ETV Bharat / education-and-career

బీటెక్‌ సీఎస్‌ఈలో ఈ కోర్సులు చేస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు!

ఎప్‌సెట్‌లో మంచి ర్యాంకు వచ్చిందా? - ఏఐఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీల్లో ఏ స్పెషలైజేషన్‌ తీసుకుంటే భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు

How to Choose Btech Specialization Courses
How to Choose Btech Specialization Courses (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2026 at 6:13 PM IST

3 Min Read
Choose ETV Bharat

How to Choose BTech Specialization Courses : ఇంజినీరింగ్​ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించిన చాలా మంది విద్యార్థులు బీటెక్​లో ఏ కోర్సు ఎంచుకోవాలో తెలియదు. దేన్ని ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉంటాయనే అవగాహన చాలామందికి ఉండదు. ఒకవేళ కంప్యూటర్​ సైన్స్​ అండ్​ ఇంజినీరింగ్​లో చేరాలనుకుంటే అందులో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ అండ్​ మెషిన్​ లెర్నింగ్, సైబర్​ సెక్యూరిటీ, డేటా సైన్స్​ లాంటి ప్రత్యేక విభాగాల్లో దేన్ని ఎంచుకోవాలనే సందేహం వస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్తులో మంచి జీతాలు, స్థిరమైన ఉద్యోగాలు, అంతర్జాతీయ అవకాశాలు ఉన్న విభాగాన్ని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉంటున్నారు. మీరు ఎంచుకునే విభాగం సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, సాంకేతిక ఆలోచనా విధానం, దీర్ఘకాలిక కెరియర్​ లక్ష్యాల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవాలి.

ఏఐఎంఎల్​ కోర్సు : ఈ కోర్సు ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోన్న సాంకేతికతల్లో ముఖ్యమైనది. మనుషుల మాదిరిగా కంప్యూటర్లు నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, డేటాను విశ్లేషించడం, ఆ భాషను అర్థం చేసుకోవడం లాంటి అంశాలపై ఈ ఏఐఎంఎల్​ విభాగం పనిచేస్తుంది. వాయిస్​ అసిస్టెంట్లు, చాట్​బాట్లు, అటానమస్​ వాహనాలు, వైద్య నిర్ధారణ వ్యవస్థలు, డేటా విశ్లేషణ, జనరేటివ్​ ఏఐ లాంటి రంగాల్లో సాంకేతికత వినియోగంలో ఉంది. ఆరోగ్యం, బ్యాంకింగ్, ఈ-కామర్స్​, వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, రోబోటిక్స్​, డిజిటల్​ మార్కెటింగ్​ లాంటి అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాల వినియోగం వేగంగా పెరుగుతోంది. దీని వల్ల డేటా సైంటిస్ట్​, మెషిన్​ లెర్నింగ్​ ఇంజినీర్​, జనరేటివ్​ ఏఐ డెవలప్​మెంట్​ ఎక్స్​పర్ట్​, డేటా అనలిస్ట్​, ఏఐ రిసెర్చర్​ లాంటి ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

వీటిపై అవగాహన పెంచుకోవాలి : ఏఐఎంఎల్​ విభాగంలో విజయవంతం కావాలంటే మ్యాథ్య్​, స్టాటిస్టిక్స్​, ప్రోగ్రామింగ్​, లాజిక్​, డేటా అనాలసిస్​ లాంటి అంశాలపై ఆసక్తి, పట్టు అవసరం. అలాగే పైతాన్​, ఆర్​ ప్రోగ్రామింగ్​, డేటా సైన్స్​ టూల్స్​, డీప్​ లెర్నింగ్​ ఫ్రేమ్​వర్క్స్​, క్లౌడ్​ ప్లాట్​ఫామ్​లపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇప్పుడు డిగ్రీ కంటే ప్రాక్టికల్​ ప్రాజెక్టులు, గిట్​హబ్​ ప్రొఫైల్​, కాగిల్​ పోటీలు, ఇంటర్న్​షిప్​ అనుభవం లాంటి అంశాలను ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. ఇలా కళాశాలల్లో చదివి, విలువైన ప్రాజెక్టులు చేసినవారికి మొదటి దశలోనే అధిక వేతన ప్యాకేజీలు లభించే అవకాశాలు ఉన్నాయి.

