ETV Bharat / entertainment

ఆదివారం మాత్రమే రెస్ట్- అడవిలోనే 90% షూటింగ్- 50ఏళ్ల 'భక్త కన్నప్ప' ప్రత్యేక విశేషాలు ఇవే!

హాలీవుడ్ స్థాయి పౌరాణిక చిత్రం తీయాలన్న కృష్ణంరాజు సంకల్పం - విడుదలైన అన్ని కేంద్రాల్లో 100 రోజుల విజయ ప్రదర్శన- - అడవుల్లో 70 రోజుల షూటింగ్‌తో తెరకెక్కిన క్లాసిక్ మూవీ

50 Years of  Bhakta Kannappa
50 Years of Bhakta Kannappa (EENADU)
author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2026 at 11:49 AM IST

4 Min Read
Choose ETV Bharat

50 Years Of Bhakta Kannappa : తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భక్తి చిత్రం "భక్త కన్నప్ప" విడుదలై నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది రెబల్ స్టార్ కృష్ణంరాజే. భక్తి, భావోద్వేగం, అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ విజయానికి వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు, ఆసక్తికరమైన అనుభవాలు దాగి ఉన్నాయి. నిర్మాతగా, నటుడిగా కృష్ణంరాజు చూపిన పట్టుదలే ఈ సినిమాను చిరస్థాయిగా నిలిపింది.

హాలీవుడ్ చిత్రాలంటే ప్రత్యేకమైన అభిమానం
కృష్ణంరాజుకు హాలీవుడ్ చిత్రాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ముఖ్యంగా "బెన్ హర్", "ది టెన్ కమాండమెంట్స్" వంటి భారీ పౌరాణిక సినిమాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. అలాంటి స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్ప భక్తి చిత్రాన్ని అందించాలని ఆయన భావించారు. అలా "భక్త కన్నప్ప" సినిమా ఆలోచనకు రూపం వచ్చింది. మొదట ఈ సినిమాను దర్శకుడు మధుసూదనరావుతో చేయాలని కృష్ణంరాజు నిర్ణయించారు. ఆయనతో కలిసి కొన్ని పాటలను కూడా రికార్డు చేశారు. అయితే అనూహ్యంగా మధుసూదనరావు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అదే సమయంలో 'ముత్యాలముగ్గు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు బాపు పేరు పరిశీలనలోకి వచ్చింది.

కృష్ణంరాజు కెరీర్‌లో 77వ చిత్రం
కృష్ణంరాజు స్వయంగా బాపును కలిసి 'భక్త కన్నప్ప' కథను వివరించారు. కథలో కొన్ని మార్పులు అవసరమని భావించిన బాపు, ఆ బాధ్యతను ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణకు అప్పగించారు. వారి కలయికతో కథ మరింత బలపడింది. కృష్ణంరాజు కెరీర్‌లో ఇది 77వ చిత్రం కాగా, దర్శకుడు బాపు దర్శకత్వం వహించిన 10వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటి అవుట్‌డోర్ షూటింగ్. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు అప్పట్లో లేవు. అయినప్పటికీ యూనిట్ సభ్యులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటూ చిత్రీకరణ పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, గుటాల అటవీ ప్రాంతాల్లో ఈ సినిమా ఎక్కువ భాగం షూట్ చేశారు. అక్కడ షూటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయడానికే దాదాపు రెండు నెలల సమయం పట్టింది.

50 Years of  Bhakta Kannappa
50 ఏళ్ల భక్త కన్నప్ప (EENADU)

అడవుల్లోనే చిన్నపాటి వర్క్‌షాపులు
మద్రాసు నుంచి పనిముట్లు, సెట్స్ సామగ్రి, సిబ్బందిని ప్రత్యేకంగా అక్కడికి తరలించారు. అప్పట్లో ఏ చిన్న వస్తువు కావాలన్నా బెజవాడకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో రోజూ కార్లు బుట్టాయిగూడెం నుంచి విజయవాడకు తిరుగుతూనే ఉండేవి. ఏదైనా వస్తువు అందుబాటులో లేకపోతే ఆ రోజు షూటింగ్ ఆగిపోయే పరిస్థితి ఉండేది. దాదాపు 70 నుంచి 80 మంది యూనిట్ సభ్యులు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యలకు పరిష్కారంగా కార్పెంటర్లు, టైలర్లు, సెట్ డిజైనర్లు తమకు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుని షూటింగ్ ప్రాంతంలోనే ఉండేవారు. అడవుల్లోనే చిన్నపాటి వర్క్‌షాపులు ఏర్పాటు చేసి అవసరమైన వస్తువులను అక్కడికక్కడే తయారు చేసేవారు. ఆ కాలానికి ఇది చాలా పెద్ద ప్లానింగ్‌గా చెప్పుకోవచ్చు.

ఆదివారం ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి
మొత్తం 70 రోజుల పాటు సాగిన ఈ షూటింగ్‌లో సుమారు 500 మంది యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. వారానికి ఆరు రోజులు నిరంతరంగా షూటింగ్ జరిపి, ఆదివారం ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారు. బుట్టాయిగూడెం నుంచి షూటింగ్ ప్రాంతం దాదాపు 15 మైళ్ల దూరంలో ఉండేది. సరిగ్గా రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో ప్రయాణం చాలా కష్టంగా మారేది. షూటింగ్ సమయంలో సరదా సంఘటనలు కూడా జరిగేవి. కృష్ణంరాజును నటి వాణిశ్రీ "తుర్రాజు" అంటూ ఆటపట్టించేవారట. యూనిట్ అంతా ఎంతో కుటుంబసభ్యుల్లా కలిసి పనిచేసినట్లు అప్పటి సభ్యులు చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో పౌరాణిక సినిమాలకు సాధారణంగా రూ.15 లక్షలలోపే బడ్జెట్ ఉండేది. కానీ 'భక్త కన్నప్ప' కోసం కృష్ణంరాజు దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఆ కాలానికి ఇది చాలా పెద్ద మొత్తం. సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించారు. నిర్మాతగా కూడా కృష్ణంరాజు తన ప్రత్యేకతను చాటుకున్నారు.

క్లాసిక్‌ హిట్​గా భక్త కన్నప్ప
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఈ చిత్రం 100 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. భక్తి చిత్రాల్లో 'భక్త కన్నప్ప' ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. కృష్ణంరాజు నటన, బాపు దర్శకత్వం, సంగీతం, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ప్రేరణగా నిలిచింది 1954లో విడుదలైన కన్నడ చిత్రం 'బెడర కన్నప్ప'. ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ నటించిన ఆ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అదే కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దుతూ భక్త కన్నప్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటీటీ వేదికల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ క్లాసిక్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇక ఈతరం ప్రేక్షకులకు కన్నప్ప కథను మళ్లీ గుర్తు చేస్తూ నటుడు మంచు విష్ణు "కన్నప్ప" చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం కూడా చర్చనీయాంశమైంది. అయితే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం కృష్ణంరాజు నటించిన "భక్త కన్నప్ప"కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు- సెక్యూరిటీని దాటుకుని తారక్ మీదకు దూసుకొచ్చిన వ్యక్తి- ఏం జరిగిందంటే?

జపాన్​లో పెద్ది రిలీజ్ క్యాన్సిల్ - అభిమానులకు భారీ షాక్!