ETV Bharat / entertainment

ఆసక్తిగా బన్నీ, అట్లీ మూవీ టైటిల్- ఇంతకీ ఏం పేరు పెట్టారంటే?

బన్నీ బర్త్‌డే సందర్భంగా AA22XA6 టైటిల్ అనౌన్స్- రాకా పేరుతో పాన్ ఇండియా మూవీకి భారీ అంచనాలు- డిఫరెంట్ బీస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ వైరల్

Allu Arjun Atlee Movie
Allu Arjun Atlee Movie (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 8, 2026 at 11:10 AM IST

3 Min Read
Choose ETV Bharat

Allu Arjun Atlee Movie Title : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్​ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. AA22XA6 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ కీలక అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఆ చిత్రానికి రాకా (Raaka) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సాధారణంగా హీరో లుక్‌ను నేరుగా చూపించే పోస్టర్ రిలీజ్ చేస్తారు. అయితే ఈసారి టీమ్ కొంచెం భిన్నంగా ఆలోచించి ముందుగా జంతువు పంజా ఉన్న పోస్టర్‌తో సస్పెన్స్ క్రియేట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో టైటిల్‌పై భారీ చర్చ నడిచింది.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ పూర్తిగా డిఫరెంట్ గెటప్‌లో కనిపించడం విశేషం. గుండు లుక్, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ అపీరెన్స్‌తో బన్నీ పూర్తిగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. ఈ లుక్ చూసిన అభిమానులు షాక్ అవుతూనే సినిమాపై మరింత ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మీ ఊహలకు మించి సినిమా ఉంటుంది' అంటూ చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ మరింత హైప్‌ను పెంచుతోంది.

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అట్లీ సినిమాలకు ఉండే మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా అన్నీ కలిపి ఈ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని సమాచారం. సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. మొదటి నుంచే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ సినిమాల్లో సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఈ సినిమాలో కూడా మరో హీరోయిన్ ఉంటుందనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించినా, ఆమె మాత్రం ఆ వార్తలను ఖండించింది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియోలో వెల్లడించారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ ఓ రాక్షసుడి చేతిని చూస్తూ ఆశ్చర్యపడే సన్నివేశం కూడా చూపించారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను ఫస్ట్ లుక్‌లో కొనసాగించడం ఆసక్తికరంగా మారింది.

మ్యూజిక్ విషయానికి వస్తే, మొదట ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా సినిమాపై కొత్త ఆసక్తిని పెంచుతోంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో రాకా నిజంగా పాన్ వరల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి రాకా టైటిల్, బన్నీ షాకింగ్ లుక్, అట్లీ మార్క్ ప్రెజెంటేషన్ అన్నీ కలిసి ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ ప్రత్యేక చిత్రంగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. బన్నీ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రియులందరూ ఇప్పుడు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విమర్శల నుంచి నేషనల్ అవార్డ్ వరకు- బన్నీ ప్రయాణం 'తగ్గేదేలే'!- ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026: పురస్కారాలను రూల్ చేసిన 'పుష్ప 2'- బన్నీ అరుదైన రికార్డు