ETV Bharat / education-and-career
పరీక్ష లేకుండానే రూ.1.20 లక్షల జీతం - భారత నేవీలో సువర్ణావకాశం!
- ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్ విడుదల - అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూతోనే ఉద్యోగం!

Published : July 6, 2026 at 10:56 AM IST
Indian navy short service Jobs : భారత నౌకాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 275 అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. యూజీ, పీజీ అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదా కల్పిస్తారు. మొదటి నెల నుంచే సుమారు రూ.1.20 లక్షల వేతనం అందుకునే అవకాశం ఉంటుంది.
ఇవి ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచ్‌లలోని లెవెల్-10 పోస్టులు. అప్లై చేసిన వారు విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించే ఇంటర్వ్యూకు పిలుస్తారు. అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
అభ్యర్థులకు కేరళలోని ఎజిమల నేవల్ అకాడమీలో జూన్ 2027 నుంచి 22 వారాల ప్రాథమిక శిక్షణ ఇస్తారు. అనంతరం సంబంధిత విభాగంలో మరో 22 వారాల ప్రత్యేక శిక్షణ పూర్తిచేసిన తర్వాత సబ్ లెఫ్టినెంట్‌గా విధుల్లోకి తీసుకుంటారు.
ఈ ఉద్యోగాలు లెవెల్-10 పే స్కేల్‌కు చెందినవి. మూల వేతనం రూ.56,100. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు కలిపి నెలకు సుమారు రూ.1.20 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ప్రొబేషన్ కాలం రెండేళ్లు. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మొదట 12 ఏళ్లు సేవలందించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు పొడిగింపు లభించవచ్చు. అంటే గరిష్ఠంగా 14 ఏళ్లపాటు నేవీలో సేవలు అందించే అవకాశం ఉంటుంది. అనంతరం నేవీలోని అనుభవంతో ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి అవకాశాలు పొందవచ్చు.
ఖాళీలు – అర్హతలు :
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్‌లో మొత్తం 90 పోస్టులు ఉన్నాయి. ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (15), నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ అబ్జర్వర్స్ (18), పైలట్ (25) పోస్టులు ఉన్నాయి. వీటికి బీఈ/బీటెక్‌తో పాటు పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 60 శాతం మార్కులు తప్పనిసరి.
- లాజిస్టిక్స్ (10), నేవల్ ఆర్మమెంట్ (14) పోస్టులకు బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎమ్మెస్సీ (ఐటీ), ఎంసీఏ లేదా బీఎస్సీ/బీకామ్‌తోపాటు లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్‌లో పీజీ డిప్లొమా ఉన్నవారు అర్హులు.
- ఎడ్యుకేషన్ బ్రాంచ్ లో 13 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులను బట్టి బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ పూర్తిచేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
- టెక్నికల్ బ్రాంచ్ లో ఇంజినీరింగ్ 24, సబ్‌మెరైన్ టెక్ ఇంజినీరింగ్ 8, ఎలక్ట్రికల్ 32, సబ్‌మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ 8, నేవల్ కన్‌స్ట్రక్టర్ 18 పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
- వయోపరిమితి : మీరు ఎంచుకునే పోస్టును బట్టి మారొచ్చు. ఎక్కువ పోస్టులకు జులై 2, 2000 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించినవారు అర్హులు.
- NCC 'C' సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు అకడమిక్ మార్కుల్లో 5 శాతం సడలింపు ఉంటుంది. ఇది అన్ని పోస్టులకూ వర్తిస్తుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు జులై 27, 2026 చివరి తేదీ.
- SSB ఇంటర్వ్యూ కేంద్రాలు : బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతా
- అధికారిక వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

