'EMI' ఆలస్యమైతే ఏమవుతుంది? - ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉండదు!
ఎన్ని EMIలు కట్టకపోతే NPA అవుతుంది? - ఏ ఛార్జీలు పడవచ్చో వివరిస్తున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 31, 2026 at 4:48 PM IST
Non Payment of EMIs Problems : ఇల్లు, కారు, ఇతర వ్యక్తిగత అవసరాల నిమిత్తం బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి లోన్ తీసుకుంటుంటాం. ఈ రుణాన్ని చెల్లించడానికి చాలా మంది EMI ఆప్షన్‌ను ఎంచుకుంటుంటారు. అయితే, కొన్నిసార్లు జీతం పడటం ఆలస్యం కావడం, వ్యాపారంలో నష్టం, అనుకోని వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల వల్ల సమయానికి EMI కట్టడం కుదరకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలా మందికి రకరకాల సందేహాలు వస్తుంటాయి. ఇంతకీ, ఎన్ని EMIలు మిస్ చేస్తే NPA అవుతుంది? ఏ ఏ ఛార్జీలు పడొచ్చు? క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మనం తీసుకున్న ఏదైనా లోన్‌పై ప్రతి నెలా చెల్లించే మొత్తాన్ని 'EMI'(Equated Monthly Instalment) అంటాం. అయితే, EMI గడువు తేదీ దాటిన వెంటనే ఆ మొత్తాన్ని overdueగా పరిగణనలోకి తీసుకుంటారు. RBI రూల్స్ ప్రకారం, వడ్డీ/అసలు మొత్తం 90 రోజులకు మించి overdueగా ఉంటే నార్మల్‌గా ఆ అకౌంట్ NPAగా వర్గీకరిస్తారు. అంతేకానీ, ఒక EMI మిస్ అయిన వెంటనే రుణం NPA(Non Performing Asset) అయిపోదంటున్నారు నిపుణులు.
ఒక EMI మిస్ అయితే ఏమవుతుందంటే?
ఒక EMI గడువు తేదీలో కట్టకపోతే, మొదటగా బ్యాంకు లేదా రుణ సంస్థ మీకు SMS, ఇమెయిల్ లేదా ఇతర మార్గాల్లో పేమెంట్ గురించి గుర్తు చేయవచ్చు. నార్మల్‌గా, ఆలస్యమైన చెల్లింపునకు సంబంధించిన సాధారణ వడ్డీ, వర్తించే పెనాల్టీ ఛార్జీలు లేదా ఇతర ఒప్పందపరమైన ఛార్జీలు వర్తిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
ఎన్ని EMIలు కట్టకపోతే NPA అవుతుంది?
నార్మల్‌గా మూడు EMIలు కట్టనప్పుడు NPAగా పరిగణిస్తారు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన అపోహను తొలగించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇలాంటి నియమం పెట్టలేదు. 90 రోజులకు పైగా ఒక EMIను కట్టకుండా ఉంచడం తీవ్రమైన విషయం. అలాగే, ఒకటి కంటే ఎక్కువ EMI వరుసగా చెల్లించనట్లయితే, పరిస్థితి మరింత త్వరగా క్లిష్టమవుతుందంటున్నారు.
EMI చెల్లించకపోతే ఏ ఛార్జీలు పడవచ్చు?
రుణ ఒప్పందం, రుణ సంస్థ విధానాన్ని బట్టి ఆలస్య చెల్లింపుపై వివిధ ఛార్జీలు ఉండవచ్చంటున్నారు నిపుణులు. నార్మల్‌గా లోన్‌పై ఒప్పందం ప్రకారం వర్తించే వడ్డీ కంటిన్యూ అవ్వచ్చు. RBI మార్గదర్శకాల ప్రకారం, 'unpaid EMI'పై ఒప్పందంలోని సాధారణ వడ్డీ లెక్కింపు ప్రక్రియను ఇది ఆపదు. ప్రధానంగా, RBI అన్ని బ్యాంకులకు 'లేట్ EMI ఛార్జ్'ను ఒకేలా నిర్ణయించలేదు. లోన్ కంపెనీలు తమ బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం సమంజసమైన, నిబంధనలకు అనుగుణమైన ఛార్జీలు నిర్ణయించవచ్చని చెబుతున్నారు. ఛార్జీతో పాటు దాని కారణాన్ని రుణ ఒప్పందం, KFS/MITC వంటి పత్రాల్లో ముందుగానే తెలియజేయాలి.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉంటుందా?
