టాలీవుడ్ సెలబ్రిటీ సిబ్లింగ్స్- ఈ స్టార్స్ బ్రదర్స్ అని మీకు తెలుసా?- లిస్టులో యువ హీరోలు కూడా
అన్న డైరెక్టర్ తమ్ముడు హీరో!- ప్రముఖ స్టార్లు బంధువులు అని మీకు తెలుసా?

Published : October 18, 2025 at 8:31 PM IST
Tollywood Siblings : ప్రపంచంలో అన్ని బంధాల కంటే రక్త సంబంధమే బలమైనది. ముఖ్యంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం చాలా ప్రత్యేకం. చిన్నప్పటి నుంచి అల్లరి, గొడవలు, ప్రేమ అన్నీ పంచుకుంటారు. సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి బంధాలు చాలానే ఉన్నాయి. చిరంజీవి పవన్ కల్యాణ్, సూర్య కార్తి వంటి స్టార్ బ్రదర్స్ గురించి అందరికీ తెలుసు. కానీ, టాలీవుడ్‌లో చాలా మందికి తెలియని, పెద్దగా బయట కనిపించని కొంతమంది స్టార్ల బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఇక ఆ సీక్రెట్ సిబ్లింగ్స్ ఎవరో చూద్దాం.
ఓంకార్ బ్రదర్స్
యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి, 'రాజు గారి గది' సిరీస్‌తో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా మారిన ఓంకార్ గురించి అందరికీ తెలుసు. అయితే, అతనికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని, వాళ్లు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారని చాలా మందికి తెలియదు. ఒక తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా సినిమాలు చేస్తుండగా, మరో తమ్ముడు కల్యాణ్ నిర్మాణ రంగంలో ఉన్నాడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసే 'రాజు గారి గది' సిరీస్‌ను నిర్మిస్తున్నారు.
రామ్, శర్వానంద్ బంధం!
ఈ విషయం తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, విలక్షణ నటుడు శర్వానంద్ ఇద్దరూ దగ్గరి బంధువులు, కజిన్స్. శ్రవంతి మూవీస్ అధినేత, రామ్ పెదనాన్న అయిన రవికిషోర్‌కు, శర్వానంద్ తల్లికి మధ్య బంధుత్వం ఉంది. అయితే, వీళ్లిద్దరూ ఈ విషయం గురించి ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడలేదు, కలిసి పెద్దగా ఫొటోలలో కూడా కనిపించరు. అందుకే వీరి బంధుత్వం చాలా మందికి తెలియదు.
ఒకే ఒక్క సినిమాతో మాయమైన శ్రీకాంత్ తమ్ముడు
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వందకు పైగా సినిమాలు చేసిన శ్రీకాంత్‌కు ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు అనిల్ మేక. అన్నలాగే హీరో అవ్వాలని, 2000వ దశకం మొదట్లో 'ప్రేమించేది ఎందుకమ్మా' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ, ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో, నటనకు దూరంగా ఉండిపోయాడు.
అన్న డైరెక్టర్- తమ్ముడు హీరో!
ఈ అన్నదమ్ముల గురించి కొంతమందికి తెలిసినా, ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడే హీరో సాయిరామ్ శంకర్. అన్న దర్శకత్వంలోనే '143' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'బంపర్ ఆఫర్', 'నేనింతే', 'డేంజర్' వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.
తండ్రి స్టార్ ప్రొడ్యూసర్..
సౌత్ ఇండియాలో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నంకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్లే జ్యోతి కృష్ణ, రవి కృష్ణ. తండ్రి పెద్ద ప్రొడ్యూసర్ అయినా, అన్న జ్యోతి కృష్ణ దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాకు కూడా క్రిష్ తప్పుకోవడంతో డైరెక్షన్ చేశాడు, తమ్ముడు రవి కృష్ణ 7G బృందావన కాలనీతో హీరోగా బిగ్ హిట్ అందుకున్నాడు. రవి కృష్ణ హీరోగా నటించిన 'కేడి', 'ఊ ల ల ల' వంటి సినిమాలకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించాడు.
విశాల్, విక్రమ్ కృష్ణ!
తెలుగు, తమిళ భాషలలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌కు ఒక అన్నయ్య ఉన్నాడు. అతని పేరు విక్రమ్ కృష్ణ. అతను కూడా ఒకప్పుడు నటుడిగా చేసి, ఆ తర్వాత ప్రొడ్యూసర్‌గా మారాడు. తమ్ముడు విశాల్ హీరోగా 'జీకే ఫిల్మ్ కార్పొరేషన్' అనే బ్యానర్‌పై ఎన్నో సినిమాలను నిర్మించాడు.
తమ్ముడితోనే ఎక్కువ హిట్స్ కొట్టిన అన్న!
ఈ అన్నదమ్ముల కాంబో కోలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్. తమ్ముడు జయం రవి హీరోగా, అన్న మోహన్ రాజా దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. విశేషం ఏంటంటే, మోహన్ రాజా దర్శకుడిగా పరిచయమైంది 'హనుమాన్ జంక్షన్' అనే తెలుగు సినిమాతోనే. ఆయనే ఇప్పుడు చిరంజీవితో 'గాడ్‌ఫాదర్' (లూసిఫర్ రీమేక్) సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఒకప్పటి హీరోయిన్లు అక్కాచెల్లెళ్లు
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించిన శ్రీదేవి విజయ్ కుమార్, వనిత విజయ్ కుమార్, ప్రీత విజయ్ కుమార్ ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. వీరు అలనాటి దిగ్గజ నటుడు విజయ్ కుమార్, హీరోయిన్ మంజుల దంపతుల కుమార్తెలు. ఈ అక్కాచెల్లెళ్లలో శ్రీదేవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం.

