ETV Bharat / education-and-career

ఐఐటీ విద్యార్థులకు సూపర్​ న్యూస్ - మీరు కోరుకున్న భాషలోనే చదువుకోవచ్చు!

బీటెక్‌ తొలి సెమిస్టర్‌ కోరుకున్న మాధ్యమంలో - చదువుకునే వెసులుబాటు - ఎంటెక్‌ సిలబస్‌ ప్రక్షాళన -ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి క్రీడలు, ఒలింపియాడ్‌ కోటా సీట్లూ జోసా ద్వారా భర్తీ -56వ ఐఐటీ కౌన్సిల్‌ నిర్ణయాలివీ

Mother Language in IITS
Mother Language in IITS (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 10:32 AM IST

3 Min Read
Choose ETV Bharat

Mother Language in IITS : విద్యార్థులకు ఆంగ్ల భాష సమస్యగా మారకుండా ఇంజినీరింగ్‌ విద్యనూ మాతృభాషల్లో అందించాలని యోచిస్తోన్న కేంద్ర ప్రభుత్వం, ఐఐటీల్లో బీటెక్‌ మొదటి సెమిస్టర్‌ను వారు కోరుకున్న భాషల్లో చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు, వివిధ భాషల్లో ఇంటర్, తత్సమాన చదువును పూర్తి చేసి ఐఐటీల్లో (ఇండియన్ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్ టెక్నాలజీ) సీట్లు సాధించిన వారు, తొలి 6 నెలలు ఆంగ్లానికి అలవాటు పడే వరకూ మాతృభాషలో చదువుకునేందుకు వారికి వీలు కల్పిస్తారు. ఆయా భాషల్లో పాఠ్యాంశాల వీడియోలను అందుబాటులో ఉంచుతారు. పుస్తకాలను కూడా ప్రాంతీయ భాషల్లో ఉంచుతారు. ఎవరైనా మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆంగ్ల ఉపన్యాసాలను ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసేలా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకోవాలని, అందుకు ఐఐటీలు ఇతర సాంకేతిక విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది.

గత ఆగస్టు 25వ తేదీన దిల్లీలో 56వ ఐఐటీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించిన సంగతి విధితమే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉన్న కౌన్సిల్‌ సమావేశంలో దేశంలోని 23 ఐఐటీల డైరెక్టర్లు, వాటి ఛైర్మన్లు, యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్), ఏఐసీటీఈ తదితర అధికారులు పాల్గొంటారు. ఐఐటీలకు సంబంధించి ఏ కీలక నిర్ణయమైనా ఇందులోనే తీసుకుంటారు. నాటి సమావేశానికి సంబంధించి తీర్మానాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. మొదటి సెమిస్టర్‌ తర్వాత విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది. గత రెండేళ్ల నుంచి ఐఐటీ జోధ్‌పుర్‌లో బీటెక్‌ మొదటి ఏడాది హిందీలో చదువుకునే వెసులుబాటు కల్పించారు.

పరిశ్రమల అవసరాల మేరకు ఎంటెక్‌ : ఎంటెక్‌ సిలబస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఐఐటీ కౌన్సిల్​లో నిర్ణయించారు. భారత్‌లో బీటెక్‌ పూర్తయిన తర్వాత ఎందుకు ఎంటెక్‌లో చేరటం లేదనే దానిపై చర్చించిన ఐఐటీలు, అందుకు పరిమితంగా స్పెషలైజేషన్లు ఉండటం, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లేకపోవడం ఓ ముఖ్య కారణంగా భావించారు. అందుకే ఎంటెక్‌లో ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. పరిశ్రమల నిపుణులతో కూడిన కమిటీలను నియమించి ఇండస్ట్రీ అవసరాల మేరకు కోర్సులను రూపొందించాలని నిర్ణయించారు.

మరికొన్ని నిర్ణయాలు :

  • ఒక్కో ఐఐటీలో 3 వేల నుంచి 18 వేల మంది విద్యార్థులున్నారు. వారి మానసిక ఆరోగ్యాన్ని(మెంటల్ హెల్త్) దృష్టిలో ఉంచుకొని అవసరమైన కౌన్సెలర్, సైకియాట్రిస్ట్‌, సైకాలజిస్ట్ లాంటి పోస్టులు సృష్టించనున్నారు. వాటిని రెగ్యులర్‌ లేదా కాంట్రాక్ట్‌ విధానంలో నియామకం చేస్తారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నందు వల్ల వాటిని నివారించేందుకు గత కొన్నేళ్లుగా దీనిపై విస్తృత చర్చ సాగుతోంది.
  • ఐఐటీ సీట్లను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ద్వారా భర్తీ చేస్తున్న విషయం విధితమే. క్రీడలు, సైన్స్‌ ఒలింపియాడ్‌ల ద్వారా కొన్ని సూపర్‌ న్యూమరరీ సీట్లను ఆయా ఐఐటీలు విడిగా భర్తీ చేసుకోనున్నాయి. పారదర్శకత కోసం వాటిని కూడా జోసా ద్వారానే భర్తీ చేయనున్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఆచార్యులను గుర్తించి వారిని నియమించాలని, అందుకు అవసరమైతే రూల్స్​ను మార్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.
  • ఐఐటీలకు భవిష్యత్తులో కూడా సమర్థులైన డైరెక్టర్లను నియమించేందుకు 300-350 మంది చురుకైన ఆచార్యులను గుర్తించి లీడర్​షిప్ క్వాలిటీస్​పై రెండేళ్ల పాటు శిక్షణ ఇస్తారు. దీనికి ఐఐఎంల నుంచి సహకారం తీసుకుంటారు. ఐఐటీలను ఏవిధంగా తీర్చిదిద్దాలో ప్రణాళిక రూపకల్పనకు ఐఐటీ 2047 పేరిట విజన్‌ కమిటీని కేంద్ర విద్యాశాఖ నియమించనుంది.
  • ఈ నిర్ణయాలన్నీ వచ్చే అకాడమిక్​ ఇయర్​లో అమలయ్యే అవకాశం లేదని, జోసా ద్వారా క్రీడలు, ఒలింపియాడ్‌ కోటా సీట్లు, మాతృభాషలో చదువుకునే అవకాశం లాంటివి కొన్ని అమలు కావొచ్చని ఐఐటీ వర్గాలు వివరిస్తున్నాయి.

కొలువుల నిలయంగా ఐఐటీ హైదరాబాద్​ - ఇక్కడి విద్యార్థులు జాబ్​ కొట్టడానికి అదొక్కటే కారణం

స్కూల్‌ కనెక్ట్‌ పేరిట ఐఐటీ మద్రాస్‌ ఇంటర్నెట్ కోర్సులు - ఏఐ విధానంలో బోధన