ETV Bharat / education-and-career

కేంద్ర బడుల్లో కొలువులు - దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయల్లో పలు పోస్టుల భర్తీకి ప్రకటన - అన్నీ కలిపి 14967 ఖాళీలు భర్తీ చేయనున్న అధికారులు

Posts in Kendriya Vidyalayas And Jawahar Navodaya
Posts in Kendriya Vidyalayas And Jawahar Navodaya (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 17, 2025 at 5:02 PM IST

5 Min Read
Choose ETV Bharat

Posts in Kendriya Vidyalayas And Jawahar Navodaya: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాల్లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ఈ ఉద్యోగం కోసం ఎలాంటి అపర్హలు ఉండాలి, అసలు ఏ విభాగాల్లో అవకాశాలున్నాయో తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయల్లో పలు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, వైస్‌ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్‌ టీచర్, లైబ్రేరియన్, పీఈటీ, బోధనేతర పోస్టులు అన్నీ కలిపి 14967 ఖాళీలు భర్తీ చేస్తారు. పోస్టు ప్రకారం పరీక్షలు, ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్టుల్లో ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు సుస్థిరమైన కెరియర్‌ సొంతం చేసుకోవడంతోపాటూ, ఆకర్షణీయ వేతనమూ అందుకోవచ్చు.

14967 పోస్టులు: కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయల్లో ఖాళీలను ఉమ్మడి పరీక్షతో సీబీఎస్‌ఈ భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించాలి. ప్రైమరీ టీచర్లు సుమారు రూ.60,000, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు దాదాపు రూ.80,000, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు ఇంచుమించు రూ.90,000 మొదటి నెల నుంచే జీతం పొందగలరు. కొన్నేళ్ల అనుభవంతో భవిష్యత్తులో సొంత రాష్ట్రంలో సేవలకూ వీలవుతుంది.

ఇంటర్మీడియట్‌/డిగ్రీ/పీజీతోపాటూ డీఎడ్, బీఎడ్‌ పూర్తిచేసినవారు ఈ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. పీఆర్‌టీ, టీజీటీ పోస్టులకు సీటెట్‌లో అర్హత తప్పనిసరి. నాన్‌ టీచింగ్‌ పోస్టులకు పది, ఇంటర్, డిగ్రీ మొదలైన సాధారణ విద్యార్హతలతోనూ అవకాశం ఉంది. వీరికీ ఆకర్షణీయ వేతనాలు అందుతాయి. కొన్ని ఉద్యోగాలకు మాత్రం అనుభవం కావాలి.

పోస్టు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ)

ఖాళీలు: 2996

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో పీజీ, బీఎడ్‌

వయసు: 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: లెవెల్‌ 8 రూ.47,600-1,51,100

పోస్టు: ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)

ఖాళీలు: 6215

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎడ్‌ పూర్తిచేసి, సీటెట్‌లో అర్హత సాధించాలి.

వయసు: 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: లెవెల్‌ 7. రూ.44,900-1,42,400.

పోస్టు: ప్రైమరీ టీచర్‌

ఖాళీలు: 2684

అర్హత: ఇంటర్మీడియట్‌ 50 శాతం మార్కులతో పాటూ రెండేళ్ల డీఎడ్‌ కోర్సు పూర్తి చేయాలి. లేదా 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీబీఎడ్‌. వీటితోపాటు సీటెట్‌ పేపర్‌-1లో అర్హత సాధించాలి.

వయసు: 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: లెవెల్‌ 6. రూ.35,400-1,12,400

పోస్టు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌

ఖాళీలు: 1312

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తి చేయాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35, హిందీ అయితే 30 పదాలు కంప్యూటర్‌పై టైప్‌ చేయగలగాలి.

వయసు: 27 ఏళ్లు మించరాదు

వేతన శ్రేణి: లెవెల్‌ 2. రూ.19,900-63,200

ఇవే కాకుండా అసిస్టెంట్‌ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్, లైబ్రేరియన్, ప్రైమరీ టీచర్‌ మ్యూజిక్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ల్యాబ్‌ అటెండెంట్, మరి కొన్ని విభాగాల్లోనూ కొన్నేసి చొప్పున ఖాళీలు ఉన్నాయి. దాదాపు అన్ని పోస్టులకూ కంప్యూటర్‌ అప్లికేషన్‌ ప్రావీణ్యం ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్టు ప్రతిభతో నియామకాలుంటాయి.

టైర్‌-1 పరీక్ష: పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, ఇతర ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రశ్నాంశాలు ఉమ్మడిగానే ఉంటాయి. పీఆర్‌టీ ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ స్థాయిలో, టీజీటీకి డిగ్రీ స్థాయిలో, పీజీటీ, ఆపై స్థాయి పోస్టులకు పీజీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. మల్టీ టాస్కింగ్‌ తప్ప మిగిలిన అన్ని పోస్టులకూ టైర్‌-1 పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, బేసిక్‌ కంప్యూటర్‌ లిటరసీ, జనరల్‌ నాలెడ్జ్‌ ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 10, అభ్యర్థి ఎంచుకున్న మరో భాష నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తఫ్పు సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలు గుర్తించాలి.

