ETV Bharat / business

ఆరోగ్య బీమాలో 'OPD కవరేజ్' తీసుకున్నారా? - లేదంటే ఈ ప్రయోజనాలు మిస్ అవుతారట!

OPD కవరేజ్ అంటే ఏమిటి? - దీని కింద కవర్‌ అయ్యే, కవర్ అవ్వని వ్యాధుల జాబితా ఇదే!

OPD Coverage
హెల్త్ ఇన్సూరెన్స్ (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 12:53 PM IST

3 Min Read
Choose ETV Bharat

OPD Coverage in Health Insurance : హాస్పిటల్​లో అడ్మిట్ అయినప్పుడు భారీ వైద్య ఖర్చుల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షిస్తుందనే భావనలో ఉంటారు చాలా మంది. అయితే, రోజువారీ జీవితంలో ఎక్కువగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు హాస్పిటల్​లో చేరాల్సిన అవసరం ఉండకపోవచ్చు. జ్వరం, దగ్గు, చర్మ సమస్యలు, కడుపు నొప్పి, కంటి సమస్యలు లేదా ఇతర అనారోగ్యాల కోసం డాక్టర్​ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకుని ఇంటికే తిరిగి వస్తాం. సాధారణంగా ఇలాంటి చికిత్సలను 'అవుట్​పేషెంట్ డిపార్ట్​మెంట్' లేదా 'OPD చికిత్స' అంటారు.

ఈమధ్య కాలంలో కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు OPD చికిత్సలకూ కవరేజ్ అందిస్తున్నాయి. అయితే, ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో OPD కవరేజ్ ఆటోమేటిక్‌గా ఉంటుందని అనుకోవడం పొరపాటు. పాలసీ రకం, బీమా కంపెనీ, ఎంచుకున్న ప్లాన్ లేదా అదనపు కవరేజీ ఆధారంగా ప్రయోజనాలు మారుతాయని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ, అసలు OPD కవరేజ్ అంటే ఏంటి? దీని కింద ఏం కవర్‌ అవుతాయ్‌? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

OPD కవరేజ్ అంటే ఏమిటంటే?

ఒక వ్యక్తి హాస్పిటల్​లో చేరకుండా డాక్టర్​ను సంప్రదించి చికిత్స పొందితే దాన్ని OPD చికిత్సగా చెబుతారు. ఉదాహరణకు జ్వరంతో వైద్యుడిని కలవడం, రక్త పరీక్ష చేయించుకోవడం లేదా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవడం వంటి కొన్ని ఖర్చులు OPD కవరేజీ ఉన్న పాలసీలలో నిర్ణీత పరిమితుల వరకు కవర్ కావచ్చు. కొన్ని పాలసీ నిబంధనల్లో వైద్యపరంగా అవసరమైన డాక్టర్ కన్సల్టేషన్, సురక్ష డయాగ్నోస్టిక్ పరీక్షలు, ఫార్మసీ ఖర్చులు వంటి వాటికి OPD ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఎంత మొత్తం వరకు చెల్లిస్తారనేది పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న లిమిట్​పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

ఏం కవర్‌ అవుతాయ్‌?

ఓపీడీ కవరేజ్‌ను కేవలం ఒకటి లేదా రెండు వ్యాధులకు మాత్రమే పరిమితం చేయరు. సాధారణంగా డాక్టర్ సలహాతో పొందిన అవుట్‌పేషెంట్ చికిత్సకు పాలసీ నిబంధనల ప్రకారం ప్రయోజనం ఉండవచ్చు. ఉదాహరణకు ఈ కింది ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఖర్చులు కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.

  • జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు
  • జలుబు, సాధారణ శ్వాసకోశ సమస్యలు, దగ్గు
  • అలర్జీలు
  • కంటి లేదా చెవి సంబంధిత ప్రాబ్లమ్స్
  • జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి
  • చర్మ సంబంధిత వ్యాధులు
  • థైరాయిడ్, డయాబెటిస్ వంటి పరిస్థితుల పర్యవేక్షణ
  • ఎముకలు, కీళ్ల నొప్పులకు సంబంధించిన కన్సల్టేషన్లు
  • దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఫాలో-అప్ కన్సల్టేషన్లు

అయితే, ఈ లిస్ట్​లో ఉన్న ప్రతి వ్యాధికీ ప్రతి పాలసీ తప్పనిసరిగా కవరేజ్ ఇస్తుందని అర్థం కాదు. ముందస్తు వ్యాధులు, వెయిటింగ్ పీరియడ్‌లు, నిర్దిష్ట మినహాయింపులు, పాలసీ పరిమితులు వర్తించవచ్చని గుర్తుంచుకోవాలంటున్నారు.

