ETV Bharat / education-and-career
‘అగ్నివీర్’ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం - ఆ రోజే చివరి తేదీ
సైన్యంలో నియామకాల కోసం ఆన్‌లైన్ నమోదు - ఏప్రిల్ 2వ తేదీ దరఖాస్తులు స్వీకరణ- గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 10:04 PM IST
Agniveer Army Recruitment Applications Are Open: సైన్యంలో ఉద్యోగావకాశాల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్‌న్యూస్. సైన్యంలో నియామకాల కోసం ఆన్‌లైన్ నమోదు, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు రిక్రూట్‌మెంట్ అధికారి, గుంటూరు డైరెక్టర్ కర్నల్ రజత్ సువర్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న అగ్నివీర్‌లో వివిధ విభాగాల్లో నియామకాలకు నోటిఫికేషన్‌ను www.-joinindianarmy.-nic.-in వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారు సైన్యంలో తాత్కాలికంగా 4 ఏళ్లపాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది.
అవివాహిత యువత నుంచి దరఖాస్తులు: గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం పరిధిలోని కర్నూలు, అనంతపురం, ఎస్పీఎస్ నెల్లూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, నంద్యాల,శ్రీసత్యసాయి, అన్నమయ్య, మార్కాపురం జిల్లాలకు చెందిన అవివాహిత యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
2 విభాగాలకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు: పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు టెక్నికల్, అగ్నివీర్ జనరల్ డ్యూటీ, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు ట్రేడ్స్‌మన్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. 2 విభాగాలకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచినట్లు ఆయన వివరించారు. ఐటీఐ, ఎన్‌సీసీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు ఉంటాయని అధికారులు తెలుపుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీ దరఖాస్తులు స్వీకరించడానికి చివరి రోజని తెలిపారు.
అగ్నివీరులకు వెసులుబాటు: నాలుగేళ్లు దేశ సైనికులుగా సేవలందించిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(CAPF), అసోం రైఫిల్స్‌తో పాటు బీఎస్ఎఫ్ నియమకాల్లో వయోపరిమితిని 3, 5 సంవత్సరాలకు పెంచడం సహా దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పించడం వల్ల ఉద్యోగార్థులకు కొంత మేర లబ్ధి చేకూరనుంది. హోం శాఖ ఉత్తర్వుల ప్రకారం తొలి అగ్నివీర్ బ్యాచ్‌లోని అభ్యర్థులు 28 సంవత్సరాల వయసు వరకు అగ్నివీర్‌గా సేవలందించి ఆపై ఇతర కేంద్ర భద్రతా దళాలతో పాటు అసోం రైఫిల్స్‌లో చేరేందుకు వీలును కల్పిస్తూ గతంలోనే 10 శాతం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది.
వాయుసేనలో డిగ్రీ అర్హతతో ఉద్యోగం - ఇలా దరఖాస్తు చేసుకోండి
జర్మనీ భాషపై పట్టు సాధిస్తే విదేశీ కొలువు మీ సొంతం - నెలకు రూ.లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశాలు

