ETV Bharat / education-and-career

సైబర్​ సెక్యూరిటీ రంగంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలుంటాయి?

సైబర్​ సెక్యూరిటీ కోర్సులకు పెరుగుతున్న ప్రాధాన్యం - సైబర్​ భద్రత రంగంలో తీవ్రంగా నిపుణుల కొరత - మంచి నైపుణ్యాలుంటే ఉజ్వల భవిష్యత్​ ఉంటుందంటున్న కెరీర్​ గైడెన్స్ నిపుణులు

Jobs After Cyber Security Degree
Jobs After Cyber Security Degree (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 4, 2026 at 10:38 PM IST

4 Min Read
Choose ETV Bharat

Jobs After Cyber Security Degree : ఈ అత్యాధునిక సాంకేతిక యుగంలో సెకనుకో మోసం జరుగుతూ, భద్రత పెనుముప్పులో పడిన వేళ సైబర్‌ సెక్యూరిటీ కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా వెన్నాడుతోంది. దేశంలో వేల సంఖ్యలో ఐటీ రంగంలో సేవలు అందించే సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికీ డేటా భద్రత కోసం సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు తప్పనిసరిగా అవసరం. మిగతా రంగాల్లో ఉద్యోగాలకు ఏఐ(కృత్రిమ మేధ) సెగ తగులు తున్న నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు మాత్రం సంస్థలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేసిన వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? అనే విషయంపై కెరీర్ గైడెన్స్ నిపుణులు ఎస్​.వి సురేశ్ అందిస్తున్న సూచనలు సలహాలు మీకోసం

సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ప్రారంభ స్థాయి నుంచి సీనియర్‌ హోదా వరకూ విభిన్న నైపుణ్యాలున్నటువంటి సమర్థుల కోసం పలు సంస్థలు అన్వేషిస్తున్నాయి.

సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌ : నేర చట్టంలో ఓ ప్రాథమిక సూత్రం ఉంది. నేరం జరిగాక పరిశోధన కంటే నేరం జరగకుండా చూడగలగడమే అతి ముఖ్యం. సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌లు అదే పనిని చేస్తారు. సైబర్‌ అటాక్​లకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో బృందాల ద్వారా పరిపరి విధాలుగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఎక్కడైనా సైబర్​ భద్రతకు ప్రమాదాన్ని శంకిస్తే వెంటనే కార్యరంగంలోకి దూకుతారు. తద్వారా ఐటీ టీమ్‌కు భరోసా ఇస్తారు.

ఎథికల్‌ హ్యాకర్‌ : సంస్థ ఐటీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడెక్కడ రక్షణ వలయాన్ని ఛేదించి ప్రవేశించవచ్చవచ్చో దుర్భిణీ వేసుకొని వెతుకుతుంటారు. ఎక్కడైనా అవకాశం కనిపించినట్లయితే చొరబడేందుకు వెనకాడరు. ఎథికల్‌ హ్యాకర్లను చొరబాటు పరిశీలకులు (పెనిట్రేషన్‌ టెస్టర్‌) అని కూడా వ్యవహరిస్తారు.

సెక్యూరిటీ ఇంజినీర్‌ : ప్రాథమికంగా సంస్థ అనుసరిస్తున్న సైబర్‌ భద్రత సాధనాలను (టూల్స్‌) సమర్థంగా అమలు చేసే బాధ్యత వహిస్తారు సెక్యూరిటీ ఇంజినీర్. ఎప్పటికప్పుడు వీటిని అప్డేట్‌ చేస్తుంటారు.

డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటర్‌ : సంస్థ డేటాపై సైబర్‌ దాడి జరిగిన సమయంలో దానిపై దర్యాప్తు చేసి రక్షణ వ్యవస్థలోని(సెక్యూరిటీ సిస్టమ్​లోని) లోపాలను వెలికితీసే హోదా ఇది. ఫలితంగా అదే తరహా దాడి భవిష్యత్తులో జరగకుండా రక్షణ వ్యవస్థను మరింత పదిలం చేసేందుకు సిబ్బందికి సూచనలిస్తారు.

సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌ : సంస్థ సిస్టమ్‌ నెట్‌వర్క్‌ డేటా అనుసంధాన వ్యవస్థలను నిశితంగా పరిశీలించి, భద్రతా వలయాలకు రూపకల్పన చేసే నిపుణులే సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌లుగా వ్యవహరిస్తారు.

