ETV Bharat / education-and-career

హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ జీసీసీలు కోర్సు చేస్తే - భవిష్యత్తులో 4 లక్షల ఉద్యోగాలు!

ఆరోగ్య పరిరక్షణ, జీవశాస్త్రాల రంగాల్లో వేగంగా మార్పులు - 2030 నాటికి ఈ రంగాల్లో కొత్తగా సుమారు 4.2 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం - యూజీ, పీజీ పూర్తి చేసిన వారికి అవకాశాలు

Job Opportunities In Health Care
Job Opportunities In Health Care (Getty Image)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 6:53 AM IST

3 Min Read
Choose ETV Bharat

Special Story On Job Opportunities In Health Care And Life Sciences : ఆరోగ్య పరిరక్షణ, జీవశాస్త్రాల రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) విస్తరిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి ఈ రంగాల్లో కొత్తగా సుమారు 4.2 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి.

దేశంలో జీసీసీల విస్తరణ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 150 హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో అధిక శాతం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో సుమారు 3 లక్షల మంది నిపుణులు పని చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పని చేస్తున్న ఈ సంస్థలు భారత యువతకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందిస్తున్నాయి.

జీసీసీలు ఏం చేస్తాయి? : జీసీసీలు కేవలం బ్యాక్‌ఎండ్‌ సపోర్ట్‌ కేంద్రాలు మాత్రమే కావు. ఇవి కృత్రిమ మేధ ఆధారిత ఔషధ పరిశోధన, క్లినికల్‌ ట్రయల్స్‌, డిజిటల్‌ హెల్త్‌, బయోఇన్ఫర్మేటిక్స్‌, డేటా విశ్లేషణ వంటి కీలక రంగాల్లో సేవలందిస్తున్నాయి. ఇటీవల జరిగిన బయో ఆసియా 2026 సదస్సులో సమర్పించిన నివేదిక ప్రకారం, హెల్త్‌కేర్‌ జీసీసీల్లో 30 - 35 శాతం ఔషధ రంగానికి, 20-25 శాతం జీవశాస్త్రాలకు, మరో 20-25 శాతం వైద్య పరికరాల విభాగానికి సంబంధించినవిగా ఉన్నాయి. విదేశీ ఔషధ, బయోటెక్‌ సంస్థలు భారత్‌లో నూతన జీసీసీలను స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

అందుబాటులో ఉన్న ఉద్యోగ హోదాలు ఇవే : హెల్త్‌కేర్‌ జీసీసీల్లో ప్రధానంగా 5 విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి.

పరిశోధన & ఆవిష్కరణలు : క్లినికల్‌ ట్రయల్‌ డేటా సైంటిస్టులు, బయోఇన్ఫర్మేటిక్స్‌ నిపుణులు, జినోమ్‌ డేటా అనలిస్టులు, డ్రగ్‌ డెలివరీ ఏఐ ఇంజినీర్లు వంటి హోదాలు అందుబాటులో ఉంటాయి.

క్లినికల్‌ & మెడికల్‌ అఫైర్స్‌ : మెడికల్‌ రైటర్లు, క్లినికల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్లు, బయోస్టాటిషియన్లు, క్లినికల్‌ డేటా మేనేజర్లు అవసరమవుతున్నారు.

డేటా సైన్స్‌ & ఏఐ : జీవశాస్త్రాల నేపథ్యంతో పాటు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ పరిజ్ఞానం కలిగిన వారికి మంచి డిమాండ్‌ ఉంది.

రెగ్యులేటరీ & సేఫ్టీ : క్వాలిటీ అస్యూరెన్స్‌, రెగ్యులేటరీ ఇన్ఫర్మేటిక్స్‌ స్పెషలిస్టులు ఔషధ నాణ్యత, భద్రతా ప్రమాణాల అమలుపై పనిచేస్తారు.

సాంకేతిక హోదాలు : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్స్‌, ల్యాబ్‌ ఆటోమేషన్‌ నిపుణులకు కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి.

అవసరమైన విద్యార్హతలు : బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ వంటి కోర్సులు పూర్తి చేసినవారికి అవకాశాలు ఉన్నాయి. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డి చదివినవారు క్లినికల్‌, ఔషధ రంగాల్లో రాణించవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేసిన వారికి ఉన్నత పరిశోధన హోదాల్లో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మేనేజీరియల్‌ పోస్టుల కోసం ఎంబీఏ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు ఉపయోగపడతాయి. మెడికల్‌ రైటింగ్‌, మెడికల్‌ కోడింగ్‌ సర్టిఫికేషన్లు కూడా ఉపయుక్తం.

అవసరమైన నైపుణ్యాలు : మౌలిక సైన్స్‌ సబ్జెక్టులపై పట్టు అవసరం. బయాలజీ, కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మెడిసిన్‌ వంటి అంశాల్లో లోతైన అవగాహన ఉండాలి. అదనంగా డేటా లిటరసీ, బయోఇన్ఫర్మేటిక్స్‌, ఏఐ/ఎంఎల్‌, ల్యాబ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ పరిజ్ఞానం అవసరం. సమస్య పరిష్కార సామర్థ్యం, విశ్లేషణా నైపుణ్యం, జట్టు భావన, భద్రతా ప్రమాణాల పట్ల కట్టుబాటు వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా ముఖ్యమైనవే.

భవిష్యత్తు దిశ : ఇప్పటివరకు పరిమిత పాత్రలో ఉన్న హెల్త్‌కేర్‌ జీసీసీలు నేడు వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మేధాసంపత్తి అభివృద్ధి నుంచి గ్లోబల్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వరకు విస్తరించిన వీటి కార్యకలాపాలు ఉద్యోగుల విలువను పెంచుతున్నాయి. ఆకర్షణీయ వేతనాలు, వేగవంతమైన పదోన్నతులు ఈ రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. సరైన విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు సాధిస్తే హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ జీసీసీలు యువతకు సుస్థిరమైన కెరీర్‌ మార్గాన్ని అందిస్తాయి.

కేవలం డిగ్రీతో రిజర్వు​ బ్యాంకులో ఉద్యోగాలు - మొదటి నెల నుంచే రూ.58 వేల జీతం

టెన్త్​, ఐటీఐ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు - చివరి తేదీ ఎప్పుడంటే?