ఈఎంఐలు టైమ్‌కు కట్టకపోవడం మీ క్రెడిట్ హిస్టరీపై ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పదేపదే EMIలు చెల్లించడం ఆలస్యమయితే ఫ్యూచర్లో రుణం లేదా క్రెడిట్ కార్డు పొందడంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చంటున్నారు నిపుణులు. క్రెడిట్ స్కోర్ దిబ్బతినకుండా ఉండడానికి EMI కట్టలేని పరిస్థితి ఏర్పడిన వెంటనే రుణ సంస్థను సంప్రదించడం మంచిదంటున్నారు. ప్రాబ్లమ్‌ను దాచిపెట్టి EMIలు వరుసగా మిస్ చేయడం కంటే ముందుగానే పరిష్కారం కోరడం సాధారణంగా మెరుగైన విధానమని సూచిస్తున్నారు.
EMI కట్టకపోతే ఏం చేయాలి?
EMI మిస్ చేయడం వెనుక మీ ఆర్థిక ఇబ్బంది తాత్కాలికమైతే కొన్ని మార్గాలను పరిశీలించవచ్చంటున్నారు నిపుణులు.
బ్యాంకును వెంటనే సంప్రదించడం :
మీరు EMI కట్టలేని పరిస్థితి ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా లోన్ తీసుకున్న బ్యాంకును సంప్రదించాలి. మీ పరిస్థితిని వివరించి, అందుబాటులో ఉన్న పరిష్కారాలను అడిగి తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో రుణ సంస్థ తన విధానాల ప్రకారం 'Repayment Schedule'లో మార్పు, rescheduling లేదా ఇతర సహాయక మార్గాలను సూచించవచ్చని చెబుతున్నారు. అయితే, ఇవి స్వయంచాలక హక్కులు కావు; లోన్ టైప్, పరిస్థితి, రుణ సంస్థ విధానంపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
పే స్లిప్ లేకున్నా 'పర్సనల్ లోన్' - ఈ మార్గాల్లో ఈజీగా పొందవచ్చు!
EMI తేదీలో మార్పు :
మీ శాలరీ వచ్చే తేదీ, EMI చెల్లించే తేదీ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే, EMI తేదీ మార్పును కోరవచ్చంటున్నారు. కొన్ని రుణ సంస్థలు తమ విధానం ప్రకారం దీన్ని అనుమతించే అవకాశం ఉంటుంది.
తాత్కాలిక ఖర్చులను తగ్గించండి :
ఈఎంఐలు కొంతకాలం కట్టలేని పరిస్థితి ఉంటే, అవసరం లేని ఖర్చులను తగ్గించి లోన్ చెల్లింపునకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.
పాత EMI చెల్లించే ముందు ఆలోచించండి :
ఒకవేళ ఈఎంఐ మిస్ అయినప్పుడు అదనపు రుణంతో పాత EMI చెల్లించే ముందు ఆలోచించాలంటున్నారు. ఎందుకంటే ఒక లోన్ EMI కట్టడానికి మరొక అధిక వడ్డీ రుణం తీసుకోవడం ప్రాబ్లమ్‌ను మరింత పెంచవచ్చు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు లేదా అధిక వడ్డీ గల పర్సనల్ లోన్‌తో పాత EMIలను కట్టే ముందు మొత్తం ఖర్చును పరిశీలించాలని చెబుతున్నారు.
రుణ పునర్వ్యవస్థీకరణ గురించి అడగడం :
ఆదాయం తగ్గడం వల్ల దీర్ఘకాలం పాటు ఈఎంఐ కట్టడం ఇబ్బందిగా మారితే, బ్యాంకుతో 'Repayment Restructuring' గురించి మాట్లాడవచ్చు. RBI రూల్స్ ప్రకారం, restructuring అంటే కాలపరిమితి, EMI మొత్తం లేదా ఇతర రుణ నిబంధనల్లో మార్పులు చేయడం వంటి చర్యలను కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధిత అర్హతలు, రూల్స్ ఉంటాయి.
లోన్ NPA అయితే ఏమవుతుంది?
లోన్ అకౌంట్ NPAగా మారితే రుణగ్రహీతకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చంటున్నారు నిపుణులు. లోన్ ఇచ్చిన కంపెనీ బకాయిల వసూలు కోసం తనకు వర్తించే చట్టపరమైన, ఒప్పందపరమైన ప్రక్రియలను మొదలుపెట్టవచ్చు. సెక్యూర్డ్ లోన్ అయితే, వర్తించే చట్టాల ప్రకారం తాకట్టు పెట్టిన ఆస్తిపై రికవరీ చర్యలు కూడా చేపట్టే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి లోన్ అకౌంట్ NPA దశకు చేరకముందే సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.
ఆరోగ్య బీమాలో 'OPD కవరేజ్' తీసుకున్నారా? - లేదంటే ఈ ప్రయోజనాలు మిస్ అవుతారట!
'హోమ్ లోన్' తీసుకున్నారా? - ఇలా కడితే తక్కువ వడ్డీ, ఎక్కువ లాభం!

