ETV Bharat / education-and-career
ఈఎస్‌ఐ కార్మికుల పిల్లలకు గుడ్‌న్యూస్ - కేవలం రూ.24 వేలతో ఎంబీబీఎస్ సీటు
ఈఎస్‌ఐసీ (ఐపీ కోటా) ద్వారా కార్మికుల పిల్లలకు వైద్య విద్యలో ప్రత్యేక అవకాశాలు - సంవత్సరానికి సుమారు రూ.24,000 మాత్రమే - దరఖాస్తు, కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే?

Published : May 4, 2026 at 4:06 PM IST
MBBS Seats for Workers Children : ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ) దేశవ్యాప్తంగా కార్మికుల ఆరోగ్య రక్షణకు మాత్రమే కాకుండా, వారి పిల్లల భవిష్యత్తుకు కూడా బలమైన పునాది వేస్తోంది. ముఖ్యంగా వైద్య విద్యలో అవకాశాలు కల్పించడం ద్వారా సామాజిక భద్రతను మరింత విస్తరించింది. ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడమే కాకుండా, వైద్య, దంత, నర్సింగ్ విద్యలో ప్రత్యేక కోటా సీట్లను అందిస్తోంది.
ఈఎస్‌ఐసీ వైద్య విద్యా సంస్థలు : ఈఎస్‌ఐసీ దేశవ్యాప్తంగా 19 వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులను నిర్వహిస్తోంది. వీటిలో ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉంటాయి. తెలంగాణలోని సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్‌ఐసీ బోధనాసుపత్రి కూడా విద్యార్థులకు మంచి అవకాశాలను కల్పిస్తోంది. ఇక్కడ ఐపీ కోటా కింద 52 సీట్లు కేటాయించారు.
మూడు రకాల కోటాలు : ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపు మూడు ప్రధాన కోటాల ద్వారా జరుగుతుంది.
- మొత్తం సీట్లలో 50% రాష్ట్ర కోటా కింద స్థానిక విద్యార్థులకు మెరిట్ ఆధారంగా లభిస్తాయి.
- 15% సీట్లు ఆలిండియా కోటా కింద దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
- మిగిలిన 35% సీట్లు ఐపీ (ఇన్‌స్యూర్డ్ పర్సన్స్) కోటా కింద కార్మికుల పిల్లలకు కేటాయిస్తారు.
ఈ ఐపీ కోటా ద్వారా లభించే సీట్లకు ఫీజు చాలా తక్కువగా, సంవత్సరానికి సుమారు రూ.24,000 మాత్రమే ఉండటం ప్రత్యేకత. ఇతర కోటాల విద్యార్థులు మాత్రం సుమారు రూ.1 లక్ష వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలు : ఈ కోటా ప్రయోజనం పొందేందుకు కొన్ని అర్హతలు ఉన్నాయి. ఈఎస్‌ఐ పరిధిలో పని చేసే కార్మికుల పిల్లలు మాత్రమే దీనికి అర్హులు. అలాగే, వారు తప్పనిసరిగా నీట్ (యూజీ)-2026 పరీక్షకు హాజరై ఉండాలి. ఉద్యోగంలో గాయపడి వికలాంగులైన లేదా మరణించిన కార్మికుల పిల్లలకు కూడా ఈ కోటాలో ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఐపీ కోటా కింద సీటు పొందాలంటే 'వార్డ్ ఆఫ్ ఐపీ' సర్టిఫికెట్ తప్పనిసరి. దీనికి విద్యార్థులు ఈఎస్‌ఐసీ అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి. కార్మికుడి నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తవుతుంది. విద్యార్థి, తల్లిదండ్రుల వివరాలు, ఫొటోలు, పుట్టిన తేదీ, నీట్ అడ్మిట్ కార్డు వంటి పత్రాలను అప్లోడ్ చేయాలి. అవసరమైతే అఫిడవిట్ కూడా సమర్పించాలి. అధికారులు ధృవీకరించిన తర్వాత సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కౌన్సెలింగ్ ప్రక్రియ : సర్టిఫికెట్ పొందిన తర్వాత విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌లో ప్రత్యేకంగా ఐపీ కోటా కోసం దరఖాస్తు చేయాలి. పరీక్షలో సాధించిన ర్యాంకు, మెరిట్, రిజర్వేషన్ కేటగిరీ, ఎంపిక చేసిన కాలేజీల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
విద్యార్థులకు మంచి భవిష్యత్తు : ఈఎస్‌ఐసీ ఐపీ కోటా కార్మికుల పిల్లలకు వైద్య విద్యలో ఒక గొప్ప అవకాశంగా నిలుస్తోంది. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించడమే కాకుండా, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సరైన సమాచారం, సమయానికి దరఖాస్తుతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది.
మైనస్ మార్కులు వచ్చినా డాక్టర్ సీటు - ప్రైవేటుగా విక్రయానికేనంటూ తీవ్ర విమర్శలు

