ETV Bharat / business

పశ్చిమ ఆసియా సంక్షోభం : ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఇప్పుడే చెప్పలేం- IMF కీలక కామెంట్స్

పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం- ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఉద్రిక్తతలు- ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు

IMF On Global Economy
IMF On Global Economy (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 10:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

IMF On Global Economy : పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత మేరకు పడుతుందన్న దానిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం కీలక కామెంట్స్ చేసింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను అత్యంత నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఈ యుద్ధం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది.

ఉద్రిక్తతల వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయాలు, ఇంధన ధరల పెరుగుదల, మార్కెట్లలో అస్థిరతను తాము గమనించినట్లు పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి అత్యంత వేగంగా మారుతోందని, ఇది ఇప్పటికే అనిశ్చితిలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై ఎంత నష్టం జరుగుతుందనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో అస్థిరత ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. ఎర్ర సముద్రం, ఇతర కీలక జలమార్గాల ద్వారా జరిగే సరుకు రవాణాకు ఆటంకాలు కలుగుతున్నాయని ఐఎంఎఫ్ తన నివేదికలో చెప్పింది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, సరఫరా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు, ఆర్థిక సంస్థలు ఈ పరిణామాల పట్ల ఆందోళన చెందుతున్నాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లుతుండటంతో ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.

ఇంధన భద్రతపై భారత్ దీమా!
భారతదేశం తన అవసరాల కోసం ముడి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో, ఈ సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తీవ్ర పడనుంది. అయితే ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టత ఇచ్చారు. భారతదేశం వద్ద ప్రస్తుతం వ్యూహాత్మక నిల్వలతో కలిపి సుమారు 8 వారాలకు సరిపడా ముడి చమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఇందులో పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా విమాన ఇంధనం కూడా తగినంత మొత్తంలో ఉందని స్పష్టం చేశారు.

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిలో అస్థిరత ఏర్పడితే సరఫరా ఆగిపోతుందనే ఆందోళనల నడుమ భారత్ వ్యూహత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో కేవలం 40శాతం మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నాయి. మిగిలిన 60శాతం చమురు రష్యా, అమెరికా, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి వేరే మార్గాల ద్వారా చేరుతోంది. ఈ ఉద్రిక్తతలు ఉన్నన్ని రోజులు ఇతర మార్గాల ద్వారా ఎగుమతులను పెంచుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వలను, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను నిమిష నిమిషం పర్యవేక్షిస్తుంది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హామీ ఇచ్చారు. భారత చమురు కంపెనీలు ఇప్పుడు భౌగోళికంగా చాలా ప్రాంతాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఇది ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించింది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో ఏవైనా తాత్కాలిక సరఫరా అంతరాయాలు ఏర్పడినా, దేశం వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలదని భారత్ నమ్ముతోంది. అయితే, భారతదేశం గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని, తన వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవడం, దిగుమతులను విభిన్న దేశాల నుంచి సేకరించడం ద్వారా ఒక సురక్షితమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.