అమెరికా-వెనెజువెలా ఉద్రిక్తతలు - భారత చమురు దిగుమతులపై ప్రభావమెంత?
భారత్ చమురు దిగుమతులపై అమెరికా-వెనెజువెలా ఘర్షణల ప్రభావం పడుతుందా? విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే?

Published : January 5, 2026 at 6:00 PM IST
Venezuela Crisis Impact On India : అమెరికా-వెనెజువెలా మధ్య ఉద్రిక్తతలు పెరగడం, ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను యూఎస్ నిర్భందిన నేపథ్యంలో, భారత్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందోనని మదుపరులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనెజువెలాను అమెరికా తన గుప్పెట్లో ఉంచుకుంటే, ముడి చమురు దిగుమతుల వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. మరి దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే?
అమెరికా-వెనెజువెలా ఘర్షణ వల్ల భారత వాణిజ్యంపై పడే ప్రభావం చాలా స్వల్పమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో వెనెజువెలా నుంచి భారత్ చేసుకున్న దిగుమతుల విలువ కేవలం 364.5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇందులో ముడి చమురు వాటా 255.3 మిలియన్ డాలర్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ చేసుకున్న 1.4 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతులతో పోల్చితే, ఇది ఏకంగా 81.3 శాతం తక్కువ కావడం గమనార్హం. "అమెరికా ఆంక్షల వల్ల వెనెజువెలాలో మన వాణిజ్యం ఇప్పటికే బాగా తగ్గిపోయింది. కనుక భారత్‌పై తాజా ఘర్షణల ప్రభావం చాలా తక్కువ" అని జీటీఆర్ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
ఈ 3 రంగాలపై ప్రభావం ఎలా ఉంటుందంటే?
1. చమురు దిగుమతులు : వాస్తవానికి ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో సుమారు 18 శాతం వెనెజువెలాలోనే ఉన్నాయి. దీని తర్వాత సౌదీ అరేబియా (16 శాతం), రష్యా (సుమారు 5-6 శాతం) మేరకు ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. అందువల్లే భారత్‌పై వెనెజువెలా-అమెరికా ఘర్షణ ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తింది. అయితే ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉంది. వాస్తవానికి ఒకప్పుడు అంటే 2000-21 మధ్య వెనెజువెలా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసేది. కానీ 2019లో అమెరికా ఆంక్షల భయం వల్ల భారత్ ఆ దిగుమతులను భారీగా తగ్గించుకుంది. అయితే 'ఓఎన్జీసీ విదేశ్' (OVL)కు వెనెజువెలాలోని 2 చమురు ప్రాజెక్టుల్లో వాటాలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) & ఆయిల్ ఇండియాకు 'కరాబోబో' ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. గతంలో ప్రైవేట్ సంస్థలైన రిలయన్స్ & నయారా ఎనర్జీ వెనెజువెలా నుంచి భారీగా ముడిచమురును దిగుమతి చేసుకునేవి.
2. ఫార్మా రంగం (ఔషధాలు) : వెనెజువెలాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఔషధాల వాటా (41.4 మిలియన్ డాలర్లు) చాలా ఎక్కువ. భారత్‌కు చెందిన సన్‌ఫార్మాకు అక్కడ ఓ అనుబంధ సంస్థను కూడా ఉంది. సిప్లా, గ్లెన్‌మార్క్ అక్కడ ఇప్పటికీ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే డాక్టర్ రెడ్డీస్ మాత్రం 2024లో తన వాటాను పూర్తిగా విక్రయించి, వెనెజువెలా నుంచి బయటకు వచ్చేసింది.
3. ఆటోమొబైల్స్ రంగం : భారత్, వెనెజువెలా మధ్య జరిగే ఆటోమొబైల్ వాణిజ్యం చాలా తక్కువనే చెప్పవచ్చు. బజాజ్ ఆటో తన మొత్తం ఎగుమతుల్లో వెనెజువెలా వాటా 1 శాతం కంటే తక్కువ అని చెప్పింది. టీవీఎస్ మోటార్స్ కూడా అక్కడ పెద్దగా వాణిజ్యం చేయడం లేదు.
మొత్తంగా చూసుకుంటే, ప్రస్తుతానికి అమెరికా-వెనెజువెలా ఘర్షణ వల్ల భారత్‌పై పడే ప్రభావం పెద్దగా ఏమీ లేదు. అయితే అక్కడి భవిష్యత్ రాజకీయ పరిణామాల ఆధారంగా పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికాది దురాక్రమణే!
వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడైన నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించింది. అంతేకాదు మదురోపై నార్కో-టెర్రరిస్టు ముద్ర వేసింది. ఇదంతా పైకి చెబుతున్నప్పటికీ, వెనెజువెలాలోని అపారమైన చమురు నిక్షేపాలపై అమెరికా కన్ను పడిందన్నది వాస్తవం. అందుకే మత్తు పదార్థాలను అమెరికాకు సరఫరా చేస్తున్నారనే నెపథంలో వెనెజువెలాపై దాడికి పాల్పడింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ ఓ విషయం స్పష్టం చేశారు. వెనెజువెలాలోని యూఎస్ చమురు కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయని ప్రకటించారు. ఈ విధంగా చాలా స్పష్టంగా వెనెజువెలా చమురు నిక్షేపాలను దోచుకునేందుకు అమెరికా సిద్ధపడడాన్ని రష్యా, చైనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా సౌత్ అమెరికా దేశాలపై దురాక్రమణకు దిగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇకపై రూపాయిల్లోనే భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక వాణిజ్యం : ఎస్బీఐ
భారత ఆర్థిక వ్యవస్థ జోరు- ఇంకా బలమైన వృద్ధిని కొనసాగించే అవకాశం: ఆర్బీఐ రిపోర్ట్

