ETV Bharat / education-and-career
భద్రమైన ఉద్యోగం కోసం చూస్తున్నారా? - 'సైబర్ సెక్యూరిటీ'తో బెస్ట్ కెరీర్ మీ సొంతం!
డిజిటల్ దాడులను నివారించే సైబర్ సెక్యూరిటీ కోర్సుతో బెస్ట్ కెరీర్! - రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యత - రంగంలో వివిధ విభాగాలపై అవగాహన - విద్యార్థులు పాటించాల్సిన నియమాలపై నిపుణుల సలహాలు

Published : May 3, 2026 at 12:22 PM IST
CYBER security COURSES : మనిషి జీవించడానికి కూడు, గూడు, గడ్డలతో పాటు ఇంటర్నెట్ కూడా కనీస అవసరంగా మారుతున్న రోజులివి. రోజూవారీ జీవితంలో ఇంటర్నెట్దీ ప్రత్యేక స్థానం. అన్ని రాతపూర్వక దస్త్రాలే కాకుండా ఆర్థిక వ్యవహారాలూ డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో హ్యాకింగ్, సైబర్ దాడులూ పెరుగుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి సైబర్ సెక్యూరిటీ రంగం ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. సైబర్ నిపుణులకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటోంది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రస్తుతం పునరావృత్త, సాధారణ పనులు జరుగుతుండటంతో సంస్థలు కొన్ని ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి. కానీ, ఏఐ పట్ల పూర్తి నైపుణ్యం, అనుభవం ఉన్న వారికి మాత్రం మరిన్ని అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉన్నత కెరీర్ అందించడంలో సైబర్ భద్రత ముందు వరుసలో నిలుస్తుందని విద్యార్థులు గ్రహించాలి. సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేసినవారికి ఉన్నత హోదాలతో బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. అందులో కొన్ని ముఖ్యమైన విభాగాల గురించి తెలుసుకుందాం.
ఎస్‌ఓసీ అనలిస్ట్ : ఈ బృందం నిరంతరం పనిచేసే డిజిటల్ కంట్రోల్ రూమ్‌లో అలర్ట్‌లను పర్యవేక్షిస్తూ, దాడుల ముప్పును ముందుగా గుర్తిస్తుంది. ఈ రంగంలోకి కొత్తగా వచ్చేవారికి, ప్రారంభ స్థాయి ఉద్యోగాలకు ఇదో మంచి ఎంపిక. వీరు ప్రధానంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(ఎస్‌ఓసీ) అనలిస్టుగా సేవలు అందించవచ్చు.
సెక్యూరిటీ ఇంజినీర్ : వీరు ఫైర్‌వాల్‌లు, అలర్ట్ సిస్టమ్‌లు, రక్షణ సాఫ్ట్‌వేర్లను అమర్చి పూర్తి భద్రతా వ్యవస్థను రూపకల్పన చేస్తారు. అంటే, ఇల్లు కట్టేటప్పుడు గోడలు, గేట్లు, సీసీ కెమెరాలు అమర్చినట్లే, సంస్థలకు డిజిటల్ రక్షణ కట్టడాన్ని ఈ సెక్యూరిటీ ఇంజినీర్లు నిర్మిస్తారన్నమాట.
క్లౌడ్ సెక్యూరిటీ నిపుణులు : అపరిమిత డేటాను నిల్వ చేసుకోవాలంటే క్లౌడ్ సర్వీసుల వినియోగం తప్పనిసరి. ప్రస్తుతం చాలా కంపెనీలు వాటి డేటాను క్లౌడ్‌లోనే నిల్వ చేస్తున్నాయి. అయితే, అది ఆన్‌లైన్‌లో భద్రంగా ఉందా? లేదో చూడటం క్లౌడ్ సెక్యూరిటీ నిపుణుల ప్రధాన కర్తవ్యం.
ఇన్సిడెంట్ రెస్పాన్స్ స్పెషలిస్ట్ : ఇది దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగే ఎమర్జెన్సీ టీమ్. ఈ బృందం సదరు దాడికి సంబంధించి ఎంత నష్టం జరిగింది? దాడిని ఎలా ఆపాలి? మళ్లీ పునరావృతం కాకుండా ఎలా నివారించాలి? అనే అంశాలపై దృష్టి సారిస్తుంది.
థ్రెట్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్ : వీరు దాడి చేసేందుకు మోసగాళ్లు ఏ రకమైన పద్ధతులు ఉపయోగిస్తున్నారు? ఏ దేశాల నుంచి దాడులు చేస్తున్నారు? ఏ రంగాలు లక్ష్యంగా చేసుకున్నారో అనే దానపై సమాచారాన్ని విశ్లేషించి, ముందస్తు హెచ్చరికలు ఇస్తుంటారు.
సెక్యూరిటీ అనలిస్ట్ : ఒక సంస్థకు సంబంధించిన కంప్యూటర్ వ్యవస్థలపై ఏవైనా దాడులు, అనుమానాస్పద లాగిన్‌లు, వైరస్‌ల వంటి అంశాలపై నిరంతరం నిఘా ఉంచడం వీరి బాధ్యత. క్లుప్తంగా చెప్పాలంటే, ఇంటికి సెక్యూరిటీ ఎలాగో, సంస్థకు కూడా ఒక డిజిటల్ కాపలాదారుగా పనిచేస్తారు.
డిజిటల్ ఫోరెన్సిక్స్ నిపుణులు : సైబర్ దాడి జరిగిన తర్వాత, దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి, దోషులను గుర్తించడం, కోర్టులో నిరూపించడంలో సహకరించే అనలిస్టులు. వీరి సేవలు ఎక్కువగా పోలీసు, దర్యాప్తు సంస్థలు, బ్యాంకుల్లో అవసరమవుతాయి.
ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్ : ఏఐ సాధనాలను తప్పుదారి పట్టించే డేటా, ప్రాంప్ట్ ఇంజెక్షన్ లాంటి దాడుల నుంచి ఏఐ వ్యవస్థలను కాపాడటం వీరి బాధ్యత. ఏఐతో పనిచేసే పరికరాలకు రక్షణ అవసరమైన కొత్త దశ ఇది.
జీఆర్‌సీ అనలిస్ట్ : సంస్థలు సాంకేతికంగా రక్షణ పొందేందుకు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా, తగిన నియమ నిబంధనలు అనుసరించకపోతే భారీ జరిమానాతో పాటు సంస్థ ప్రతిష్ఠకూ నష్టం తప్పదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు, డేటా రక్షణ చట్టాలు, అంతర్జాతీయ ప్రమాణాలను సంస్థ అమలు చేస్తోందా లేదా అని పర్యవేక్షించడం, ఆడిట్లు నిర్వహించడం, రిస్క్ అంచనా వేయడం, పాలసీలు రూపొందించడం గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లయన్స్(జీఆర్‌సీ) వీరి ప్రధాన బాధ్యత. సాంకేతిక నైపుణ్యంతోపాటు బిజినెస్ అవేర్నెస్, చట్టాల పరిజ్ఞానం ఉన్నవారికి ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. సీఐఎస్‌ఏ, సీఆర్‌ఐఎస్‌సీ, ఐఎస్‌వో 27001 లీడ్ ఆడిటర్ లాంటి సర్టిఫికేషన్లు ఉన్నవారికి రాబోయే రోజుల్లో అవకాశాలు పెరగొచ్చు.
డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ : డీపీడీపీ యాక్ట్ 2023 నేపథ్యంలో, సిగ్నిఫికెంట్ డేటా ఫిడుసియరీ (ఎస్డీఎఫ్)గా గుర్తింపు పొందిన సంస్థల్లో డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీపీవో) నియామకం అవసరం. ఇతర సంస్థల్లోనూ ప్రైవసీ లేదా కంప్లయన్స్ అవసరాల ఆధారంగా ఈ తరహా ఉద్యోగాలు మరింత పెరగొచ్చు.
కొన్ని సర్టిఫికేషన్లు : అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌వో), అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (ఐఈసీ) 27001. ఇది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎస్‌ఎంఎస్) సమాచార భద్రతకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం. డేటాను రక్షించడం, రిస్క్ అంచనా వేయడం, పాటించాల్సిన విధానాలు, నియంత్రణలను నిర్దేశిస్తుంది. ఐఎస్‌వో/ఐఈసీ 27001 అమలుగానీ, సర్టిఫికేషన్ సంస్థ భద్రతా నియంత్రణలను ప్రదర్శించడానికిగానీ సహాయపడుతుంది. దీనిద్వారా క్లయింట్ నమ్మకం పెరగడానికి అవకాశం ఉంటుంది.
ఐఎస్‌వో/ఐఈసీ 42001 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఎయిమ్స్). ఇది ఏఐ వ్యవస్థలను బాధ్యతాయుతంగా, నైతికంగా, పారదర్శకంగా అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి డిసెంబరు 2023లో ప్రచురించిన ఏఐ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రమాణం. కృత్రిమ మేధ వ్యవస్థలను వినియోగించే సంస్థలకు ఐఎస్‌వో/ఐఈసీ 42001 ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ ప్రమాణంపై నైపుణ్యం సాధించిన ఆడిటర్లు, లీడ్ ఇంప్లిమెంటర్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు రానున్నాయి.
విద్యార్థులు ఏం చేయాలంటే
- కంప్యూటర్ బేసిక్స్, నెట్‌వర్కింగ్ నేర్చుకోవాలి.
- పైతాన్ వంటి ప్రోగ్రామింగ్ భాషలపై పట్టు సాధించాలి.
- లినెక్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి.
- ల్యాబులు, చిన్న ప్రాజెక్టులు, సీటీఎఫ్ వంటి పోటీల్లో పాల్గొనాలి.
- మొదట సెక్యూరిటీ ప్లస్/సీఈహెచ్ లాంటి సర్టిఫికేషన్లు, సీఐఎస్‌ఎస్‌పీ అర్హతకు కావాల్సిన అనుభవం వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టండి.
- హ్యాకర్ వన్, బగ్ క్రౌడ్ లాంటి అధికారిక బగ్ బౌంటీ ప్రోగ్రాముల్లో అనుమతితో పాల్గొంటూ ఎక్స్ట్రా ఇన్‌కమ్‌తో పాటు, అనుభవం సంపాదించవచ్చు.
- లింక్డ్ఇన్ ద్వారా పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్ పెంచుకోవాలి. ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులకు సహకారం అందించాలి.
- ఇప్పుడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకుంటున్నవారైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ఎంచుకోవచ్చు.
సైబర్ సెక్యూరిటీ రంగం అనేది ఉద్యోగం మాత్రమే కాదు. భవిష్యత్తుకు భద్రత కల్పించే స్థిరమైన కెరియర్ మార్గం. సాంకేతిక నైపుణ్యంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలపై అవగాహన, బాధ్యతాయుతమైన దృక్పథం ఉన్నవారు ఇందులో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
పీజీ చేయాలనుకుంటున్నారా - అయితే ఏ కోర్సు బాగుంటుదో తెలుసుకోండి?
పది తర్వాత పదింతల ఉద్యోగావకాశాలు - వేసవిలో ఎన్నో కోర్సులకు ప్రవేశ పరీక్షలు

