"క్రెడిట్ కార్డు" వాడుతున్న వ్యక్తి చనిపోతే - దానిపై ఉన్న బిల్లు ఎవరు కట్టాలి?
క్రెడిట్ కార్డు హోల్డర్ మరణిస్తే అప్పు ఫ్యామిలీ మెంబర్స్ కట్టాలా? - ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

Published : February 27, 2026 at 12:12 PM IST
Credit Card Debt After Death : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. గృహోపకరణాలు కొనుగోలు చేయాలన్నా, ఆసుపత్రి బిల్ చెల్లించాలన్నా, ఆఖరికి షాపింగ్ చేయాలన్నా కూడా మెజార్టీ పీపుల్ క్రెడిట్ కార్డునే వినియోగిస్తున్నారు. కొందరైతే ఏదైనా వస్తువు కొని ఆ బిల్లును ఈఎంఐ రూపంలో చెల్లిస్తుంటారు. అలాగే, మరికొందరు బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్స్ ఆధారంగా పర్సనల్ లోన్స్ తీసుకుంటుంటారు. కానీ, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు హోల్డర్ చనిపోతే ఆ కార్డు పైన ఉన్న అప్పు లేదా బిల్లును ఎవరు తిరిగి చెల్లిస్తారు? ఫ్యామిలీ మెంబర్స్ చెల్లించాలా? అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. మరి, ఇంతకీ క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే దానిపై ఉన్న అప్పును ఎవరు కడతారు? ఇందుకు సంబంధించి ఆర్బీఐ నిబంధనలు, చట్టాలు ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నార్మల్‌గా మనం ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఇల్లు, భూమి, బంగారం లేదా మరేదైనా వస్తువును షూరిటీగా పెడుతుంటాం. వీటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. కానీ, క్రెడిట్ కార్డు ద్వారా తీసుకునే రుణాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకులు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను పరిశీలించి క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. అందుకే, క్రెడిట్ కార్డు రుణాలను "అన్సెక్యూర్డ్ లోన్స్" అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం, అటువంటి రుణాలకు పూర్తి బాధ్యత కార్డుదారుడికే ఉంటుంది. దీనిని బట్టే క్రెడిట్ కార్డుకు సంబంధించి బ్యాంకులు ఫాలో అయ్యే నిబంధనలు ఉన్నాయి.
ఫ్యామిలీ మెంబర్స్ చెల్లించాలా?
క్రెడిట్ కార్డు హోల్డర్ చనిపోతే బ్యాంకులు ఆ వ్యక్తి చేసిన అప్పు లేదా బిల్లును ఫ్యామిలీ మెంబర్స్ లేదా వారసులను తిరిగి చెల్లించమని బలవంతం చేసే అధికారం లేదని చెబుతున్నాయి ఆర్బీఐ నిబంధనలు. అలాగే, వారి వ్యక్తిగత ఆస్తుల నుంచి ఆ అప్పును తీర్చనక్కర్లేదు. చట్టపరంగానూ బాధిత కుటుంబ వారసులను వారి సొంత డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసే అధికారం బ్యాంకు వారికి లేదు. ఎందుకంటే ఆ అప్పుకు కార్డు హోల్డరే బాధ్యుడు. ఒకవేళ ఎవరైనా రికవరీ ఏజెంట్ మిమ్మల్ని బెదిరించి మీ వ్యక్తిగత ఆస్తుల నుంచి ఆ అప్పు చెల్లించమని బలవంతం చేస్తే మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు. అంతేకాదు, మీరు కోరుకుంటే RBI లోక్‌పాల్ (అంబుడ్స్‌మన్)కి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఆస్తుల నుంచి అప్పు వసూలు చేస్తారా?
క్రెడిట్ కార్డు హోల్డర్ చనిపోయినంత మాత్రాన తీసుకున్న అప్పు లేదా బిల్లు మాఫీ అయిపోదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బ్యాంకులు చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తుల ద్వారా బకాయిలను వసూలు చేసే హక్కు కలిగి ఉంటాయి. అంటే, ఆ వ్యక్తి పేరు మీద ఉండే బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం, వెండి, ఎఫ్డీలు, షేర్లు లేదా ఇతర స్థిరాస్తుల నుంచి బ్యాంకు అప్పును రికవరీ చేసే హక్కు ఉంటుంది. అలాగే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కార్డు హోల్డర్ అప్పు ఆస్తుల కంటే ఎక్కువగా ఉంటే ఆస్తి విలువ మేరకే బ్యాంకు వసూలు చేసే అధికారం కలిగి ఉంటుంది.
ఉదాహరణకు క్రెడిట్ కార్డు హోల్డర్ అప్పు రూ. 5 లక్షలుగా ఉంది. కానీ, బాధితుడి ఆస్తి విలువ రూ.3 లక్షలు మాత్రమే అయితే మిగతా రూ.2 లక్షలు బ్యాంకులు మాఫీ చేయాల్సిందేనిని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి.
రాంగ్ నంబర్‌కు "డబ్బులు" సెండ్ చేశారా? - నో టెన్షన్ ఇలా తిరిగి పొందండి!
ఆస్తులు లేనట్లయితే?
ఒకవేళ చనిపోయిన క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి వద్ద ఆస్తులేమి లేనట్లయితే బ్యాంకు ఆ కార్డుపై ఉన్న అప్పును వసూలు చేయలేదు. అలాంటి సందర్భాల్లో ఆ అప్పును బ్యాంకు NPA(Non Performing Asset) అని రైట్ ఆఫ్ చేస్తుంది. అంటే, అలాంటి పరిస్థితిలో ఆ కార్డుపై ఉన్న రుణం మొత్తం మాఫీ అవుతుందన్నమాట.
ఇలా ఉంటే అప్పు కట్టాల్సిందే!
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఒకవేళ క్రెడిట్ కార్డును ఇద్దరు వ్యక్తులు కలిసి తీసుకుంటే అలాంటి టైమ్‌లో ఒక వ్యక్తి చనిపోయినా కూడా మరొకరు పర్సనల్‌గా ఆ క్రెడిట్ కార్డు అప్పు గురించి రెస్పాన్సిబుల్ అవుతారు. అంటే, ఆ అప్పును పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఎవరైనా హామీదారుగా సంతకం చేసినట్లయితే కూడా బ్యాంకు వారి నుంచి చనిపోయిన వ్యక్తి చెల్లించాల్సిన అప్పు తిరిగి పొందే ఛాన్స్ ఉంటుంది.
ఇది గుర్తుంచుకోవాలి!
క్రెడిట్ కార్డు తీసుకున్న పర్సన్ చనిపోయాడు దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ నాకు తెలుసు నేను వాడుతా అన్నట్లయితే మీరు ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా ఫ్రాడ్ అని దాన్ని లెక్కిస్తారు. కాబట్టి, క్రెడిట్ కార్డు పర్సన్ చనిపోయిన వెంటనే బ్యాంకుకు వెళ్లి వాళ్ల డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలా చేసినట్లయితే క్రెడిట్ కార్డుకు ఉన్న అప్పు మీద ఎక్స్ట్రా వడ్డీ అన్నది లెక్కించరు. లేకపోతే అప్పు మీద వడ్డీ అన్నది పెరుగుతూనే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
మీ "ఆధార్ కార్డు" పోయిందా? - వెంటనే ఇలా చేయండి! - పొరపాటు జరిగిందంటే ఇబ్బందులు తప్పవు!
ఫోన్ పే యూజర్లకు గుడ్‌న్యూస్ - మనీ ట్రాన్సాక్షన్లో కొత్త ఫీచర్ - ఇలా సెట్ చేసుకోండి!

