ETV Bharat / education-and-career
సైబర్ సెక్యూరిటీ రంగం - ఉద్యోగ అవకాశాలు అపారం
సైబర్ నేరగాళ్ల స్వైర విహారం - శరవేగంగా ఎదుగుతోన్న సైబర్ సెక్యూరిటీ రంగం - సైబర్ భద్రత రంగంలో తీవ్రంగా నిపుణుల కొరత - మంచి నైపుణ్యాలుంటే ఉజ్వల భవిష్యత్

Published : January 9, 2026 at 6:49 AM IST
Special Story on Cyber Security Jobs : ఉజ్వలమైన కెరియర్ అన్వేషణలో ఉన్నప్పుడు వికసించే రంగాన్ని గుర్తించడం మొదటి మెట్టు. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు. ఎంచుకున్న రంగంలో చోటు పొందేందుకు కావల్సిన మెట్లు ఎక్కడున్నాయో గుర్తించాలి. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ కలల కెరియర్‌ను చేరుకోవాలి.
సైబర్ నేరగాళ్లు స్వైర విహారం : శరవేగంగా ఎదుగుతోన్న సైబర్ సెక్యూరిటీ రంగం తగిన నిపుణుల కోసం నిరీక్షిస్తోంది. సైబర్ చౌర్యాలు, సైబర్ దాడులు రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరుణంలో చొరబాటు దారులు మూసేందుకు వృత్తి నిపుణుల అవసరం మరింతగా పెరుగుతోంది. అంటే ఇప్పటికిప్పుడు సైబర్ సెక్యూరిటీ రంగంలోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో ప్లస్ టూ తరువాత డిగ్రీ, పీజీ చేసేందుకు ఆరు సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ రంగం అప్పటికే నిపుణులతో నిండిపోతుంది, మనకు చోటు దక్కదేమోనని బెంగ అవసరం లేదు. సైబర్ నేరగాళ్లు స్వైర విహారం చేస్తూ వేయి బాహువులతో నూతన వర్చువల్ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. అందువల్ల అప్పటికీ ప్రొఫెషనల్స్ అవసరం ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు.
దారులు ఎన్నో? : -
బీటెక్ సైబర్ సెక్యూరిటీ లేదా కంప్యూటర్ సైన్స్ (సైబర్ సెక్యూరిటీ) : కంప్యూటర్ సైన్స్‌లో శాస్త్ర విజ్ఞాన సామర్థ్యాలను నేర్పించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టును ఒక ప్రత్యేక అంశంగా చూపిస్తారు. దీని వల్ల కంప్యూటర్ సైన్స్ క్షేత్రంలో సైబర్ సెక్యూరిటీ ఆయుధ బలంతో సైబర్ శత్రువులను ఎదుర్కొనే శక్తిని సంపాదిస్తారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ వైపు వెళ్లని వాళ్లూ సాధారణ డిగ్రీ కోర్సుతోనూ సైబర్ సెక్యూరిటీ ప్రత్యేక సబ్జెక్టుగా నేర్చుకొనే అవకాశం కూడా ఉంది.
కనీస అర్హతలు : -
బీటెక్ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ మార్కులు, ఉమ్మడి ప్రవేశ పరీక్షలైన ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ ఆధారంగా సీట్లు ఇస్తారు. ఇతర కోర్సుల్లో ప్లస్ టూ స్థాయిలో 50 % మార్కులతో ప్రవేశ అర్హత లభిస్తుంది.
ఏం నేర్పిస్తారు? : -
ఇప్పుడు సైబర్ దాడులు జరుగుతున్న తీరు తెన్నులు, సాధారణంగా డేటా భద్రతకు ఉండే రక్షణ వలయాలు, సాంకేతికంగా చొరబాట్లు జరగకుండా ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి? అన్న విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి సిలబస్ రూపకల్పన చేస్తారు. ఎథికల్ హ్యాకింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్, డిజిటల్ ఫోరెన్సిక్, క్రిప్టోగ్రఫీల్లో మౌలిక అంశాలను ఈ కోర్సుల్లో భాగంగా బోధిస్తారు.
ఈ నైపుణ్యాలు నేర్చుకుంటే పరిగణనలోకి తీసుకునే పొజిషన్లు : -
- నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్
- సైబర్ సెక్యూరిటీ, అనలిస్ట్
- ఎథికల్ హ్యాకర్
- మాల్వేర్ అనలిస్ట్
- డిజిటల్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్
- సెక్యూరిటీ కన్సల్టెంట్
ప్రస్తుత అభ్యర్థులకు రాజమార్గం : భారత్‌దేశంలో సైబర్ సెక్యూరిటీ రంగంలో భవిష్యత్తులో రానున్న 8 లక్షల జాబుల్లో చోటు పొందాలంటే కొన్ని మౌలిక సామర్థ్యాలను సొంతం చేసుకోవాలి.
- లినక్స్, విండోస్ లాంటి నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పట్టు
- యాంటీ వైరస్, ఫైర్‌వాల్స్, చొరబాటు గుర్తింపు సామర్థ్యం
- సైబర్ దాడుల ముప్పును తప్పించే స్కానర్స్‌పై అవగాహన ఉంటే అది అదనపు అర్హత అవుతుంది.
బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ / డిజిటల్ సెక్యూరిటీ / ఫోరెన్సిక్ : ఈ కోర్సులో ముఖ్యంగా సైబర్ దాడుల ముప్పు అవకాశాలు, సైబర్ సెక్యూరిటీ ఒకవేళ దాడులు జరిగితే డిజిటల్ పరిశోధన అంశాలపై దృష్టి పెడతారు.
సైబర్ సెక్యూరిటీతో బీసీఏ : పటిష్ఠమైన సైబర్ సెక్యూరిటీ పునాదులతో కంప్యూటర్ అప్లికేషన్స్‌ను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.
సైబర్ నేరాలు - చట్టాలు, ఫోరెన్సిక్ అకౌంటింగ్‌తో బీకామ్ : సైబర్ నేరగాళ్లు సంస్థల భద్రతా వలయాలను ఛేదించుకుని, చొరబడి ఆర్థికంగా దెబ్బతీస్తారు. సైబర్ నేరాల్లో సాంకేతిక అంశం ఒకటైతే, దాడుల వల్ల జరిగే నష్టాల ఆడిటింగ్, అకౌంటింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే పీజీలు, డిగ్రీలు దాటి వచ్చేసిన స్టూడెంట్స్ ఈ రంగంలో రాణించాలని అనుకుంటే వారి కోసమూ స్వల్పకాలిక వ్యవధితో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి.
డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ : వివిధ ప్రైవేట్ ట్రైనింగ్ సంస్థలు ఉపాధి ప్రధాన (జాబ్ ఓరియంటెడ్) లక్ష్యంగా డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రాథమిక అంశాలు నేర్పించే ఈ తరహా డిప్లొమాలతో ఈ రంగంలో ప్రవేశ స్థాయి (ఎంట్రీ లెవల్) జాబ్‌లు పొందొచ్చు.
సర్టిఫికెట్ కోర్సులు : సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టుపై ఆసక్తి ఉన్నవారు చేసేందుకు స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులను టెక్ దిగ్గజ సంస్థలు ఐబీఎం, గూగుల్‌లు అందిస్తున్నాయి. ప్రస్తుత సైబర్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న ముప్పులు, పరిష్కార సామర్థ్యాలపై ఈ కోర్సులు దృష్టి పెడుతున్నాయి. అందుకే ఇవి జాబ్ రెడీ కోర్సులుగా గుర్తింపు పొందాయి.

