ETV Bharat / education-and-career
హైస్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ - తపాలా శాఖ సూపర్ స్కీమ్ - సంవత్సరానికి రూ.6వేలు ఫ్రీ!
-విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సహాం అందించేందుకు తపాలా శాఖ "దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన" - ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

Published : September 2, 2026 at 11:29 AM IST
Post Office Deen Dayal SPARSH Yojana: ప్రతిభ ఉన్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తపాలా శాఖ నిర్వహించే "దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన" పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సహాం అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విద్యను కొనసాగించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే దీన్‌దయాళ్ స్పర్శ్ యోజనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పాఠశాల విద్యార్థులకు చేయూతే లక్ష్యంగా: చిన్న వయసు నుంచే స్కూల్ విద్యార్థుల్లో పోస్టల్ స్టాంపులపైన అవగాహన తీసుకురావడంతో పాటు చరిత్ర సహా సమకాలీన అంశాల్లో వారిలో ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా తపాలా శాఖ ఈ పథకం తీసుకొచ్చింది. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనాన్ని పిల్లలకు అలవాటు చేయడమూ ఇందులో భాగమే. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రకటన ఇటీవల వెలువడింది.
అర్హతలు:
- ఈ స్కీమ్ అప్లై చేయాలనుకునే విద్యార్థులు కచ్చితంగా 6, 7, 8 లేదా 9వ తరగతి చదువుతూ ఉండాలి.
- స్కూల్‌లో తపాలా అధ్యయనానికి సంబంధించిన క్లబ్‌లో విద్యార్థికి సభ్యత్వం ఉండాలి. ఒకవేళ స్కూల్‌లో తపాలా క్లబ్ లేకపోతే, విద్యార్థికి పోస్టల్ బ్యాంకులో అకౌంట్ ఉండాలి.
- గత సంవత్సరం వార్షిక పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఇక ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ఎలా ఉంటుంది: ఈ స్కాలర్షిప్కు విద్యార్థుల ఎంపికను రెండు దశల్లో నిర్వహిస్తారు.
- మొదటి దశ: 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో వర్తమాన వ్యవహారాలు, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, స్పోర్ట్స్ సహా తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- రెండో దశ: పరీక్షలో ఉత్తీర్ణులైన వారు పోస్టల్ స్టాంపులకు సంబంధించిన ప్రాజెక్టు చేయాలి. ఇందులో ప్రతిభ ఆధారంగా ప్రతి పోస్టల్ సర్కిల్‌కి 40 మందిని (ప్రతి క్లాస్‌కు 10 మంది చొప్పున) ఎంపిక చేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా 920 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు బ్యాంకు లేదా పోస్టాఫీసు ద్వారా మూడు నెలలకు రూ.1500 చొప్పున సంవత్సరానికి రూ.6వేల స్కాలర్‌షిప్ అందజేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి: విద్యార్థులు పాఠశాల హెడ్మాస్టర్ లేదా విద్యాశాఖ/తపాలా శాఖ అధికారుల సూచనల ప్రకారం అప్లై చేయాలి.
ముఖ్య తేదీలు:
- దరఖాస్తుకు తుది గడువు: పోస్టల్ సర్కిల్ వారీగా సెప్టెంబరు 10, 2026 - సెప్టెంబర్ 16, 2026
- పరీక్ష తేదీ: సెప్టెంబర్ 27 నుంచి సెప్టెంబరు 30, 2026
- వెబ్‌సైట్: www.indiapost.gov.in/
పీజీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం "రూ.లక్షన్నర స్కాలర్‌షిప్" - ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