టైర్‌-2: దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించి విభాగాల వారీ ఉన్న ఖాళీలకు పది రెట్ల మందిని టైర్‌-1 మార్కుల మెరిట్‌ ప్రకారం టైర్‌-2కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను పోస్టు, సబ్జెక్టుల వారీ విడిగా నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించిన సబ్జెక్టులో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు 60, ప్రశ్నకు 4 చొప్పున డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు 10 వస్తాయి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలు గుర్తించాలి. ఈ విభాగంలో తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. డిస్క్రిప్టివ్‌కు పేపర్‌పై పెన్నుతో జవాబులు రాయాలి.

టైర్‌-1 సన్నద్ధత

  • జనరల్‌ రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీలకు సంబంధించి సీబీఎస్‌ఈ 8,9,10 తరగతుల్లోని ఈ విభాగాల పరిధిలోకి వచ్చే చాప్టర్లు బాగా చదవాలి. ఈ విభాగాల్లో ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ ఆబ్జెక్టివ్‌ అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ పుస్తకాల అధ్యయనం చేస్తే సరిపోతుంది.
  • కంప్యూటర్‌ లిటరసీ కోసం ప్రాథమికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ స్థాయిలోని అంశాలు సన్నద్ధమైతే చాలు.
  • జనరల్‌ నాలెడ్జ్‌ కోసం ఏప్రిల్, 2025 నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే దేశాలు-రాజధానులు-కరెన్సీ, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ఎత్తైనవి, లోతైనవి ఇలా స్టాక్‌ జీకే ప్రాధాన్యం ప్రకారం చదవాలి. మనోరమ ఇయర్‌ బుక్‌ లేదా లూసెంట్‌ జీకే ఉపయోగపడతాయి.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లోనూ ప్రాథమిక స్థాయి ప్రశ్నలే వస్తాయి. అలాగే ఎంచుకున్న భాషలోనూ అభ్యర్థి ఎదుర్కోగలిగేలా ప్రశ్నలు ఉంటాయి. పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకోవాలి.

టైర్‌-2కు ఇలా

  • పోస్టులు, సబ్జెక్టుల వారీ సిలబస్‌ ప్రకటించారు. వాటిని శ్రద్ధగా పరిశీలించాలి. అందులోని అంశాలనే బాగా సన్నద్ధమైతే సరిపోతుంది.
  • టీచింగ్‌ పోస్టులకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. పరీక్షలో విజయానికి ఇవే ముఖ్యమైన అస్త్రాలు. పోటీ పడుతోన్న పోస్టు ప్రకారం డీఎడ్‌/బీఎడ్‌ పాఠ్యాంశాలు బాగా అధ్యయనం చేయాలి.
  • ప్రైమరీ టీచర్‌ పోస్టులకు పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులపైనా పట్టు ఉండాలి. డీఎడ్‌ రెండేళ్ల పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి.
  • టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ స్థాయి వరకు లోతైన అధ్యయనం తప్పనిసరి. అలాగే బీఎడ్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకోవాలి.
  • పీజీటీ కోసమైతే పీజీ స్థాయిలో సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. వాటితో పాటూ బీఎడ్‌ పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది.
  • అధ్యయనం తర్వాత పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. ప్రశ్నల స్థాయి, పరీక్ష స్వరూపంపై అవగాహన పెంచుకోవాలి. గతంలో జరిగిన డీఎస్సీ, టెట్, సీటెట్, టీఆర్‌టీ ప్రశ్నపత్రాలూ సన్నద్ధతకు ఉపయోగపడతాయి. పీజీటీ పోస్టులకైతే సంబంధిత సబ్జెక్టుల్లో జేఎల్, డీఎల్, యూజీసీ/సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
  • పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధతను మెరుగుపరుచుకుంటే పోటీలో ముందుంటారు. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివి వదిలేయడమే మేలు చేస్తుంది.

ఇంటర్వ్యూ: టైర్‌-2 మార్కుల మెరిట్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. స్కిల్‌ టెస్టు అవసరమైన పోస్టులకు ఒక్కో ఖాళీకీ ఐదు మందిని పిలుస్తారు.

ముఖ్య వివరాలు: ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 4

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులందరూ రూ.500 ప్రాసెసింగ్‌ ఫీ చెల్లించాలి. పరీక్ష ఫీ పోస్టు ప్రకారం రూ.1200 నుంచి 2300 వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పరీక్ష ఫీ లేదు.

వెబ్‌సైట్లు: https://www.cbse.gov.in , https://kvsangathan.nic.in , https://navodaya.gov.in

ఎదగాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించారు - అర కోటి వేతనంతో జాబ్​ కొట్టారు

జర్మనీ భాషపై పట్టు సాధిస్తే విదేశీ కొలువు మీ సొంతం - నెలకు రూ.లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశాలు