ETV Bharat / education-and-career
కేవలం డిగ్రీతో రిజర్వు బ్యాంకులో ఉద్యోగాలు - మొదటి నెల నుంచే రూ.58 వేల జీతం
అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్బీఐ - ఉద్యోగంలో చేరిన వారికి మొదటి నెల నుంచే రూ.58 వేల జీతం - అదనంగా ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు

Published : February 18, 2026 at 10:45 PM IST
RBI Assistant Notification : భారతీయ రిజర్వు బ్యాంకు అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం నూతనంగా ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. కేవలం బ్యాచిలర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించేందుకు కేవలం ప్రిలిమ్నరీ, మెయిన్స్ పరీక్షల్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి మొదటి నెల నుంచే రూ.58 వేల జీతం అందుతుంది. దీనికి అదనంగా ప్రోత్సాహకాలు ఉంటాయి. శాఖాపరమైన పరీక్షలు, అనుభవంతో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరవచ్చు.
ప్రాథమిక పరీక్ష : దీనికోసం ప్రాథమిక పరీక్ష వంద మార్కులకు నిర్వహిస్తారు. దీనలో ప్రతి ప్రశ్నకూ ఒక్కో మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం ఇంగ్లిష్. దీనిలో 30 ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగం న్యూమరికల్ ఎబిలిటీ. దీనిలో 35 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత విభాగం రీజనింగ్ ఎబిలిటీలో. దీనిలోనూ 35 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో మొత్తం గంట వ్యవధి ఉంటుంది. అనగా ఒక్కో విభాగానికి 20 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఒక్కో పోస్టుకు పది మంది చొప్పున మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
మెయిన్స్ పరీక్ష : ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 40 ప్రశ్నలు ఉంటాయి. దీనిలోని విభాగాలు ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్లలో ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో కంప్యూటర్ నాలెడ్జ్కు 20 నిమిషాల వ్యవధి ఉంటుంది. అదే జనరల్ ఎవేర్నెస్కు 25 నిమిషాల సమయం కేటాయిస్తారు. మిగిలిన మూడు విభాగాలకు 30 నిమిషాల చొప్పున సమయం కేటాయించి పరీక్ష నిర్వహిస్తారు. అనగా పరీక్ష పూర్తి కాలవ్యవధి 135 నిమిషాలు ఉంటుంది.
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా విభాగాల వారీగా ఒక్కో పోస్టుకు ఇద్దరి చొప్పున లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్నరీ, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ ప్రతి తప్పు సమాదానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. అయితే హైదరాబాద్ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలుగులోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లోనూ విభాగాల వారీగా అర్హత మార్కులు సాధించడం తప్పినిసరి.
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ : మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు భాషా నైపుణ్యం పై పరీక్ష నిర్వహిస్తారు. దీనికోసం మనం దరఖాస్తు చేసుకున్న ప్రాంతానికి సంబంధించిన భాషలో ఈ పరీక్ష ఉంటుంది. హైదరాబాద్లోని 11 ఖాళీలు ఉన్నాయి. వీటికోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పరీక్షను తెలుగులో రాయవచ్చు. అదే ముంబయి కార్యాలయంలో 249 పోస్టులు ఉన్నాయి. ఈప్రాంతానికి అప్లై చేసుకుంటే మరాఠీ లేదా కొంకణి భాషల్లో పరీక్ష రాయాలి. ఇదే తరహాలో హిందీలో పరీక్ష రాయాలనుకున్నవారు కాన్పూర్ అండ్ లఖ్నవూ (50), న్యూదిల్లీ (49), చండీగఢ్ (20), నాగ్పూర్ (17) పోస్టులలో ఏదైనా ఒక ప్రాంతానికి అప్లై చేసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో తమిళంలో పోటీ పడాలనుకున్న అభ్యర్థులు చెన్నైలోని 53 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అదే కన్నడలో రాయాలనుకున్న అభ్యర్థులు బెంగళూరులోకి 24 పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవే ముఖ్యం :
- అర్హత : ఏదైనా డిగ్రీతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే కేవలం ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు.
- వయసు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అనగా ఫిబ్రవరి 2, 1998 నుంచి ఫిబ్రవరి1, 2026 మధ్య వయసు కలిగిన వారు అర్హులు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దీనిలో ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది. వీరితో పాటు ఓబీసీలకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు అత్యధికంగా పది సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
- దరఖాస్తునకు చివరి తేదీ : మార్చి 8
- దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రుసుము రూ.50. మిగిలిన అందరికీ పరీక్ష ఫీజు రూ.450 తోపాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభ తేదీ : ఏప్రిల్ 11
- మెయిన్స్ పరీక్ష ప్రారంభ తేదీ : జూన్ 7
- అధికారిక వెబ్సైట్ : https://www.rbi.org.in/
ఎగ్జామ్ లేకుండానే నేవీలో ఉద్యోగం - మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు - ఎంపికైతే మొదటి నెల నుంచే రూ.56,100 వేతనం

