ETV Bharat / education-and-career
'యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'లో 1865 ఖాళీలు - దరఖాస్తు చేసుకోండిలా!
యూబీఐలో ఖాళీలు - విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర వివరాలు మీ కోసం

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2026 at 11:38 AM IST
Union Bank Recruitment 2026 : నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) శుభవార్త చెప్పింది. మొత్తం 1865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కాలపరిమితి ఏడాది కాగా ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు. ఈ సంవత్సర అనుభవంతో ప్రైవేట్ సంస్థల్లో కొలువులు పొందొచ్చు. అంతేకాక భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా సులభమవుతుంది. డిగ్రీ అర్హతతో వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్‌లో ప్రతిభతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే బ్యాంకుల్లో అప్రెంటిస్ పూర్తైన వారు దరఖాస్తుకు అనర్హులు.
చాలా సంస్థలు ఉద్యోగ నియామకాల్లో అప్రెంటిస్ విధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆసక్తి, అర్హతలుంటే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కోరుకున్న రాష్ట్రంలోనే పోటీ పడొచ్చు. ఇందుకోసం ఆ రాష్ట్ర అధికారిక భాషల్లో రాయటం, చదవటం, మాట్లాడటం తప్పనిసరి. పోటీ పడుతోన్న రాష్ట్రానికి చెందిన లోకల్ లాంగ్వేజ్‌ను 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్లో చదివిన వారికి మినహాయింపు ఇస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల కోసం తెలుగు భాష చదివి ఉండాలి లేదంటే తెలుగు రావాలి.
సంవత్సర కాలపరిమితితో అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎన్‌ఎస్‌డీసీ) సర్టిఫికెట్ అందిస్తుంది. అదేవిధంగా అప్రెంటిస్ పనిచేసే ప్రదేశాన్ని బట్టి స్టైపెండ్ చెల్లింపులో మార్పు ఉంటుంది. మెట్రో నగరాల్లో అయితే ప్రతి నెలా రూ.20,000. అర్బన్ ప్రాంతాల్లో రూ.18,000, రూరల్ బ్రాంచీల్లో రూ.15,000 చెల్లిస్తారు.
పరీక్ష విధానం :
పరీక్షను సీబీటీ విధానంలో స్థానిక భాషలో నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఫైనాన్షియల్ అవేర్నెస్/ జనరల్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, కంప్యూటర్/సబ్జెక్టు నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఒక్కో విభాగం నుంచీ 20 చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. నెగిటివ్ మార్క్స్ లేవు. ఆన్‌లైన్ పరీక్షలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్స్ పరిశీలించి, మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి, అప్రెంటిస్‌గా నియమిస్తారు.
ప్రిపరేషన్ :
ఈ ఎగ్జామ్‌కు అతి తక్కువ సమయమే ఉంటుంది. జూన్ 15లోగా పరీక్షను నిర్వహించవచ్చు. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయం సాధ్యమవుతుంది. ఇక్కడ వేగంతో పాటు కచ్చితత్వమూ ముఖ్యమే.
ముఖ్య వివరాలు :
- మొత్తం ఖాళీలు 1865 కాగా తెలంగాణలో 164, ఆంధ్రప్రదేశ్‌లో 303 ఉన్నాయి.
- అర్హత డిగ్రీ కాగా ఏప్రిల్ 1, 2022 తర్వాత పాస్ అయిన వారు అర్హులు.
- అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ మహిళలకు రూ.600 కాగా మిగిలిన వారు రూ.800 పే చేయాలి. దీంతో పాటు జీఎస్టీ అదనం. దివ్యాంగులు, ట్రాన్జండర్లు, ఎస్సీ, ఎస్టీలు ఇంటిమేషన్ చార్జీ రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
- అభ్యర్థులు ఏప్రిల్ ఒకటి, 2026 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 19.
- ఆన్‌లైన్ పరీక్షలు మే/జూన్‌లో.
- అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్ https://www.unionbankofindia.bank.in/en/hom లో అప్లై చేసుకోవాలి.
"బైపీసీ" అయిపోయిందా? - నెక్ట్స్ ఏ కోర్సు బాగుంటుందో తెలుసుకోండి!
"ఎమ్మెస్సీ" చేయాలనుకుంటున్నారా? - ఉద్యోగ అవకాశాలు ఏ కోర్సులో ఎక్కువగా ఉంటాయంటే!

