ETV Bharat / education-and-career
"మీ అమ్మాయి బాగా చదువుతుందా?" - ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు!
చదువుల తల్లులకు లక్ష్మీ కటాక్షం - స్కాలర్‌షిప్ అవకాశం కల్పిస్తున్న కంపెనీలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 13, 2026 at 1:11 PM IST
Kotak Mahindra Scholarships : పేదరికం కారణంగా చదువు అర్ధాంతరంగా ఆగిపోవద్దన్న ఉద్దేశంతో ప్రైవేటు సంస్థలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రతిభ, తపన ఉన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఎంతో మంది ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉపకార వేతనాలను అందిస్తున్నాయి. తాజాగా కొటాక్ 'మహీంద్రా బ్యాంక్, షెఫ్లర్ ఇండియా' ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చూపిన బాలికల ఉన్నత చదువులకు ఉపకార వేతనాలు ప్రకటించాయి.
కొటాక్ మహీంద్రా బ్యాంక్ 'సీఎస్‌ఆర్ ప్రాజెక్టు'లో భాగంగా 'కొటాక్ కన్య స్కాలర్‌షిప్-2026' పేరిట ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్ చదివిన బాలికలు వచ్చే 2026-27 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, డిజైన్, ఎల్‌ఎల్‌బీ తదితర ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరిన వారికి ఆర్థిక సాయం అందుతుంది. ఏటా రూ.1.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేతికందుతుంది. ఈ మొత్తాన్ని కాలేజీ ఫీజు, ఇంటర్నెట్, రవాణా, ల్యాప్‌టాప్, బుక్స్, స్టేషనరీ కొనుగోలు కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. కోర్సుతో పాటు విద్యార్థి ఆర్థిక స్థితిగతులు, అకడమిక్ మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్ మంజూరు చేయనున్నారు.
విద్యార్థులకు గుడ్‌న్యూస్ - ఒకటి కంటే ఎక్కువ స్కాలర్‌షిప్‌లకు ఛాన్స్
ప్రతిభ చూపితేనే
ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థినులకు ఏటా కనీస అర్హత ప్రమాణాల ఆధారంగా కోర్సు పూర్తయ్యే వరకూ ఆర్థిక సాయం అందిస్తారు. కనీసం 6 సీజీపీఏ, ఆ తర్వాత అకడమిక్ ఇయర్‌కు అర్హత సాధించాలి. విద్యార్థినికి సంబంధించిన అర్హత వివరాలను కొటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. రెగ్యులర్ అకడమిక్ సెషన్స్ డ్రాపవుట్ అయితే స్కాలర్‌షిప్ నిలిపేస్తారు.
ఇతర వివరాలు
- స్కాలర్‌షిప్ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. ఎంపికయ్యే సమయానికి 18 ఏళ్లు నిండకపోతే, విద్యార్థిని తల్లిదండ్రుల ఖాతాలో జమచేస్తారు.
- కోర్సు తొలి ఏడాది పూర్తి కాగానే మార్కుల మెమో, రెండో సంవత్సరం ఫీజుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. కోర్సు పూర్తయ్యే వరకూ ఏటా ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు సంబంధిత పోర్టల్‌లో మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో అకౌంట్ క్రియేట్ చేసుకుని పర్సనల్ ప్రొఫైల్ పూర్తిచేయాలి. అవసరమైన సర్టిఫికెట్లన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
- ఎంపికైన విద్యార్థినులకు పోర్టల్‌తోపాటు రిజిస్టర్డ్ ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.
- స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు తేదీ : అక్టోబరు 15, 2026
- వెబ్‌సైట్: https://www.kotakeducationfoundation.org/kotak-kanyascholarship
అర్హతలు
- ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు లేదా అందుకు సమానమైన సీజీపీఏ ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
- గుర్తింపు పొందిన కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశం తప్పనిసరి.
- కొటాక్ మహీంద్రా గ్రూపు సంస్థల ఉద్యోగుల పిల్లలకు అవకాశం లేదు.
అవసరమైన ధ్రువపత్రాలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో వీటన్నిటినీ సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఇంటర్ మార్కుల మెమో
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కొత్తగా చేరిన కాలేజీలో ఫీజుల వివరాలు
- అడ్మిషన్ సర్టిఫికెట్, ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోరు కార్డు
- ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- వైకల్య ధ్రువీకరణ పత్రం (దివ్యాంగులైతే)
- తల్లి లేదా తండ్రి లేనట్లైతే డెత్ సర్టిఫికెట్
- ఇంటి ఫొటోలు
ఎంపిక
ముందుగా విద్యార్థి అకడమిక్ మెరిట్, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా జాబితాను రూపొందిస్తారు. ఎంపికైన వారు రెండు దశల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఆ తర్వాత వాళ్లకు ర్యాంకులు కేటాయించి ఎంపిక చేస్తారు.
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఏటా రూ.50 వేలు!
ఇంజినీరింగ్‌లో విద్యార్థినులకు షెఫ్లర్ ఇండియా సంస్థ నాలుగేళ్ల పాటు ఏటా రూ.50 వేలు ఉపకార వేతనం అందిస్తోంది. వీరిలో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉపకార వేతనంతో పాటు సంస్థ ఉద్యోగులతో ఆరు నెలల పాటు మెంటర్‌షిప్ అవకాశం కూడా ఉంటుంది.
అర్హతలు
ఇంటర్(సైన్స్ గ్రూపు)లో కనీసం 60 శాతం మార్కులు, దివ్యాంగులు 40 శాతం సాధించి ఉండాలి. ప్రస్తుతం ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.
ఎంపిక విధానం ఇలా
ముందుగా మీ వివరాలతో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. పాస్‌ఫొటో, ఆధార్, ఆదాయం, టెన్త్, ఇంటర్ మెమో, బీటెక్ అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు అప్‌లోడ్ చేయాలి. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత ముందుగా ఓ జాబితా రూపొందించి 10 నుంచి 15 నిమిషాల టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దాని ఆధారంగా ఉపకార వేతనానికి ఎంపిక చేస్తారు. కోర్సు కొనసాగే నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15.
వెబ్‌సైట్: https://www.buddy4study.com/page/hope-engineering-scholarship-by-schaeffler-india
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో '389 మేనేజర్ జాబ్స్' - దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!
SBIలో '1538 క్లర్క్' ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులున్నాయంటే?

