించిన టాస్క్‌లు మాత్రమే జరిగాయి. ఇక ఇది చూసిన ఆడియన్స్ ఈ వారం కెప్టెన్ ఉండరని ఫిక్స్ అయ్యారు.
అయితే అటు టాస్కుల్లో, ఇటు ఆడియన్స్ ఓటింగ్‌తో గెలిచిన భరణిని పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా ఉంటాడని ప్రకటించిన బిగ్‌బాస్.. శ్రీజను మరోసారి ఎలిమినేట్ చేశాడు. అంతేకాదు భరణికి స్పెషల్ పవర్ ఇచ్చాడు. అదే కెప్టెన్సీ కంటెండర్లను ఎంచుకునే ఛాన్స్. "ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగుర్ని సెలక్ట్ చేసే పవర్ మీకు ఇస్తున్నాను. ఇందులో కావాలంటే మీ పేరు కూడా పెట్టుకోవచ్చు" అని బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. తనతో సహా తనూజ, దివ్య, సాయి, నిఖిల్‌ను కంటెండర్లుగా ఎంచుకున్నట్లు భరణి చెప్పాడు.
కెప్టెన్సీ టాస్క్ విధానం ఇదే: ఇక కెప్టెన్సీ కోసం "డీజే టాస్క్" పెట్టాడు బిగ్‌బాస్. "ఈ టాస్కులో భాగంగా ప్లే అవుతున్న మ్యూజిక్‌కి ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. ఆ డ్యాన్స్ చేసే వ్యక్తిని కెప్టెన్‌గా చూడాలనుకుంటే వాళ్లకి సపోర్ట్‌గా మరో ప్లాట్‌ఫామ్‌పై హౌజ్‌మేట్స్ డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ చేస్తున్న సపోర్టర్స్‌ని నచ్చనివాళ్లు కిందకి దించొచ్చు. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది సపోర్టర్స్ ఉంటే ఆ కంటెండర్‌కి అంత బలం. ఈ టాస్కుకి రాము సంచాలక్" అని చెప్పాడు.
ముందుగా సాయి పేరు పిలిచాడు బిగ్‌బాస్. దీంతో సాయి ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేశాడు. ఇక సాయికి సపోర్ట్ చేస్తూ కేవలం సంజన మాత్రమే చివరి వరకూ ఉంది. నెక్స్ట్ దివ్యకి సపోర్ట్‌గా ఐదుగురు నిలబడ్డారు. ఇక నిఖిల్‌కి సపోర్ట్‌గా ముగ్గురు నిలబడ్డారు. నెక్స్ట్ భరణి డ్యాన్స్ చేస్తున్నప్పుడు మొత్తం నలుగురు సపోర్ట్‌గా నిలిచారు. చివరగా తనూజ డ్యాన్స్ చేస్తుంటే అత్యధికంగా 8 మంది మద్దతు ఇచ్చారు.
ఇక చివరి రౌండ్ తనూజ-దివ్య మధ్య జరిగింది. ఈ టాస్క్‌లో తనూజ వైపు నలుగురు(మాధురి, రీతూ, డీమాన్, కళ్యాణ్) సపోర్ట్‌గా నిలబడ్డారు. దివ్య వైపు ఐదుగురు (సాయి, ఇమ్మూ, గౌరవ్, సుమన్ శెట్టి, సంజన) నిల్చున్నారు. దీంతో సాంగ్ పూర్తయ్యే సమయానికి దివ్య టీమ్‌లో ఎక్కువ మంది ఉండటంతో దివ్య గెలిచి కెప్టెన్ అయినట్లు సంచాలక్‌గా ఉన్న రాము ప్రకటించాడు. దీంతో ఎనిమిదో వారానికి దివ్య కెప్టెన్‌గా ఎన్నికైంది.
భరణి తీరుకు అర్థం అదేనా? : అయితే ఈ టాస్క్‌లో ఎవరికీ సపోర్ట్ చేయకుండా ఉన్న భరణిని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తనూజ ఓడిపోవడానికి భరణి తీరే కారణమని కామెంట్లు చేస్తున్నారు. అటు దివ్య టీమ్ వైపు వెళ్లకుండా, ఇటు తనూజవైపు వెళ్లకుండా న్యూట్రల్‌గా ఉండిపోయారు. దీంతో సాంగ్ పూర్తి అయ్యే సమయానికి దివ్య టీమ్‌లో ఐదుగురు, తనూజ టీమ్‌లో నలుగురు ఉన్నారు. దీంతో దివ్య విన్ అయ్యింది. అయితే తనూజ టీమ్‌లోకి భరణి వస్తే టాస్క్ టై అయ్యేదని, అప్పుడు బిగ్‌బాస్ వేరే డెసిషన్ తీసుకునే వారు అని కామెంట్లు చేస్తున్నారు. భరణి కావాలనే తనూజ వైపు వెళ్లకుండా ఇండైరెక్ట్‌గా దివ్యకు సపోర్ట్ చేశారని అంటున్నారు. దీంతో బాండింగ్ విషయంలో తనూజ క్లియర్‌గా ఉందని, భరణికి క్లారిటీ లేదని చెబుతున్నారు.
Bigg Boss 9 Telugu: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు! - ఎనిమిదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