'పర్సనల్ Vs గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్' - ఈ రెండింటిలో ఏది బెటర్?

పరీక్షలు, మందులూ కవర్ అవుతాయా?

కొన్ని OPD ప్లాన్లలో డాక్టర్ కన్సల్టేషన్‌తో పాటు వైద్యుడు సూచించిన రక్త పరీక్షలు, స్కాన్లు, ఇతర డయాగ్నొస్టిక్‌ పరీక్షలు, మందుల ఖర్చులకూ పరిమిత కవరేజ్ ఉండవచ్చని చెబుతున్నారు నిపుణులు. కానీ పరీక్ష తప్పనిసరిగా వైద్యుడి సిఫారసుతోనే చేయించుకోవాలనే రూల్ ఉండొచ్చు. కొన్ని పాలసీల్లో ఫార్మసీ ఖర్చులు కూడా కవర్ కావచ్చు. మరికొన్ని ప్లాన్లలో కేవలం కన్సల్టేషన్ లేదా నెట్‌వర్క్ సేవలకే ప్రయోజనం ఉండొచ్చంటున్నారు. అందుకే, OPDలో ఏ ఖర్చులకు కవరేజ్ ఉందో వివరంగా చదవి తెలుసుకోవాలి.

నార్మల్​గా కవర్ కానివి ఇవే!

OPD కవరేజ్ ఉన్నప్పటికీ కొన్ని మినహాయింపులు ఉంటాయని చెబుతున్నారు. ఉదాహరణకు, సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్‌లు, కొన్ని దంత చికిత్సలు లేదా కేవలం సౌందర్య ప్రయోజనాల (Cosmetic) కోసం చేసే చికిత్సలు కవర్ కాకపోవచ్చంటున్నారు. కొన్ని ప్లాన్లలో దంత, కంటి చికిత్సలకు ప్రత్యేక యాడ్-ఆన్ అవసరం పడుతుందంటున్నారు. కాబట్టి, పాలసీ తీసుకునే ముందు మినహాయింపుల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఏమేం పరిశీలించాలి?

పాలసీ తీసుకునే ముందు కొన్ని అంశాలను తప్పనిసరిగా చూడాలని చెబుతున్నారు. IRDAI సూచనల ప్రకారం, పాలసీ కొనుగోలు చేసే ముందు కవరేజ్, సబ్-లిమిట్లు, వెయిటింగ్ పీరియడ్‌లు, మినహాయింపులు, కో-పేమెంట్ వంటి అంశాలను పరిశీలించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇన్సూరెన్స్ కంపెనీ అందించే కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ షీట్‌ (CIS) కూడా పాలసీ ముఖ్యాంశాలను ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

చివరిగా : తరచు వైద్యుడిని సంప్రదించే వారికి OPD కవరేజ్ ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. హాస్పిటల్​లో చేరకుండానే జరిగే కన్సల్టేషన్లు, పరీక్షలు లేదా కొన్ని సందర్భాల్లో మందుల ఖర్చులకు ఆర్థిక సహాయం లభించే ఛాన్స్ ఉంటుంది. సరైన పాలసీ ఎంపిక చేసుకుంటే రోజువారీ వైద్య ఖర్చుల నిర్వహణలో OPD కవరేజ్ ఒక అదనపు ఆర్థిక రక్షణగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

ఆన్​లైన్​లో "ఆరోగ్య బీమా" తీసుకుంటున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే క్లెయిం టైంలో ఇబ్బందులు!

"టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ" ల్యాప్స్ అయిందా? - సింపుల్​గా ఇలా పునరుద్ధరించుకోవచ్చు!