ETV Bharat / education-and-career
బీఏ తర్వాత ప్లాన్ ఏంటి? - అయితే ఇది మీ కోసమే
బీఏ విద్యార్థుల్లో ఉద్యోగాల కోసం తలెత్తుతున్న పలు ప్రశ్నలు - పీజీ కోసం, ఉద్యోగాల కోసం ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలి - మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సబ్జెక్టులో పీజీ కోర్సు చేయడంతోనే త్వరగా ఉద్యోగాలు

Published : February 27, 2026 at 6:43 AM IST
BA Degree Students Doubts : ప్రస్తుతం బీఏ చదువుతున్న విద్యార్థులకు ఉన్నత విద్యలో భాగంగా ఏ కోర్సులో చేరితే త్వరగా ఉపాధి పొందవచ్చని సందేహాలు తలెత్తడం సర్వసాధారణ విషయం. హెచ్‌ఈపీ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్) గ్రూపుతో బీఏ చదువుతున్న విద్యార్థిగా, ఉన్నత విద్యలో సరైన సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.
సంప్రదాయ కోర్సులకు మోడ్రన్ స్కిల్స్ కలిస్తేనే ఉద్యోగ అవకాశాలు మరింతగా విస్తరిస్తాయి. వాస్తవానికి బీటెక్, బీబీఏ, బీసీఏ లాంటి ప్రొఫెషనల్ డిగ్రీలతో పోలిస్తే, బీఏ క్వాలిఫికేషన్‌తో త్వరగా ఉద్యోగం పొందడం కొంత కష్టంగానే ఉంటుంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సబ్జెక్టులో పీజీ కోర్సు చేయడం ద్వారా మీ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు.
- ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఎక్కువగా, ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్న పీజీగా ఎంబీఏని చెప్పవచ్చు. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్ వంటి ప్రత్యేకమైన కోర్సులు ఇప్పుడు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి. ప్రస్తుతం కంపెనీలు డేటా ఆధారిత కీలక నిర్ణయాలను తీసుకోవడంవల్ల బిజినెస్ అనలిటిక్స్ కోర్సు చేసిన వారికి కూడా డిమాండ్ ఉంది. మంచి విద్యాసంస్థ నుంచి ఎంబీఏ పూర్తి చేస్తే, క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా త్వరగా జాబ్ కొట్టే అవకాశాలు ఉన్నాయి.
- మీకు బోధనపై ఆసక్తి ఉంటే, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఈడీ చేయొచ్చు. ఆంగ్లంపై ఆసక్తి ఉంటే పీజీలో ఎంఏ ఇంగ్లిష్ చేసే ఆలోచన గురించి కూడా ఆలోచన చేయొచ్చు. విద్యార్థులకు ఎక్కువగా సామాజిక స్పృహ ఉంటే జర్నలిజంలో పీజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సుల ద్వారా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. సోషల్ వర్క్ ద్వారా ఎన్‌జీఓలు, ప్రభుత్వ పథకాలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) రంగాల్లో పనిచేసే అవకాశాలు వస్తాయి.
- న్యాయ రంగంపై ఆసక్తి ఉంటే ఎల్‌ఎల్‌బీ కోర్సు అత్యుత్తమ మార్గం. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాది, లీగల్ కన్సల్టెంట్, కార్పొరేట్ లాయర్ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి ఛాన్స్ ఉంది. మూడేళ్లు పట్టినా, దీర్ఘకాలంలో స్థిరమైన, సమాజంలో గౌరవప్రదమైన కెరియర్‌ను అందిస్తుంది.
- ప్రస్తుతం తక్కువ కాలంలో చదువు పూర్తిచేసి త్వరగా ఉద్యోగం పొందాలనుకునే వారికి డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ వంటి స్వల్పకాలిక కోర్సులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ కోర్సులు కేవలం మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ముగుస్తాయి. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ క్రియేషన్ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి.
- ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే పీజీ చేస్తూనే యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, వంటి ఉన్నతమైన పరీక్షలకు సన్నద్ధం అవ్వొచ్చు. ఆసక్తి ఉంటే, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవ్వొచ్చు.
- మీ ప్రాధాన్యాలు, సామర్థ్యాలు, లక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని సరైన మార్గాన్ని ఎంచుకుంటే, మీరు త్వరగా స్ట్రాంగ్ కెరియర్‌ను నిర్మించుకోవచ్చు.
"ఆర్థిక శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఎంఏ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఒక మంచి ఎంపిక. దీని ద్వారా మీరు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిసెర్చ్ సంస్థలతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మంచి అవకాశాలను కూడా పొందవచ్చు. దీంతోపాటు డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ స్కిల్స్ (ఎంఎస్ ఎక్సెల్, పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్) నేర్చుకుంటే, ప్రైవేట్ రంగంలో కూడా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎంఏ ఎకనామిక్స్ విశ్లేషణాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడంలో ఎంతగానో సాయపడుతుంది" -ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
డేటాసైన్స్ రంగంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? - రాణించాలంటే ఏయే నైపుణ్యాలు అవసరం
కేవలం డిగ్రీతో రిజర్వు బ్యాంకులో ఉద్యోగాలు - మొదటి నెల నుంచే రూ.58 వేల జీతం