సైబర్​ సెక్యూరిటీలో అనేక అవకాశాలు : ప్రస్తుతం ప్రభుత్వ సేవలు, ఈ-కామర్స్​, బ్యాంకింగ్​, మొబైల్​ యాప్​లు, క్లౌడ్​ కంప్యూటింగ్​, సోషల్​ మీడియా వినియోగం పెరుగుతున్న క్రమంలో సైబర్​ దాడులు ఎక్కువవుతున్నాయి. డేటా చోరీ, హ్యాకింగ్​, ఫిషింగ్​, డిజిటల్​ మోసాలు లాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు భవిష్యత్తులో సైబర్​ భద్రతా నిపుణుల అవసరం పెరుగుతుంది. ఈ సైబర్​ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది.

సైబర్​ సెక్యూరిటీ కోర్సులో నెట్​వర్క్​ భద్రత, డిజిటల్​ ఫోరెన్సిక్స్​, ఎథికల్​ హ్యాకింగ్​, క్లౌడ్​ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్​ సెక్యూరిటీ, పెనెట్రేషన్​ టెస్టింగ్​ లాంటి అంశాలను బోధిస్తారు. సెక్యూరిటీ అనలిస్ట్​, సైబర్​ సెక్యూరిటీ కన్సల్టెంట్​, సెక్యూరిటీ ఆడిటర్​, డిజిటల్​ ఫోరెన్సిక్​ ఎక్సపర్ట్స్​ లాంటి ఉద్యోగ అవకాశాలు ఈ రంగంలో లభిస్తున్నాయి. ఎవరైతే సమస్యలను విశ్లేషించడం, భద్రతా లోపాలను గుర్తించడం, సిస్టమ్​లను రక్షించడం లాంటి అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ విభాగం అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు తాజాగా సెక్యూరిటీ ప్లస్​, సిస్కో లాంటి సర్టిఫికేషన్లు/ప్రొఫెషనల్​ అర్హతలు ఉద్యోగ అవకాశాలను మరింతగా పెంచుతున్నాయి.

రెండింటి మధ్యా అనుసంధానం : ఏఐ ఆధారిత సైబర్​ దాడులను గుర్తించడం, స్మార్ట్​ భద్రతా వ్యవస్థల అభివృద్ధి, ఏఐ మోడళ్ల భద్రతను నిర్ధారించడం లాంటి కొత్త ఉప విభాగాలు అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తులో ఏఐ, సైబర్​ సెక్యూరిటీల కలయికతో కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఈ కారణంగా విద్యార్థులు ఒక విభాగాన్ని ఎంచుకున్నా.. మరో రంగానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కూడా పెంపొందించుకోవడం మంచిది.

''ఇంజనీరింగ్​లో బ్రాంచ్​ ఎంచుకోవడానికి ముందు మీ ఆసక్తులేమిటో నిజాయతీగా విశ్లేషించుకోవాలి. అనాలిసిస్, ఇంటెలిజెంట్​ మెషిన్స్​ డెవలప్​మెంట్​, మ్యాథ్య్​ లాంటి పరిశోధన లాంటి అంశాల్లో బాగా ఇష్టం ఉంటే ఏఐఎంఎల్​ మంచి ఎంపిక కావచ్చు. నెట్​వర్క్​, భద్రత, డిజిటల్​ రక్షణ, హ్యాకింగ్​ నివారణ లాంటి అంశాలపై ఆసక్తి ఉంటే సైబర్​ సెక్యూరిటీ సరైన మార్గం కావచ్చు. రెండు రంగాలకూ భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఆసక్తితో నేర్చుకున్న విద్యార్థులే విజయాలు ఎక్కువ సాధిస్తారు. సరైన కళాశాల ఎంపిక, ప్రాక్టికల్​ నైపుణ్యాలు, ఇంటర్న్​షిప్పులు, ప్రాజెక్టులు, నిరంతర సాధన ద్వారా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన కెరియర్​ నిర్మించుకోవచ్చు'' - ప్రొ, బెల్లంకొండ రాజశేఖర్​, కెరియర్​ కౌన్సెలర్​

భద్రమైన ఉద్యోగం కోసం చూస్తున్నారా? - ఎగుమతి దిగుమతుల్లో ఎన్నో కెరియర్లు!

నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ - SSC నుంచి భారీ నోటిఫికేషన్​ - జీతం ఎక్కువే!