నెట్‌వర్క్‌ సెక్యూరిటీ : సైబర్‌ నేరగాళ్లు ఎప్పుడూ విస్తృత నెట్‌వర్క్‌ల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తారు. అదే లాభసాటిగా భావిస్త్తుంటారు. దీనికి విరుగుడుగా నెట్‌వర్క్‌ను పరిరక్షించగలిగే ప్రొఫెషనల్స్‌ కోసం పలు సంస్థలు గాలిస్తున్నాయి. ఫైర్‌వాల్స్, వీపీఎన్, రౌటింగ్, వివిధ నెట్‌వర్క్‌ విభాగాలపై మంచి పరిజ్ఞానం ఉన్నవారికి ఈ రంగంలో అపారమైన అవకాశాలున్నాయి.

ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ : దోపిడీ దొంగల నుంచి ఇంటి రక్షణకు వేసే తాళాలు గట్టిగా ఉండేవిధంగా చూసుకుంటాం. ప్రస్తుతం వాడుతున్నటువంటి తాళాలు ఏ మాత్రం భద్రమైనవో ఒకటికి రెండు సార్లు సరిచూస్తాం. అలాగే ఐటీ వ్యవస్థలోనూ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ విండోస్, లినక్స్‌పై మంచి పట్టున్న నిపుణులకు సైబర్‌ సెక్యూరిటీలో ఉజ్వల భవిష్యత్తు ఉంది.

సైబర్‌ దాడుల ముప్పు నిర్వహణ నిపుణులు : సంస్థ నెట్‌వర్క్‌పై సైబర్​ దాడులు జరిగిన తర్వాత బాధపడటం కంటే ప్రస్తుత వ్యవస్థను సునిశితంగా పరిశీలించడం ఉత్తమం. ఇందుకోసం దాడుల ముప్పును ముందే పసిగట్టగలిగే నిపుణుల సేవలు అత్యంత కీలకం. ఇలాంటి నైపుణ్యాలు ఉన్నవారికి పలు సంస్థలు పెద్ద పీట వేస్తాయి.

నష్ట నివారణ : సైబర్‌ క్రైంలో ‘గోల్డెన్‌ అవర్‌’ సూత్రం ఇటీవల కాలంలో తెరపైకి వచ్చింది. సైబర్‌ ఉపద్రవం జరగగానే మీనమేషాలు లెక్కిస్తే అమూల్యమైన సమయాన్ని కోల్పోయినట్లే. ఇలాంటి సందర్భాల్లో తక్షణమే స్పందించి మిగతా నెట్‌వర్కులను రక్షించగలిగే సామర్థ్యమున్న నిపుణుల సేవలు అత్యంత కీలకం. వీరినే ఇన్సిడెంట్‌ రెస్పాన్సర్లుగా వ్యవహరిస్తారు. సైబర్‌ సెక్యూరిటీ పరంగా ఈ సామర్థ్యాలను నేర్చుకున్న వారికి ఉత్తమ అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.

ఇవి మాత్రమే కాకుండా సంస్థల కార్యకలాపాలపై ఆధారపడి సైబర్‌ సెక్యూరిటీ సిస్టమ్​లో విభిన్నమైన హోదాలు తెరపైకి వస్తున్నాయి. ఆ అవసరాలు తీర్చగలిగే మంచి నైపుణ్యాలు ఉన్న నిపుణుల కోసం సంస్థలు ఎదురు చూస్తున్నాయి.

నైపుణ్యాలు తప్పనిసరి : మనకు దాహంగా ఉన్నప్పుడు సుదూరంగా అపార జలరాశి కనిపించవచ్చు. అక్కడకు చేరుకునేందుకు దగ్గరి దారి కనిపెట్టాలి. కావలసినన్ని నీళ్లు తెచ్చుకునేందుకు తగిన పాత్ర మన వద్ద ఉండాలి. దేశ సైబర్‌ సెక్యూరిటీ రంగానికి 8 లక్షల మంది నిపుణుల అవసరం ఉన్నప్పటికీ అందుకు కావలసినటువంటి స్కిల్స్​ను సంపాదించిన వారే పోటీలో ముందుంటారు.

సైబర్‌ భద్రత రంగంలో మన దేశంలో ఏటా 15.8 శాతం ఉద్యోగాలు పెరుగుతున్నాయి. వీటిలో ఏ విధమైన స్కిల్స్​కు రాణింపు ఉందో తెలుసుకోవాలి. వాటిని పొందగలిగే కోర్సులను ముందుగా గుర్తించి, క్షుణ్నంగా నేర్చుకోవాలి. ఈ విధంగా చేస్తే సైబర్‌ నేర నివారణ పరిష్కర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందవచ్చు. వృత్తి పరంగా భవిష్యత్తులో మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుంది.

ఇన్సిడెంట్‌ రెస్పాండర్‌ : సంస్థ అనుసరిస్తున్న సైబర్‌ భద్రతా నెట్​వర్క్​ను దాటి చొరబాటు సంఘటన జరిగినప్పుడు ఇన్సిడెంట్ రెస్పాండర్ తక్షణమే స్పందిస్తారు. మరింత ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు చేపడతారు.