ETV Bharat / education-and-career
డేటాసైన్స్ రంగంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? - రాణించాలంటే ఏయే నైపుణ్యాలు అవసరం
రోజురోజుకు విస్తరిస్తున్న డేటాసైన్స్ పరిధి - ఈ రంగంలో రాణించాలంటే ఏ నైపుణ్యాలు అవసరం - డేటాసైన్స్‌లో రాణించాలంటే గణితంపై పట్టుండాలా? తదితర విషయాలపై నిపుణుల సూచనలు

Published : February 25, 2026 at 4:52 PM IST
Huge Job Opportunities in Data Science Courses : ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించే పేరు డేటాసైన్స్. కార్పొరేట్ కంపెనీల నుంచి సూపర్ మార్కెట్ల వరకూ ఆయా యాజమాన్యాల వరకూ తీసుకున్న నిర్ణయాల్లో డేటాసైన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత కాలంలో వ్యాపార సంస్థల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అస్త్రంగా డేటాసైన్స్ పరివర్తనం చెందుతుంది. దీంతో ఈ రంగంలో నైపుణ్యం ఉన్న వారికి జాబ్మార్కెట్లో కొత్త ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అసలేంటీ డేటాసైన్స్, దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ రంగంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? అనే విషయాలపై టెక్నికల్ ట్రెయినింగ్ సైయంట్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు పేర్లు డైరెక్టర్ సూచనలు సలహాలు మీకోసం.
అసలేంటీ డేటాసైన్స్ : ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పని డేటాగా మారుతోంది. ఆ సమాచారాన్ని అర్థం చేసుకుని, దానితో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినే ఈ రోజు అందరూ డేటాసైన్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ అత్యాధునిక కంప్యూటర్ యుగంలో ప్రపంచం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ డేటా అనేది అత్యంత కీలకంగా మారుతోంది. అయితే డేటాసైన్స్ అనగానే అది చాలా కష్టతరమైన సబ్జెక్టు అని చాలా మంది భావిస్తారు. క్లిష్టమైన మ్యాథ్స్, భారీ కోడింగ్, పెద్ద గ్రాఫ్‌లు ఉంటాయని ఊహిస్తారు. కానీ వాస్తవానికి ఆయా వ్యాపార సంస్థల దృష్టిలో డేటాసైన్స్ అనేది ఒక నిర్ణయవిధానం.
ఒక ఆన్‌లైన్ షాపింగ్ సంబంధిత యాప్‌లో ఏ వినియోగదారుడు మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది? ఆ ఫ్యాక్టరీలో ఏ యంత్రం త్వరలో పనిచేయకుండా ఆగిపోతుంది? ఒక స్మార్ట్ సిటీలో వచ్చే నెల ఏ ప్రాంతంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది డేటానే. ఇది లేకుండా బిజినెస్ లేదా ఏ పరిశ్రమ అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగడమనేది అసాధ్యం.
ఉదాహరణకు : ఒక ఫుడ్ డెలివరీ యాప్‌నే తీసుకుంటే. ఓపెన్ చేసిన వెంటనే ఈ రోజు మీకు ఇష్టమైన ఫుడ్ ఐటంపై 20 శాతం డిస్కౌంట్ అని ఒక ఆఫర్‌ను చూపిస్తుంది. ఇదేదో యాదృచ్చికంగా వచ్చిందనుకుంటే పొరపడినట్లే. మీరు గతంలో చేసిన ఆర్డర్లు, ఆర్డర్ చేసే సమయం, ఆ రోజు డిమాండ్ ఇలా అన్ని అంశాలు కలిపి నిర్ణయం తీసుకోవడంతో మీకు కనిపించింది ఒక చిన్న ఆఫర్ మాత్రమే. కానీ దాని వెనుకమాత్రం పనిచేసింది డేటా ఆధారిత ఆలోచన. డేటాసైన్స్‌కు అసలు అర్థం ఇదే.
డేటా స్టోరీటెల్లర్కు డిమాండ్ : డేటా అంటే కేవలం టేబుళ్లు, చార్టులు కాదు. అది ఒక నిర్ణయక సాధనం. అక్కడ ప్రశ్న ఈ డేటా ఏం చెబుతోంది. కాదు, ఈ డేటా ఆధారంగా మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే దానికే ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకు ఒక సూపర్ మార్కెట్‌నే తీసుకుంటే దాని ఓనర్ నిన్నటి సేల్స్ రిపోర్ట్ చూసి సంతృప్తి చెందడు. తక్కువగా చెల్లని వస్తువులు ఏవో గుర్తిస్తాడు. ఏవి అధికంగా అమ్ముడవుతున్నాయో గుర్తించి వాటిని స్టాక్‌లో పెడతాడు. అదే డేటా అనలిటిక్స్‌కు ఉన్నటువంటి అసలు విలువ. ఇక్కడే చాలా మంది విద్యార్థులు వెనుకబడుతున్నాయి. డేటాను చదవగల్గుతున్నారు కానీ, దాన్ని కథలా మాత్రం వివరించలేకపోతున్నారు.
డేటాసైన్స్‌లో రాణించాలంటే గణితంలో పట్టుండాలా? : ఇది చాలా మందికి ఉన్న సందేహం. డేటాసైన్స్‌కు గణితం అవసరం. కానీ అన్ని డేటా జాబ్స్ లోతైన గణిత పరిజ్ఞానాన్ని కోరుకోవు. ఈ రంగంలో ఎక్కువగా అవసరమయ్యేది సమస్యను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. సరైన ప్రశ్నలు అడిగే నైపుణ్యం, డేటా నాణ్యతను గుర్తించడం. ఆలోచనా విధానమే అతిముఖ్యమైనది. ఆయా ఉద్యోగ సంస్థలు చేపట్టే నియామకాల్లో వ్యాపార సమస్యను డేటా సమస్యగా మార్చగలరా? లేదా అనే నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఎంఎస్ ఎక్సెల్, ఎస్‌క్యూఎల్, స్టాటిస్టిక్స్‌పై పట్టుండాలి. టబ్ల్యు, పవర్ బీఐ ద్వారా డేటాను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని సంపాదించాలి.
ఒకే పరీక్షతో రెండు కోర్సుల్లోకి - ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్) 2026
కేవలం డిగ్రీతో రిజర్వు బ్యాంకులో ఉద్యోగాలు - మొదటి నెల నుంచే రూ.58 వేల జీతం

