ఉద్యోగం పోయిందా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫైనాన్షియల్‌గా నో ప్రాబ్లమ్!
-ప్రస్తుత రోజుల్లో కామన్‌గా ఉద్యోగాల తొలగింపు - ఆ సమయంలో మనోధైర్యంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణుల సూచన!
Tips to Financial Recovery after Job Loss (ETV Bharat)

Published : August 30, 2026 at 1:08 PM IST
Tips to Financial Recovery after Job Loss: ప్రస్తుత రోజుల్లో ఏదో ఒక సంస్థలో ఉద్యోగాల తొలగింపు కామన్ అయ్యింది. జాబ్ పోయిందంటే నెలకు వచ్చే జీతం ఒక్కసారిగా ఆగిపోతుంది. శాలరీ ఆగుతుంది, కానీ ఇంటి అద్దె, కిరాణా సరకులు, పిల్లల ఫీజులు, కుటుంబ వైద్య అవసరాలు, ఈఎంఐల వంటి ఖర్చులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఇక సంస్థ అందించే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పోతుంది. ఇలాంటి సమయంలో మనోధైర్యం కోల్పోకుండా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
- కుటుంబ అవసరాలకు ప్రతి నెలా ఎంత ఖర్చు అవుతుందో కచ్చితంగా లెక్కలు వేసుకోవాలని, ఇంటి అద్దె, సరుకులు, పిల్లల చదువులు, మెడికల్ బిల్లుల వంటి తప్పనిసరి ఖర్చుల లిస్ట్‌ను రెడీ చేసుకోవాలంటుని వివరిస్తున్నారు. రాబోయే ఆరు నెలల్లో పే చేయాల్సిన వార్షిక ఖర్చులనూ ముందుగానే ఇందులో యాడ్ చేయాలని వివరిస్తున్నారు. మీ దగ్గర ఉన్న నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్లు, డెట్ మ్యూచువల్ ఫండ్ల వంటి సులభంగా విత్‌డ్రా చేసుకునే ఆస్తుల విలువను లెక్కగట్టాలంటున్నారు. మంత్లీ ఖర్చులతో ఈ ఆస్తులను పోల్చి చూస్తే మీ దగ్గరున్న డబ్బు ఎన్ని నెలలపాటు సరిపోతుందో స్పష్టత వస్తుందని, ఆ సమయంలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యే ఈక్విటీల కంటే స్థిర ఆదాయా మార్గాలపైనే ఎక్కువగా ఆధారపడటం మంచిదని వివరిస్తున్నారు.
- చేతిలో ఆదాయం లేనప్పుడు విలాసవంతమైన కొనుగోళ్లను, ఇంటి మరమ్మతుల్లాంటి వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఖర్చులను తగ్గించుకోవాలని, వీటిని పూర్తిగా మానేసినా, కొన్నిసార్లు మానసికంగా ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి, ప్రశాంతత కోసం కొంత మేరకు ఖర్చు చేయడం తప్పకపోవచ్చని వివరిస్తున్నారు.
- డబ్బు అవసరమైనప్పుడు ముందుగా అత్యవసర నిధిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత మాత్రమే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్లలోని సొమ్మును వాడుకోవాలంటున్నారు. ఒకవేళ షేర్ మార్కెట్లు అనుకూలంగా ఉంటే, ఈక్విటీలలో కొంత లాభాల స్వీకరణ చేయొచ్చని, సిప్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటున్నారు. ఈ సమయంలో నష్టభయం భరించే సామర్థ్యం తగ్గిపోతుందని, కాబట్టి పోర్ట్‌ఫోలియో రిస్కును సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలంటున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వీటిని మళ్లీ ప్రారంభించాలంటున్నారు.
- ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు లోన్స్‌ను మెయింటైన్ చేయడం చాలా కీలకమని, ఈ క్రమంలో ఇల్లు, వాహన రుణాల వంటి వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటున్నారు. ఇవి ఆస్తులతో ముడిపడి ఉంటాయని, క్రెడిట్ కార్డుల బాకీలపై వడ్డీ సంవత్సరం 36 నుంచి 45 శాతం వరకూ ఉంటుందంటున్నారు. కాబట్టి, గడువులోపు కనీస మొత్తాన్ని చెల్లిస్తూ, మీ క్రెడిట్ స్కోరును కాపాడుకోవాలని సూచిస్తున్నారు. లోన్ ఎక్కువగా ఉంటే, దానిని సులభ వాయిదాల పద్ధతిలోకి మార్చాలని బ్యాంకులను కోరాలని, చాలా బ్యాంకులు 12 నుంచి 18 శాతం వడ్డీతోనే ఈ సదుపాయాన్ని కల్పిస్తాయని చెబుతున్నారు. ఈఎంఐ చెల్లించకపోతే గడువు కంటే ముందే బ్యాంకులను సంప్రదిస్తే మంచిదని, వారు మూడు నుంచి ఆరు నెలల పాటు కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
- ఉద్యోగం కోల్పోయినా, మానేసినా యాజమాన్యం అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ రద్దవుతుంది. కాబట్టి, ఎప్పుడూ పర్సనల్ హెల్త్ పాలసీ ఒకటి ఉండాలంటున్నారు. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం, గ్రూపు పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే వీలుందని, అయితే కొత్త పాలసీ రూల్స్, ప్రీమియం, లభించే రక్షణ పరిమితిని ముందే చెక్ చేసుకోవడం మంచిదని వివరిస్తున్నారు.
- ఆదాయం ఆగిపోవడం తాత్కాలికమే కావచ్చు. కానీ ఇలాంటి సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ఆర్థిక పరిస్థితినీ మరింత ప్రభావితం చేయొచ్చంటున్నారు. కాబట్టి, సరైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించే ప్రయత్నం చేయమంటున్నారు నిపుణులు.

