ETV Bharat / education-and-career
"డిగ్రీలు అక్కర్లేదు - నైపుణ్యం ఉంటే చాలు!" - 'ఇండియా స్కిల్స్' పోటీలకు అప్లై చేయడానికి ఆరోజే లాస్ట్!
-యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకే కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా స్కిల్స్’ పేరిట ఏటా పోటీలు - ఉత్తమ ప్రతిభ చూపిన వారు పతకాలు, బహుమతులు పొందవచ్చు!

Published : August 27, 2026 at 10:06 AM IST
India Skills Competition 2026: టాలెంట్ అనేది ఎవరీ సొత్తు కాదు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుంది. అయితే టాలెంట్‌ను బయటపెట్టాలంటే కొన్నిసార్లు విద్యార్హతలు అడ్డం వస్తాయి. దీంతో చాలా మంది వెనకడుగువేస్తుంటారు. ఇకపై ఆ అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం సూపర్ ఛాన్స్ ఇస్తోంది. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకే "ఇండియా స్కిల్స్" పేరిట ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తోంది. ఇటీవలే ఈ ఏడాదికి సంబంధించిన ప్రకటన కూడా రిలీజ్ చేసింది. మరి ఈ పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పోటీ ఉద్దేశం: "ఇండియా స్కిల్స్" దేశవ్యాప్తంగా యువతలో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికితీసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. సరైన విద్యార్హతలు లేకపోయినా, ఏదో ఒక రంగంలో ప్రాక్టికల్ స్కిల్ ఉన్న వారికి ఈ పోటీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్కిల్స్ ఆధారంగా కెరియర్‌ను బిల్డ్ చేసుకోవాలనుకునే యువతకు ఈ కార్యక్రమం మంచి వేదిక. ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ చూపిన వారు పతకాలు, బహుమతులతో పాటు ప్రత్యేక శిక్షణ, గుర్తింపూ సొంతం చేసుకోవచ్చు.
63 విభాగాల్లో: "ఇండియా స్కిల్స్ 2026-27" పోటీలను వివిధ రంగాల్లో నిర్వహిస్తున్నారు. ఈసారి మొత్తం 63 నైపుణ్య విభాగాల్లో యువత ప్రతిభను పరీక్షించుకునే అవకాశం ఉంది. ఇందులో కూడా రెండు కేటగిరీలు ఉన్నాయి. మొదటిది సింగిల్, రెండోది టీమ్.
విభాగాలు ఇవే: త్రీడీ డిజిటల్ గేమ్ ఆర్ట్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఆటోబాడీ రిపేర్, ఆటోమొబైల్ టెక్నాలజీ, బేకరీ, బ్యూటీ థెరపీ, బ్రిక్లేయింగ్, క్యాబినేట్ మేకింగ్, కార్ పెయింటింగ్, కార్పెంటరీ, కెమికల్ లేబోరేటరి టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, సీఎన్సీ మిల్లింగ్, సీఎన్సీ టర్నింగ్, కుకింగ్, డెంటల్, డిజిటల్ కన్‌స్ట్రక్షన్, డిజిటల్ ఇంట్రాక్టివ్ మీడియా, ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్లోరిస్ట్రీ, గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ, హెయిర్ డ్రెస్సింగ్, హెల్త్ అండ్ సోషల్ కేర్, హెవీ వెహికల్ టెక్నాలజీ, హోటల్ రిసెప్షన్, ఇండస్ట్రియల్ కంట్రోల్, ఇండస్ట్రియల్ డిజైన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ మెకానిక్స్, ఐసీటీ నెటవర్క్, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ టెక్నాలజీ, ఐటీ నెట్వర్క్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డిజిటల్ టెక్నాలజీస్, హాస్పిటాలిటీ, ట్రాన్స్‌పోర్టేషన్, క్రియేటివ్ ఇండస్ట్రీస్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్ సిస్టమ్స్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ తదితర పరిశ్రమల అవసరాలకు సంబంధించిన రంగాల్లో యువత ప్రతిభను ప్రదర్శించవచ్చు.
ఎంపిక ప్రక్రియ: దేశవ్యాప్తంగా జరిగే ఈ పోటీలను దశల వారీగా నిర్వహిస్తుంటారు. మొదటగా జిల్లా, జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన చేసిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ కూడా బాగా చేసిన వాళ్లను ప్రాంతీయ, ఆపై జాతీయ స్థాయికి తీసుకెళ్తారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిభావంతులతో తలపడి, అద్భుతంగా రాణించిన వారు అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందొచ్చు. అందుకే వీటిని కేవలం పోటీలుగా కాకుండా మనలో దాగి ఉన్న నైపుణ్యాలకు ఆవిష్కరణల రూపం ఇచ్చే వేదికగా భావించాలి. గత సంవత్సరం మూడున్నర లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈసారి ఈ సంఖ్య పెరగొచ్చు.
పేటెంటూ పొందొచ్చు: ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో స్కిల్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. చదువులో అంతంత మాత్రంగానే ఉన్నా, ఇండస్ట్రీలకు అవసరమయ్యే నైపుణ్యాలు ఉంటే ఈజీగా ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి పోటీల ద్వారా యువత తమలోని టాలెంట్‌ను ఇతరులతో పోల్చుకొని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ ప్రదర్శించిన ప్రత్యేక నైపుణ్యానికి పేటెంట్ పొందే వీలూ ఉంది.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి: ఎంపిక చేసుకున్న స్కిల్ విభాగాన్ని బట్టి అర్హతలు, వయసు, పోటీ నియమాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే, దరఖాస్తు చేసేముందు సంబంధిత నైపుణ్య వివరాలను పరిశీలించుకోవాలి.
- ముందుగా ఇండియా స్కిల్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపించే Apply for India Skills Competition 2026-27పై క్లిక్ చేయాలి.
- అనంతరం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ని సెట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఈకేవైసీ ప్రాసెస్ ఎంచుకోవాలి. అందులో IRC, Biometric, Aadhar ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవాలి.
- ఉదాహరణకు ఆధార్ ప్రాసెస్ ఎంచుకుంటే ఆ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. దానిని మరోసారి ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- ఈ-కేవైసీ పూర్తయిన తర్వాత, మీరు పోటీ పడాలనుకుంటున్న నైపుణ్య విభాగాన్ని సెలెక్ట్ చేసుకుని వివరాలు నింపి, సబ్మిట్ చేయాలి.
వివరాలు:
- అర్హత: వయసు 16 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2011 జనవరి 1 లోపు జన్మించి ఉండాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 30.
- అప్లికేషన్ లింక్
ఖర్చులేకుండా విదేశాల్లో చదువుకునే అవకాశం! - ఏమేం అర్హతలు ఉండాలో తెలుసుకోండి

