ETV Bharat / entertainment

బాలయ్య మూవీనే విజయ్​ రీమేక్ చేస్తున్నారా?- క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాపై సోషల్ మీడియాలో చర్చ - బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా రీమేక్ అంటూ ప్రచారం - స్పందించిన దర్శకుడు అనిల్ రావిపూడి

ANIL RAVIPUDI ON JANA NAYAGAN
ANIL RAVIPUDI ON JANA NAYAGAN (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : December 31, 2025 at 8:04 AM IST

|

Updated : December 31, 2025 at 9:05 AM IST

3 Min Read
Choose ETV Bharat

Anil Ravipudi Jana Nayagan Remake : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన సినిమా జన నాయగన్ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ కెరీర్‌లో చివరి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2026 జనవరి 9న పొంగల్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. అయితే జన నాయగన్ సినిమాపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి జన నాయగన్ సినిమా రీమేక్ అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వార్తలపై తాజాగా భగవంత్ కేసరి దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

చాలా దాచి పెట్టి చెబుతున్నారు: అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి రీమేక్ ప్రచారాలపై స్పందించారు. "వాళ్లు కూడా చాలా దాచి పెట్టి చెబుతున్నారు. ఆ మూవీ డైరెక్టర్ కూడా ఇది దళపతి విజయ్ సినిమా అని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు దీన్ని అలాగే ట్రీట్ చేద్దాం. ఇది దళపతి విజయ్ సినిమా. విజయ్‌ను నేను కలిశాను. అయన సూపర్ జెంటిల్మెన్. ఆయన పొలిటికల్‌గా వెళ్తుండటంతో ఆయన చివరి సినిమా ఇది. విజయ్ చివరి సినిమాలో నా పాత్ర ఉందా? లేదా? అనేది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అప్పటివరకు దీనిని పూర్తిగా ఒక దళపతి విజయ్ సినిమాగా మాత్రమే చూడాలి" అని దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

జన నాయగన్ డైరెక్టర్ రియాక్షన్
రిమేక్ అంశంపై ఇటీవల మలేసియాలో జరిగిన జన నాయగన్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు హెచ్.వినోద్ కూడా స్పందించారు. "కొంతమంది జన నాయగన్ మూవీని రీమేక్ అని, మరికొంత మంది పార్ట్ రీమేక్ అని అంటున్నారు. చాలా స్పష్టంగా చెబుతున్నా. ఇది 100 శాతం దళపతి విజయ్ సినిమా. థియేటర్లలో ప్రతి ఒక్కరూ ఆస్వాదించే కమర్షియల్ ఎంటర్‌టైనర్" అని హెచ్.వినోద్ స్పష్టం చేశారు. అయితే అనిల్ రావిపూడి, హెచ్.వినోద్ చేసిన కామెంట్స్ విషయంలో వైరుధ్యం కనిపిస్తోంది. ఇది రీమేక్ కాదని హెచ్.వినోద్ చెప్పినంత గట్టిగా అనిల్ చెప్పలేదు. పైగా, రిలీజ్ అయ్యాక ఆ సినిమాలో తన పాత్ర ఉందా? లేదా? అనేది తెలుస్తుందని అనిల్ నవ్వుతూ చెప్పడంపై సినీ ప్రియుల్లో అనుమానాలు అలాగే ఉన్నాయి.

ఈ చర్చకు కారణం VTV గణేశ్
జన నాయగన్ మూవీ రీమేక్ అనే చర్చ మొదలవడానికి కారణం తమిళ నటుడు వీటీవీ గణేశ్ చేసిన కామెంట్స్. సరిగ్గా ఏడాది క్రితం సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆయన దళపతి విజయ్ గురించి మాట్లాడే క్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సంక్రాంతికి వస్తున్నాంలో వీటీవీ గణేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ క్రమంలో ఆ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ "తన చివరి సినిమాాగా భగవంత్ కేసరిని రిమేక్ చేయమని అనిల్ రావిపూడిని దళపతి విజయ్ అడిగారు. కానీ రిమేక్ చేయనని అనిల్ చెప్పి వచ్చేశారు" అని గణేశ్ వెల్లడించారు. అయితే వీటీవీ గణేశ్ మాట్లాడుతున్న సమయంలో అనిల్ రావిపూడి అడ్డుకున్నారు. వాళ్లు ఇది రీమేక్ అని చెప్పడం లేదంటూ అనిల్ చెప్పడం మైక్‌లో వినపడింది. ఇక అప్పటి నుంచి ఇది రీమేక్ అన్న ప్రచారం నడుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో నటించిన శ్రీలీల కూడా ఇటీవల ఈ సినిమా రీమేక్‌పై స్పందించారు. జన నాయగన్ రీమేక్ అనేది తనకు కూడా తెలియదని చెప్పారు. అయితే రీమేక్ మూవీనా? కాదా? అని తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

'ఏంటి బాసూ సంగతి, అదిరిపోద్దీ సంక్రాంతి'- చిరు, వెంకీ మాస్ సాంగ్ రిలీజ్

ఏకంగా రూ.19వేల కోట్ల వసూళ్లు- 2025లో వరల్డ్ టాప్ మూవీ ఏదో తెలుసా?

Last Updated : December 31, 2025 at 9:05 AM IST