ETV Bharat / business

ఒకటికి మించి ఎక్కువ "లోన్స్"​ తీసుకున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే చక్కగా మేనేజ్​ చేయొచ్చట!

-వివిధ అవసరాల కోసం బహుళ రుణాలు తీసుకుంటున్న ప్రజలు - ఈ క్రమంలోనే కొన్ని విషయాలు గమనించాలని నిపుణుల సూచన!

Ways to Manage Multiple Loans
Ways to Manage Multiple Loans (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : July 7, 2026 at 5:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ways to Manage Multiple Loans: వివిధ కారణాలు, అవసరాల దృష్ట్యా చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ రుణాలు తీసుకుంటుంటారు. హోమ్​ లోన్​, వెహికల్​ లోన్​, వ్యక్తిగత రుణం వంటివి చాలానే తీసుకుంటారు. అయితే, కొన్ని పరిస్థితుల్లో ఒకటికి మించిన రుణాలు ఆర్థికంగా కుంగదీస్తాయని, అంతేకాకుండా వారి జీవన ప్రమాణాలపై ఒత్తిడిని కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే బహుళ రుణాలు అనేక ఇబ్బందులను కలిగించినప్పటికీ, సరైన వ్యూహాలను అనుసరిస్తే, ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా అధిగమించవచ్చంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

వ్యక్తిగత రుణానికి ప్రాధాన్యత: సాధారణంగా పర్సనల్​లో లోన్స్​పై ఉండే వడ్డీ కంటే క్రెడిట్ కార్డు బిల్లులపై ఉండే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ముందుగా క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించాలని భావించడం సహజం. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కార్డులపై బిల్లు చెల్లింపును ఆలస్యం చేయడం కంటే, వ్యక్తిగత రుణానికి సంబంధించిన ఈఎంఐ చెల్లింపును వాయిదా వేయడం లేదా ఆలస్యం చేయడం వల్ల క్రెడిట్ స్కోరుకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఎందుకంటే వ్యక్తిగత రుణానికి సంబంధించి ఒక ఈఎంఐను సమయానికి చెల్లించకపోతే క్రెడిట్ స్కోరు 50 పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు. క్రెడిట్ కార్డు చెల్లింపుల విషయంలో ఇలా జరగదని చెబుతున్నారు. అయితే అన్ని రుణాలను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం అయినప్పటికీ, ఒకవేళ అన్నింటినీ చెల్లించలేని పరిస్థితి ఉంటే పర్సనల్​ లోన్​ చెల్లింపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు.

ఈఎంఐ తేది: వేతనం పడే కొద్ది రోజుల్లోనే EMI చెల్లింపు తేదీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇతర ఖర్చులకు డబ్బును వినియోగించే ముందే EMI చెల్లింపులు పూర్తవుతాయంటున్నారు. అలా కాకుండా ఈఎంఐ తేదీ ఆలస్యం అయితే అనుకోని ఖర్చుల వల్ల బ్యాంకులో తగినంత నగదు ఉండకపోవచ్చని.. అప్పుడు పేమెంట్స్​ చేయడానికి అవకాశం ఉండదని అంటున్నారు.

అనువైన రుణ చెల్లింపులు: ఒకటికి మించి ఎక్కువ రుణాలు ఉన్నప్పుడు అన్నింటికి ఒకటే వడ్డీ రేటు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఒక రుణంపై తక్కువ వడ్డీ రేటు ఉంటే, మరొకదానిపై ఎక్కువ వడ్డీ రేటు ఉండొచ్చంటున్నారు. ఇలాంటప్పుడు, ఆఫీసులో పండుగలకు బోనస్‌, టార్గెట్​ కంప్లీట్ చేసినందుకు ఇచ్చే​ ఇన్సెంటివ్‌లను అనవసరంగా ఖర్చులు పెట్టకుండా, ఆ డబ్బుతో ఎక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాన్ని ముందుగా తీర్చేయమంటున్నారు. దీనివల్ల అదనపు వడ్డీ భారంతో ఉన్న రుణాల ఒత్తిడి తగ్గుతుందని, ఇంకా, తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న రుణాన్ని గడువుకు ముందుగా చెల్లించడానికి అదనపు నగదును ఉపయోగించొచ్చని చెబుతున్నారు. అది కూడా పూర్తయ్యాక, మరొక తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న రుణాన్ని లక్ష్యంగా చేసుకోమంటున్నారు. ఇలా తీర్చేసే ప్రతీ రుణం మిమ్మల్ని ఆర్థిక స్వేచ్ఛ వైపు వెళ్లేలా చేస్తుందని అంటున్నారు. అయితే ఇంటి రుణం తీర్చే ముందు దానిపై పన్ను మినహాయింపులు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

ఈఎంఐలుగా మార్చుకోండి: ఒకటికి మించి ఎక్కువ రుణాలు ఉన్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ రుణాల ఒత్తిడితో కొంతమంది క్రెడిట్‌ కార్డు బకాయిని తదుపరి బిల్లింగ్‌ సైకిల్‌కు తీసుకెళతారని.. కానీ ఇలా చేయడం వల్ల వడ్డీ భారం బాగా పెరుగుతుందంటున్నారు నిపుణులు. బ్యాంకులు ముందుకు తీసుకువెళ్లిన క్రెడిట్‌ కార్డు బకాయిలపై నెలకు 3.50% వరకు వడ్డీ రేటును వసూలుజేస్తాయంటున్నారు. అందువల్ల, క్రెడిట్‌ కార్డు బిల్లు విషయంలో మొత్తం బకాయిని చెల్లించలేకపోతే, దాన్ని తక్కువ వడ్డీ రేటుతో EMIలుగా మార్చుకోవడం మేలంటున్నారు. ఇలా ఈఎంఐలుగా మార్చుకోవడం వల్ల వడ్డీ 12 నుంచి 14 శాతం వరకు ఉండొచ్చంటున్నారు. దీనివల్ల వడ్డీ భారం తగ్గడమే కాకుండా, ఒకేసారి చెల్లించే బాధ్యత కూడా తప్పుతుందని అంటున్నారు.

మరో రుణం: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు, EMIలు చెల్లించడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా బ్యాంకుల నుంచి కొద్ది మొత్తంలో మరొక రుణం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ, ఇలా చేయడం వల్ల మరింత అప్పుల పాలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం మంచిదని, ఇంకా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలంటున్నారు. అలా కాకుండా, ప్రతీ అవసరానికి లోన్ తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడమే కాకుండా, EMIల వల్ల కలిగే ఆలస్యం మీ క్రెడిట్ స్కోరుపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దీనివల్ల, భవిష్యత్తులో రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆమోదం పొందడం చాలా కష్టంగా మారుతుందని అంటున్నారు.

ఈ "ఫ్రీ ట్రయల్" మాయలో మీరు చిక్కుకున్నారా? - ఒకసారి చెక్​ చేయండి

"క్రిటికల్​ ఇల్​నెస్​ పాలసీ" గురించి తెలుసా? - కొనుగోలు చేసేముందు ఈ విషయాలు తెలుసుకోవాలట!