ETV Bharat / business

మీరు ఇన్సూరెన్స్​ తీసుకున్నారా? - "నామినీ" రోల్​ ఏంటో తెలుసా?

- నామినీని ఎంచుకోకపోతే పాలసీ ఉద్దేశ్యమే వృధా అయిపోతుంది! - భవిష్యత్తులో నామినీని మార్చుకోవచ్చా?

Why Nominee is Important to Life Insurance
Why Nominee is Important to Life Insurance (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : July 8, 2026 at 1:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

Why Nominee is Important to Life Insurance: లైఫ్​ ఇన్సూరెన్స్​.. కుటుంబానికి రక్షణ కల్పించే ఒక మెరుగైన ఆర్థిక వనరు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది జీవిత బీమా అనగానే టర్మ్‌ ఇన్సూరెన్స్​ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే ఇది తక్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ అందిస్తుంది. అయితే, ఎలాంటి జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పటికీ.. నామినీని సరిగా ఎంచుకోకపోతే అదంతా వృథా అయిపోతుంది. దురదృష్టవశాత్తు పాలసీదారుడు మరణిస్తే.. తనపై ఆధారపడిన వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే జీవిత బీమా తీసుకుంటారు. ఆ వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వారినే నామినీగా ఎంచుకోవాల్సి ఉంటుంది. పాలసీదారుడు స్వయంగా వారిని ఎంపిక చేసుకుంటారు.

దాదాపుగా కుటుంబ సభ్యులనే నామినీగా ఎంచుకుంటారు. ఒకవేళ వారు పనులు చేసుకునే స్థితిలో లేనివారైతే.. బాగా తెలిసిన వారిని, నమ్మకస్తులను నామినీగా ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ నామినీ మైనర్​ అయితే (18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే), పాలసీదారుడు తప్పనిసరిగా మరొక వ్యక్తిని 'అపాయింటీ' లేదా సంరక్షకుడిగా నియమించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.

బహుళ నామినీలు: పాలసీదారుడు కేవలం ఒక్కరినే కాకుండా ఎక్కువ మందిని కూడా నామినీలుగా నియమించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో బీమా ప్రయోజనాలు ఆ నామినీలకు తగిన నిష్పత్తిలో పంపిణీ చేస్తారని వివరిస్తున్నారు. అయితే, ఇలా బహుళ నామినీలను నియమించడం వల్ల కొన్నిసార్లు వారి మధ్య చట్టపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నామినీని నియమించడంతోపాటు, పాలసీదారుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది 'కంటింజెంట్ నామినీ'ల (ప్రత్యామ్నాయ నామినీలు) పేర్లను కూడా పరిశీలించొచ్చని చెబుతున్నారు.

కంటింజెంట్ నామినీ అంటే, ప్రధాన నామినీ క్లెయిం మొత్తాన్ని స్వీకరించలేకపోయినా లేదా స్వీకరించడానికి ఇష్టపడకపోయినా, ఆ మొత్తాన్ని పొందే వ్యక్తి లేదా సంస్థ అని చెబుతున్నారు. ప్రధాన నామినీ మరణించడం/అనారోగ్యానికి గురవ్వడం/ఇతర పరిస్థితుల కారణంగా ఆ మొత్తాన్ని నిర్వహించలేకపోవడం వంటి సందర్భాల్లో ఇది వర్తిస్తుందని వివరిస్తున్నారు. అయితే, బీమా సంస్థ సాధారణంగా ఒక నామినీకి క్లెయిం మొత్తాన్ని చెల్లించడానికే ఇష్టపడుతుందని అంటున్నారు.

నామినీని మార్చుకోవచ్చా? : ఒక్కోసారి పరిస్థితుల కారణంగా నామినీ పేరు మార్చాల్సి రావచ్చు. పాలసీదారుడు జీవించి ఉన్నప్పుడే నామినీ దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ నామినేషన్ ప్రక్రియ చెల్లదు. అప్పుడు పాలసీదారుడు తప్పనిసరిగా నామినీని మార్చాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదేకాకుండా.. భవిష్యత్తులో పాలసీదారుడికి నామినీ నచ్చకపోయే పరిస్థితులు కూడా రావచ్చు. ఇలాంటప్పుడు నామినీని మార్చుకునే స్వేచ్ఛ పాలసీదారుకు ఉంది. ఇలా ఎన్నిసార్లయినా నామినీని మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం బీమా సంస్థ అడిగిన పత్రాలు సమర్పించి, ఫారం నింపితే సరిపోతుందంటున్నారు.

"క్రిటికల్​ ఇల్​నెస్​ పాలసీ" గురించి తెలుసా? - కొనుగోలు చేసేముందు ఈ విషయాలు తెలుసుకోవాలట!

ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? - సరైన సంస్థను ఎంచుకోండిలా!