ETV Bharat / education-and-career
ఇంజనీరింగ్ పూర్తి చేశారా? - డీఆర్‌డీఓలో ఉద్యోగాలు - ఎంపికైతే రూ.60వేల నుంచి రూ.లక్షన్నర వరకు జీతం!
-భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీఓలో సైంటిస్ట్-సి,డి,ఈ పోస్టులకు నోటిఫికేషన్ - అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం!

Published : May 31, 2026 at 11:26 AM IST
DRDO RAC Notification 2026: ఇంజనీరింగ్ పూర్తి చేసి రక్షణ రంగంలో ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. ప్రతిష్ఠాత్మకమైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్-సి, డి, ఈ కేటగిరీలలో ఖాళీగా ఉన్న గ్రూప్ 'A' గెజిటెడ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మరి ఈ పోస్టులకు ఎవరు అర్హులు? ఎంపిక విధానం ఎలా? జీతం ఎంత? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? సహా తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు: ఖాళీలు
1. సైంటిస్ట్-ఈ: 02
ఈ రెండు పోస్టులను రెండు వేర్వేరు విభాగాల కింద భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (01), మెకానికల్ / ప్రొడక్షన్ / ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్ (01 పోస్టు).
2. సైంటిస్ట్-డి: 11
ఇందులో కూడా వివిధ విభాగాల కింద ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా 7 పోస్టులను రెగ్యులర్, 04 పోస్టులను ఎన్‌కేడర్డ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. రెగ్యులర్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1, ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 1, మెకానికల్ ఇంజనీరింగ్ 1, ఫిజిక్స్ / ఫోటోనిక్స్ / ఆప్టిక్స్ 01, కెమికల్ ఇంజనీరింగ్ 02, ఫిజిక్స్ / రేడియేషన్ ఫిజిక్స్ 01. ఎన్కేడర్డ్లో మెకానికల్ / ప్రొడక్షన్ / ఏరోస్పేస్ 01, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ 1, ఫిజిక్స్ / రేడియేషన్ ఫిజిక్స్ 1, మెకానికల్ ఇంజనీరింగ్ 1.
3. సైంటిస్ట్-సి: 20
ఈ 20 పోస్టులను రెండు విభాగాలుగా డివైడ్ చేశారు. రెగ్యులర్ పోస్టులు 17, ఎన్‌కేడర్డ్ పోస్టులు 03 ఖాళీలు. రెగ్యులర్‌లో ఈసీఈ 6, సీఎస్ఈ 3, సీఈ 1, ఈఈ 1, మ్యాథమెటిక్స్ 1, రిమోట్ సెన్సింగ్ 1, ఓషియానోగ్రఫీ 1, ఫిజియాలజీ 1, ఫార్మకాలజీ 1 పోస్టులు ఉన్నాయి. ఎన్కేడర్డ్లో ఫిజిక్స్ / మెడికల్ / రేడియోలాజికల్ ఫిజిక్స్ 2, ఈసీఈ / మెకానికల్ ఇంజనీరింగ్(బాలిస్టిక్) 1 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్), మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- సైంటిస్ - ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో కనీసం ఫస్ట్ డివిజన్ బ్యాచిలర్ డిగ్రీ (B.E/B.Tech) ఉండాలి. డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో రీసెర్చ్, డిజైన్ లేదా డెవలప్‌మెంట్‌లో కనీసం 11 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. మెకానికల్ పోస్టులకు అయితే ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు మెకానికల్/ఏరో సిస్టమ్స్ డిజైన్, డెవలప్‌మెంట్ లేదా ఫ్యాబ్రికేషన్ రంగంలో 11 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
- సైంటిస్ట్ - సి పోస్టులకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో కనీసం ఫస్ట్ డివిజన్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సంబంధిత ఇంజనీరింగ్ లేదా సైన్స్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల రీసెర్చ్ / డిజైన్ / డెవలప్‌మెంట్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
- సైంటిస్ట్ డి పోస్టులకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం ఫస్ట్ క్లాస్‌తో B.E / B.Tech లేదా సైన్స్ విభాగంలో M.Sc ఉత్తీర్ణత. పోస్టును అనుసరించి సంబంధిత రంగంలో కనీసం 7 సంవత్సరాల రీసెర్చ్ / డిజైన్ / డెవలప్‌మెంట్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టులకు అప్లై చేసే చివరి తేదీ(జూన్ 19, 2026) నాటికి సైంటిస్ట్-సికు 35 ఏళ్లు, సైంటిస్ట్-డి,/ఈ కేటగిరీలతు 45 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం వివరాలు: ఆయా పోస్టులకు అనుసరించి వేతనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే..
- 7th సీపీసీ లెవల్ 11 ప్రకారం సైంటిస్ట్-సి పోస్టులకు నెలకు కు రూ.67,700 ఇవ్వనున్నారు.
- 7th సీపీసీ లెవల్ 13 ప్రకారం సైంటిస్ట్-ఈ కు నెలకు రూ.1,23,100గా ఉంది.
- 7th సీపీసీ లెవల్ 12 ప్రకారం నెలకు సైంటిస్ట్-డి పోస్టులకు రూ.78,800గా జీతం ఉంది. ఈ బేసిక్ పేతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అదనంగా లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడు ప్రధాన దశల్లో జరుగుతుంది. ముందుగా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయసు, విద్యార్హతలు, అనుభవాన్ని పరిశీలించి షార్ట్‌లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ ఆధారంగా ఎన్నికైన వారికి 100 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో కనీసం 75 మార్కులు వచ్చిన వారు ఎన్నికయ్యే ఛాన్స్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం DRDO కి చెందిన రిక్యూట్‌మెంట్ & అసెస్‌మెంట్ సెంటర్ అధికారిక వెబ్సైట్ https://rac.gov.in. పై క్లిక్ చేసి పూర్తి చేయవచ్చు.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వారు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ముఖ్యతేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైన తేదీ: 30 మే 2026
- దరఖాస్తు చివరి తేదీ: జూన్ 19, 2026(సాయంత్రం 4 గంటల వరకు)
బీఎస్ఎన్ఎల్ JTO రిక్రూట్‌మెంట్ - తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు - మొదటి నెల నుంచే మంచి జీతం!
ఎస్‌ఎస్‌బీలో 404 కానిస్టేబుల్ జాబ్స్ - ఎలాంటి రాత పరీక్ష లేదు! - అప్లైకు చివరి తేదీ ఇదే

