ETV Bharat / education-and-career
ఐటీఐతో మెరుగైన ఉపాధి అవకాశాలు - ఆరు నెలల ఉచిత శిక్షణ, ఉపకార వేతనాలతో మంచి ఉద్యోగం
వృత్తి విద్యాకోర్సులో ఆరు నెలల పాటు పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ ప్రత్యేక శిక్షణ - ఉచితంగా తర్ఫీదుతో పాటు ఉపకార వేతనాలు

Published : January 6, 2026 at 1:17 PM IST
Nava Limited Training for Jobs : వృత్తి విద్యలో తగిన నైపుణ్యాలు ఉంటే యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే ఐటీఐ విద్యనభ్యసించినా అనేక మంది సంబంధిత కోర్సులలో పట్టు సాధించలేకపోతున్నారు. అనేక ఐటీఐ కళాశాలల్లో ప్రయోగాత్మక బోధన అంతంతమాత్రంగా ఉండటమే దీనికి ముఖ్య కారణమనే పలువురి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఆసక్తి కలిగిన అభ్యర్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో ఆరు నెలల పాటు పాల్వంచలోని ‘నవ లిమిటెడ్’ సంస్థ ప్రత్యేకంగా శిక్షణ కల్పిస్తోంది.
ఉపకార వేతనాలతో ఉద్యోగం : కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా ఇలాంటి అద్భుతమైన వేదికను యువతకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉచితంగా తర్ఫీదు ఇస్తూ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఇక్కడ నాణ్యమైన ప్రయోగాత్మక నైపుణ్యాలు నేర్పించడం వల్ల ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉద్యోగాలు సులువుగా దొరుకుతున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఉపాధి లేనిపక్షంలో స్వయం ఉపాధి యూనిట్లతో యువత రాణించవచ్చునని స్పష్టం చేస్తున్నారు.
2010 నుంచి ప్రత్యేక శిక్షణ : శిక్షణ పొందటానికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి అభ్యర్థులు ఇక్కడికి శిక్షణ కోసం వస్తున్నారు. 2010 నుంచి ఎలక్ట్రికల్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, ఏసీ మెకానిక్, ఫైర్ సేఫ్టీ కోర్సుల్లో తర్ఫీదు పొందుతున్నారు. కొన్ని కోర్సుల్లో ఇప్పటివరకు 1,970 మంది శిక్షణ తీసుకున్నారు. వీరిలో 1,822 మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత బ్యాచ్ శిక్షణ తరగతులు మొదలై మూడు నెలలవుతోంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను నిత్యం స్వీకరిస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 మందికి తర్ఫీదు ఇస్తాం. మరో కొత్త బ్యాచ్‌కు శిక్షణ తరగతులు ఏప్రిల్‌లో మొదలవుతాయి అని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
''మాది గుండాల మండల కేంద్రం. మా తల్లిదండ్రులు ఇద్దరూ కూలీ పనులు చేస్తారు. ఐటీఐ పూర్తి చేశాను. 2021లో పాల్వంచ ‘నవ’ లిమిటెడ్ సంస్థలో వృత్తి విద్య కోర్సుల్లో చేరాను. శిక్షణ ముగిసిన అనంతరం గుండాలలో ఎలక్ట్రికల్ దుకాణం ఏర్పాటు చేశాను. నాలుగేళ్లుగా ఇదే వృత్తిపై జీవనం సాగిస్తున్నాను. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాను.''- సాగర్, చిరు వ్యాపారి, గుండాల
ఇక్కడ శిక్షణతో నెలకు రూ.80 వేల జీతం :
''మాది బూర్గంపాడు మండలం కృష్ణాసాగర్. 2016లో ఐటీఐ పూర్తి చేశాను. అనంతరం ఆరు నెలల పాటు పాల్వంచ నవ లిమిటెడ్ సంస్థలో వెల్డర్ శిక్షణ తీసుకున్నాను. మణుగూరు సింగరేణిలో వెల్డర్‌గా ప్రభుత్వం ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం నెలకు రూ.80 వేల వేతనం అందుకుంటున్నాను.'' - రాజేశ్, సింగరేణి ఉద్యోగి
ఐటీఐతో ఎన్నో కొలువుల అవకాశాలు : ఐటీఐలో ఏడాది వ్యవధితో కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కార్పెంటర్, మాసన్ (బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్), డ్రెస్ మేకింగ్, ఫౌండ్రీమెన్, సెక్రటేరియల్ ప్రాక్టీస్ (ఇంగ్లిష్), ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, వెల్డర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్కర్, సూయింగ్ టెక్నాలజీ, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్), మెకానిక్ (డీజిల్/ఆటో బాడీ పెయింటింగ్/ ఆటో బాడీ రిపేర్) ఇలా పలు ట్రేడులు వివిధ ఐటీఐల్లో అందుబాటులోనే ఉన్నాయి.
ఐటీఐతో వచ్చే ఉద్యోగ అవకాశాలు :
- నేవల్ డాక్‌యార్డులు, స్టీల్ ప్లాంట్లు, నౌకాయాన సంస్థలు, షిప్పులు, పోర్టులు, ఆర్టీసీ, రైల్వేశాఖలో అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగాలు సాధించవచ్చు.
- భద్రతా బలగాల్లో కూడా అవకాశాలు మొండుగా ఉన్నాయి.
- యంత్రాలతో నడిచే అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఐటీఐ చదివిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి.
- మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో(పీఎస్‌యూలు) పలు కొలువులకు వీరే అర్హులు.
- సాంకేతిక(టెక్నికల్) పోస్టుల్లో సింహభాగం సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్న వారితోనే భర్తీ చేస్తున్నారు.
- తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టాప్కామ్), ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఏపీ లిమిటెడ్(ఓమ్‌క్యాప్), స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు విదేశీ కొలువులకు దారి చూపుతున్నాయి.
సైబర్ సెక్యూరిటీ రంగంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలుంటాయి?
యాక్చూరియల్ సైన్స్ - కోర్సు పూర్తి చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయంటే?

