ETV Bharat / education-and-career

విమానం నడుపుతారా? - పైలట్ ఇలా కావొచ్చు! - అక్కడ ఉచిత శిక్షణ!!

- పైలట్ కావాలంటే ఏం చదవాలి? ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి?? - ఎంత ఖర్చవుతుంది?

How to Become Pilot
How to Become Pilot (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 4:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

How to Become Pilot : విమానం ఒక్కసారైనా ఎక్కడం ఎందరికో కల. అదే విమానం నడపడం కొందరికి స్వప్నం. కానీ పైలట్ కావాలంటే ఏం చదవాలో, ఏ దారిలో వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా ఈ జాబితాలో ఉంటే ఈ కథనం మీకోసమే. మరి, ఆ ప్రాసెస్​ ఏంటో ఇక్కడ చూసేయండి.

చదువు :

పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్​లో MPC (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్ తీసుకోవాలి. ఫ్లైట్ వర్కింగ్ మెథడ్, హైట్, స్పీడ్, రూట్, ఇంజిన్‌ వంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ఎంపీసీ బేస్​గా ఉంటుంది. ఇది పూర్తి చేసిన వారు పైలట్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు.

శిక్షణ ఇలా :

పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో చేరడానికి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు. ఇందులో మొదటిది స్టూడెంట్ పైలట్ లైసెన్స్. ఆ తర్వాత ప్రైవేటు పైలట్ లైసెన్స్. ఆఖరిది కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఈ లైసెన్స్​ రావాలంటే థియరీ, ప్రాక్టికల్​ లో తప్పక మెరిట్ సాధించాలి. ఫ్లైట్ నావిగేషన్, వెదర్ పరిజ్ఞానం, ప్లేన్ రూల్స్, ఇంజిన్‌ గురించిన విషయాల్లో నైపుణ్యం సాధించాలి. వీటితోపాటు కనీసం 200 గంటలపాటు ఫ్లైట్ నడిపిన ఎక్స్​పీరియన్స్ ఉండాలి. వీటికన్నా ముందు శరీరకదారుఢ్యం అనివార్యం. డీజీసీఏ ప్రమాణాల ప్రకారం ఎత్తు, బరువు ఉండాలి. ఆరోగ్యం పరంగా అన్ని టెస్టులూ పాసవ్వాలి.

కమర్షియల్‌ లైసెన్స్‌ అందుకున్నవారు నేషనల్, ఇంటర్నేషనల్ విమాన సంస్థల్లో కో-పైలట్‌గా కెరియర్‌ స్టార్ట్ చేస్తారు. ఎక్స్​పీరియన్స్ పెరిగిన తర్వాత కెప్టెన్‌ స్థాయిని అందుకోవచ్చు. హెలికాప్టర్‌ పైలట్‌గానూ, ప్లేన్ ఇన్‌స్ట్రక్టర్‌గానూ పని చేయొచ్చు.

ఎంత ఖర్చవుతుంది? :

పైలట్‌ శిక్షణ ఇచ్చేందుకు దేశంలో గుర్తింపు పొందిన సంస్థలు చాలా ఉన్నాయి. ప్రైవేట్‌ స్కూల్స్‌ ఎన్నో శిక్షణ ఇస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో కేంద్రం ఆధ్వర్యంలోని "ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్‌ అకాడెమీ" ప్రముఖ సంస్థ. సర్కారు సంస్థల్లో కాంపిటేషన్ చాలా ఎక్కువ. ఖర్చు విషయానికి వస్తే సుమారు రూ.50 లక్షలు అవసరమవుతాయి. ప్రైవేట్‌ సంస్థల్లో ఈ ఇంకా ఎక్కువగా ఉంటుంది. రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చవుతాయి.

వాయుసేనలో ఉచితంగా! :

ఎలాంటి ఖర్చూ లేకుండా ఫ్రీగా పైలట్​ కావాలని కోరుకుంటే ఇండియన్ ఎయిర్​ ఫోర్స్​లో ప్రయత్నం చేయవచ్చు. ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వారిని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ సెలక్ట్ చేస్తుంది. ఎంపికైన వారికి ట్రైనింగ్ ఇస్తుంది. ఇదేవిధంగా డిగ్రీ చదివిన వారు CDSE, AFCAT ద్వారా కూడా ఎయిర్​ ఫోర్స్​లో చేరొచ్చు. సైలక్ట్ అయిన వారికి వాయుసేన ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తారు. ఇది అత్యంత కఠినంగా ఉంటుంది. పూర్తయిన తర్వాత మెరిట్​ ఆధారంగా యుద్ధ విమానాలు, లేదా హెలికాప్టర్లు, కార్గో ప్లేన్స్ కేటాయిస్తారు.

శిక్షణ పూర్తి ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ఆ సమయంలో ఉపకార వేతనంతోపాటు భోజనం, వసతి, ఇతరత్రా వైద్య సౌకర్యాలనూ కల్పిస్తారు. ఉద్యోగంలో చేరినవారికి ఆకర్షణీయమైన వేతనం, ఇతర అలవెన్సులు, నివాస సౌకర్యాలు కూడా అందుతాయి. ఉద్యోగ విరమణ అనంతరు కూడా పౌర విమానయానంలో మంచి అవకాశాలు ఉంటాయి.

పైలట్‌ కు మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ, అది ఈజీ మార్గం మాత్రం కాదు. క్రమశిక్షణతో చదువుకోవాలి. మంచి ట్రైనింగ్ తీసుకోవాలి. ఆరోగ్యం పర్ఫెక్ట్​గా ఉండాలి. ఇవన్నీ సరిగా ఉంటేనే ఈ స్వప్నం నెరవేరుతుంది. డబ్బు లేనివారు భారత వాయుసేన అందించే అవకాశాన్ని వినియోగించుకొని ఆకాశంలో ఎగరొచ్చు. అద్భుతమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.

- బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