వెండికి హాల్‌మార్కింగ్- త్వరలో తప్పనిసరి చేసే ఛాన్స్!
వెండి కొనుగోలు చేయాలా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Published : January 7, 2026 at 1:08 PM IST
Silver Hallmarking Mandatory : భారతదేశంలో వెండి ఆభరణాలకు త్వరలో అధికారిక హాల్‌మార్క్ తప్పనిసరి అయ్యే ఛాన్స్ ఉందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ అన్నారు. అయితే అందుకు తగిన మౌలిక సదుపాయాలను ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
హాల్‌మార్కింగ్ అనేది బంగారం, వెండి లాంటి విలువైన లోహాల స్వచ్ఛతను ధ్రువీకరిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, హాల్‌మార్క్‌లో BIS లోగో, ఆభరణాల వ్యాపారి గుర్తింపు, HUID ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఇది బంగారం, వెండి లాంటి లోహాల స్వచ్ఛతను తెలుపుతుంది. దీని వల్ల వినియోగదారులు తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు కొనకుండా, మోసపోకుండా రక్షణ లభిస్తుంది.
బీఐఎస్ 79వ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతూ, గార్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోహాలతో తయారు చేసే ఉత్పత్తుల నాణ్యతకు, జాతీయ అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన విశదీకరించి చెప్పారు.
"అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న తేడా ఏమిటంటే, ఉత్పత్తుల నాణ్యత. ఈ నాణ్యతే ఏకైక నిర్ణయాత్మక అంశం అవుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు మౌలిక సదుపాయాలు, పాలన, పౌర సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, ఆతిథ్యంలో ప్రత్యేకంగా నిలుస్తాయి. అందుకే పరిశ్రమలను ప్రోత్సహిస్తూ, నమ్మదగిన ఉత్పత్తులను వినియోగదారులు పొందేలా బీఐఎస్ కృషి చేస్తోంది" అని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్
'మన దేశంలో బంగారానికి హాల్‌మార్క్ తప్పనిసరి. ఇప్పటి వరకు 58 కోట్లకు పైగా బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ చేశాం. ప్రస్తుతం మేము నెలకు ఒక కోటి బంగారు నగలకు హాల్‌మార్క్ చేస్తున్నాం' అని సంజయ్ గార్గ్ తెలిపారు.
ప్రస్తుతానికి స్వచ్ఛందమే!
'ప్రస్తుతానికి వెండి హాల్‌మార్కింగ్ స్వచ్ఛంద ప్రాతిపదిక ప్రారంభమైంది. ఇది బాగా ఊపందుకుంటోంది కూడా. బహుశా సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు, వస్తువులకు HUID-ఆధారిత వ్యవస్థ కింద హాల్‌మార్క్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 23 లక్షలకుపైగా వెండి వస్తువులను ధ్రువీకరించాం. కొనుగోలుదారులు తాము కొన్న వెండి స్వచ్ఛతను ధ్రువీకరించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది' అని సంజయ్ గార్గ్ పేర్కొన్నారు.
'ప్రస్తుతం వెండి హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలని పరిశ్రమ నుంచి డిమాండ్ ఉంది. కానీ అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మేము హాల్‌మార్కింగ్‌ను అమలు చేస్తాం' అని సంజయ్ గార్గ్ స్పష్టం చేశారు.
'ప్రస్తుతం దేశంలో కొన్ని చోట్ల హాల్‌మార్క్ చేసిన వెండి ఆభరణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి వెండి ఆభరణాలు, వస్తువుల నాణ్యతను, స్వచ్ఛతను తెలియజేస్తాయి. అంతేకాదు దుకాణదారులపై నమ్మకాన్ని ఏర్పరుస్తాయి. ఒకవేళ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తే, మరిన్ని జిల్లాలను, రిటైలర్లను కవర్ చేయడానికి వీలవుతుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా హాల్‌మార్కింగ్‌తో ధ్రువీకరించిన వెండి వస్తువులను కొనడం సులభం అవుతుందని' సంజయ్ గార్గ్ చెప్పారు.
నకిలీ ఆభరణాలను గుర్తించండిలా!
బంగారం ఫ్యూరిటీలో జరిగే అక్రమాల గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వం బీఐఎస్ కేర్ యాప్‌ని తీసుకువచ్చింది. యాప్‌లో లాగిన్ అయ్యాక ఆభరణంపై ఉన్న హెచ్‌యూఐడీ నంబర్ ఎంటర్ చేస్తే దానిని తయారు చేసిన దుకాణం, వారి రిజిస్ట్రేషన్ నంబర్, బరువు, క్యారెట్ వివరాలు, రాళ్ల బరువు, రాళ్ల వివరాలు, ఇలా అన్నీ తెలుసుకోవచ్చు. దుకాణదారులు మోసపూరిత నంబర్ వేసినట్లైతే బీఐఎస్ కేర్ యాప్‌లో ఆభరణానికి సంబంధించిన వివరాలు కనిపించవు. అప్పుడు యాప్‌లోనే బీఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అయితే బంగారు ఆభరణాల కొనుగోళ్లలో రాళ్లు పొదిగిన ఆభరణాల విషయంలోనూ తస్మాత్ జాగ్రత్త అన్నది నిపుణుల అభిప్రాయం. ముద్దబంగారంలా ఉండే ఆభరణాల కంటే రాళ్లు పొదిగిన నగలు ధగధగ మెరుస్తుంటాయి. అందుకే రాళ్లు పొదిగిన వాటిపై మహిళలు మక్కువ చూపుతుంటారు. అయితే రాళ్లనగల విషయంలో బరువులోని తేడాలు గుర్తించటం కష్టం. గ్రాస్‌వెయిట్, నెట్‌వెయిట్, స్టోన్‌వెయిట్‌ని దుకాణదారులను నమ్మి తీసుకోవటమే తప్ప దానిని గుర్తించటం మాత్రం అసంభవం. అలా గుర్తించాలంటే నగని కరిగించటం తప్ప మరోమార్గం ఉండదు.
వెండి తగ్గేదేలే- 2025లో ఏకంగా 181శాతం పెరిగిన ధర- 2026లో రేటు డబుల్ అవుతుందా?
ఎంత జాగ్రత్త చేసినా "వెండి వస్తువులు" నల్లగా మారాయా? - ఈ టిప్స్ ట్రై చేస్తే మెరిసిపోతాయట!

