ETV Bharat / business

ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే వారికి అలర్ట్- OTPలకు బదులుగా కొత్త పేమెంట్ పాస్‌కీ- VISA కొత్త సేవలు

మోసాలకు చెక్ పెడుతూ మరింత సురక్షితంగా డిజిటల్ పేమెంట్స్‌- ఓటీపీలకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ కార్డ్ చెల్లింపుల వ్యవస్థ- పేమెంట్ పాస్‌కీ సేవల్ని లాంఛ్ చేసిన వీసా

Visa Payment Passkey in India
Representational Image (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : July 2, 2026 at 6:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Visa Payment Passkey in India : ఆన్‌లైన్ చెల్లింపుల సమయంలో వచ్చే ఓటీపీలను దొంగిలించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న వేళ, ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ సంస్థ వీసా (VISA) కీలక నిర్ణయం తీసుకుంది. ఓటీపీలపైనే పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గిస్తూ, వేలిముద్ర (ఫింగర్‌ప్రింట్), ఫేస్ ఐడీ లేదా మొబైల్ పిన్‌తోనే చెల్లింపుల్ని ధ్రువీకరించే పేమెంట్ పాస్‌కీ సేవల్ని భారత్‌లో ప్రారంభించింది. దీంతో ఓటీపీ ఫిషింగ్ వంటి సైబర్ మోసాల్ని తగ్గించడంతో పాటు డిజిటల్ చెల్లింపుల్ని మరింత సురక్షితంగా మార్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకా భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపర్చేందుకు ఈ సేవలు తెచ్చినట్లు పేర్కొంది.

ఒకవైపు కృత్రిమ మేధ (AI) ఆధారిత వాణిజ్యం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం పాస్‌వర్డ్‌లు, లేదా వన్ టైమ్ పాస్‌వర్డ్‌లపై (OTP) ఆధారపడే ధ్రువీకరణ విధానం ఇకపై సరిపోదని వీసా స్పష్టం చేసింది. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వీసా ఇండియా అండ్ దక్షిణాసియా గ్రూప్ కంట్రీ మేనేజర్ సురేష్ సేథీ మాట్లాడుతూ డిజిటల్ చెల్లింపుల భద్రత కొత్త దశలోకి అడుగుపెడుతుందన్నారు. 'పాత తరహా పాస్‌వర్డ్స్, ఓటీపీలపై ఆధారపడే వ్యవస్థ నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. భద్రత అనేది టెక్నాలజీ డిజైన్‌లోనే అంతర్భాగంగా మారిపోవాలి. అంటే వినియోగదారులకు కనిపించకుండా, సహజంగానే పనిచేసే, మోసాలను తట్టుకునే భద్రతా వ్యవస్థ అవసరం' అని ఆయన తెలిపారు.

అసలు ఈ పేమెంట్ పాస్‌కీ ఎలా పనిచేస్తుంది?
వీసా తీసుకొచ్చిన పేమెంట్ పాస్‌కీ ద్వారా వినియోగదారులు డిజిటల్ కార్డ్ చెల్లింపుల సమయంలో ఓటీపీ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. వారి మొబైల్ ఫోన్‌లో ఇప్పటికే ఉన్న సెక్యూరిటీ ఫీచర్లయిన వేలిముద్ర (Fingerprint), ఫేస్ రికగ్నిషన్ (Face ID), డివైజ్ పిన్ లేదా ప్యాటర్న్ ఉపయోగించి ఆన్‌లైన్ కార్డు చెల్లింపుల్ని ధ్రువీకరించవచ్చు. ఈ విధానం భారత్‌లో అమల్లో ఉన్న టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగానే ఉంటుందని వీసా స్పష్టం చేసింది.

విశ్వసనీయతే ఇప్పుడు కీలకం
సురేష్ సేథీ ప్రకారం- పేమెంట్ పాస్‌కీ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన FIDO ప్రమాణాల ఆధారంగా రూపొందించారు. దీంతో OTP ఫిషింగ్, నకిలీ లింకులు, ఫేక్ వెరిఫికేషన్ వంటి సైబర్ మోసాల నుంచి వినియోగదారులకు మరింత మెరుగైన రక్షణ లభిస్తుంది. మొబైల్ ఫోన్‌లో ఇప్పటికే ఉన్న భద్రతా వ్యవస్థలనే ఉపయోగించడం వల్ల చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా పూర్తవుతాయని ఆయన వివరించారు. భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, ఇప్పుడు ఈ రంగం మూడో దశలోకి ప్రవేశించిందని సేథీ పేర్కొన్నారు. మూడో దశలో విశ్వసనీయత లేదా నమ్మకం (Trust) అనేది అత్యంత కీలక అంశంగా మారిందన్నారు. భద్రత, విశ్వసనీయత పెరిగితేనే డిజిటల్ పేమెంట్స్‌పై ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతుందని చెప్పారు.

భవిష్యత్తు వాణిజ్యాన్నే మార్చేస్తున్న ఏఐ
ఇక భారత్ ప్రస్తుతం ఆన్‌లైన్ కార్డ్ పేమెంట్స్‌లో ప్రపంచంలోనే అత్యధిక టోకనైజేషన్ (సున్నితమైన సమాచారాన్ని డిజిటల్ కోడ్‌గా మార్చే భద్రతా ప్రక్రియ) కలిగిన దేశంగా నిలిచిందని వీసా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 90 కోట్లకుపైగా పేమెంట్ టోకెన్లు వినియోగంలో ఉండగా, వాటిల్లో దాదాపు 50 కోట్ల వీసా టోకెన్లు ఉన్నాయని సేథీ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేసిన టోకనైజేషన్, డిజిటల్ చెల్లింపుల భద్రతా నిబంధనల వల్లే ఈ పురోగతి సాధ్యమైందని చెప్పారు. ఏఐ భవిష్యత్తు వాణిజ్యాన్ని పూర్తిగా మార్చేస్తోందని సేథీ చెప్పుకొచ్చారు. వినియోగదారులు ఏదైనా ప్రొడక్ట్‌ను వెతకడం, పోల్చడం, కొనుగోలు చేయడంలో ఇక ఏఐ ఆధారిత అసిస్టెంట్స్ కీలక పాత్ర పోషిస్తారని, స్మార్ట్ డివైజ్‌లు కూడా భవిష్యత్తుల్లో లావాదేవీల్లో భాగమవుతాయని అన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే మరింత భద్రమైన, వేగవంతమైన ధ్రువీకరణ విధానాలు అవసరం అవుతాయని ఆయన వివరించారు.

ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందని సురేష్ సేథీ అభిప్రాయపడ్డారు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆర్బీఐ, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, వ్యాపార సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు నెట్‌వర్క్ సమస్యల వల్ల ఓటీపీలు రాకపోవడం లేదా పొరపాటున ఓటీపీలను ఇతరులకు చెప్పి మోసపోవడం వంటి సమస్యలకు వీసా తెచ్చిన పేమెంట్ పాస్‌కీ పరిష్కారం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కైలాస- మానస్‌ సరోవర్‌ యాత్రకు వెళ్లే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

కోల్‌కతా 'మినీ బంగ్లాదేశ్'కు కొత్త ఊపు- రెండేళ్ల తర్వాత మళ్లీ కళకళ- ఎందుకో తెలుసా?