ETV Bharat / entertainment

'నాపై ఆ బాధ్యత ఉంది'- రిటైర్మెంట్​ తర్వాత అర్జిత్ మరో ప్రకటన!

రిటైర్మెంట్​ ప్రకటించిన అర్జిత్​ సింగ్​ - గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్​ విషయంపై రియాక్షన్​ - కొత్త పాటల విడుదల ఎప్పుడు?

Arijit Singh Retirement Update
Arijit Singh Retirement Update (Getty images)
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 5:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

Arijit Singh Retirement Update : బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్​ సింగ్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇకపైనా ఆయన పాటలు విడుదల కానున్నాయి. అయితే రిటైర్మెంట్​ తర్వాత కూడా ఆయన నుంచి కొత్త పాటలు రానుండడంపై అభిమానులు కన్​ఫ్యూజ్​ అవుతున్నారు. దీనిపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. రిటైర్మెంట్ తర్వాత కొత్త ప్రాజెక్ట్​లను ఒప్పుకోనప్పటికీ, ఇప్పటికే అగ్రిమెంట్​ చేసుకున్న పాటలను కంప్లీట్ చేయాల్సి ఉందని స్పష్టతనిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్​లో ఓ పోస్టు షేర్ చేశారు.

ఆ బాధ్యత నాదే
అర్జిత్​ సింగ్​ రీసెంట్​గా ఓ ప్రకటన విడుదల చేశారు. "ఈ సందేశం నా అభిమానుల కోసం. మీరు నా పాటలు వినే వారు కాకపోతే దయచేసి దీన్ని పట్టించుకోకండి. ఇది నా విన్నపం. నా అభిమానులందరికీ నమస్కారం. ఈ జాలిలేని ప్రపంచం నాపై దయ ఉంచిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదు. అయినప్పటికీ గతంలో అగ్రిమెంట్ చేసుకున్న పాటలు చాలానే ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. వాటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాను. అవన్నీ ఈ ఏడాదిలోనే అయిపోవచ్చు. లేదంటే వచ్చే ఏడాదిలోనైనా కంప్లీట్ అవ్వొచ్చు" అని పోస్ట్​లో పేర్కొన్నారు.

అలాగే తన నిర్ణయంపై ఇతరులతో వాదించవద్దని తన అభిమానులను కోరారు. ఈ విషయాలనుఇతరులకు వివరించడానికి తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు. ప్రశాంతంగా ఉంటూ, తమ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టమని సూచించారు. కాగా, గతనెల అర్జిత్​ సింగ్ రిటైర్మెంట్​ ప్రకటించారు. "నేను ఇకపై ఎలాంటి కొత్త పాటలు ఒప్పుకోను. ఇది ఒక గొప్ప ప్రయాణం. దీని వెనుక ఎలాంటి కారణాలు లేవు. దీని గురించి నేను ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాను. ఇప్పటికి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాను" అని అన్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్​ నిరాశ చెందారు.

రీసెంట్​గా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్,​ ముర్షిదాబాద్​లోని అర్జిత్ ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను జీ మ్యూజిక్ కంపెనీ షేర్ చేసింది. అందులో ఆమిర్​, అర్జిత్​ ఇద్దరూ కలిసి నేలపై కూర్చుని క్యూజువల్​గా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఆమిర్ "నువ్వు ఏ ప్రాజెక్టులూ చేయడం లేదు. కొంతకాలంగా నువ్వు విరామం తీసుకోవాలనుకుంటున్నావా? లేదా హిందీ చిత్రాలకు పాడకూడదని అనుకుంటున్నావా?" అని అర్జిత్​ను అడిగారు. దానికి, అర్జిత్​ నవ్వుతూ, ప్లేబ్యాక్ సింగింగ్​ నుంచి తను శాశ్వతంగా రిటైర్ అవుతున్నట్లు చెప్పారు. దానికి ఆమిర్​ "అలాంటి నిర్ణయం తీసుకోకు. నువ్వు అలా చేస్తే మా పరిస్థితి ఏంటి?" అని అన్నారు.