ETV Bharat / business

అదరగొట్టిన TCS- తొలి త్రైమాసికంలో రూ.13349 కోట్ల లాభం- 3 నెలల్లో 9200 మంది కొత్త ఉద్యోగులు

అంతర్జాతీయంగా అనిశ్చితి, సవాళ్లు ఉన్నా రాణించిన టీసీఎస్- తొలి త్రైమాసికంలో దాదాపు 5 శాతం పెరిగిన లాభం- 3 నెలల కాలంలో ఆదాయం రూ. 72,275 కోట్లు

TCS
Representational Image (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : July 9, 2026 at 5:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

TCS Q1 Results : భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన (కన్సాలిడేటెడ్) నికర లాభం రూ. 13,349 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో చూస్తే లాభం 4.61 శాతం పెరిగింది. ఏడాది కిందట ఇదే ఏప్రిల్- జూన్ కాలంలో టీసీఎస్ లాభం రూ. 12,760 కోట్లుగా ఉండేది. క్యూ1లో సంస్థ కార్యకలాపాల ఆదాయం (రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్) రూ. 72,275 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ1తో చూస్తే ఆదాయం దాదాపు 14 శాతం వరకు పెరిగింది. మార్చితో ముగిసిన కిందటి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 70,698 కోట్లుగా ఉంటే అక్కడితో పోల్చి చూసినా 2.23 శాతం అధికంగా నమోదైంది. ఇదే సమయంలో నికర ఆదాయం రూ. 13,849 కోట్లుగా ఉంది. ఇక్కడ కూడా వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం వృద్ధి కనబరిచింది.

ఒక్కో షేరుకు రూ. 12 చొప్పున డివిడెండ్
క్యూ1 ఫలితాల్ని వెల్లడించిన సమయంలోనే టీసీఎస్ బోర్డు షేర్ హోల్డర్లకు, ఇన్వెస్టర్లకు శుభవార్త అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ (ఇంటీరిమ్ డివిడెండ్) కూడా ప్రకటించడం విశేషం. దీనికి రికార్డ్ డేట్ జులై 15 గా నిర్ణయించింది. అంటే ఆ తేదీ లోపు టీసీఎస్‌లో షేర్లు కలిగి ఉన్న వారు డివిడెండ్ పొందేందుకు అర్హులన్నమాట. రూ. 12 చొప్పున అంటే 100 షేర్లు ఉన్న వారికి రూ. 1200 డివిడెండ్ రూపంలో అందుతుంది. ఇక ఈ డివిడెండ్ చెల్లింపులు 2026, జులై 31 న చెల్లించనున్నట్లు ఫలితాల సమయంలో వెల్లడించింది.

పెరిగిన ఉద్యోగులు
ఇక జూన్ వరకు టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798 గా ఉండగా సమీక్షా త్రైమాసికంలో 9200 మంది పెరిగారు. ఇక అట్రిషన్ రేటు 13.6 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ అట్రిషన్ రేటు అంటే సిబ్బంది వలసల్ని సూచిస్తుంది. అంటే కంపెనీలు మారే ఉద్యోగుల శాతం అన్నమాట. గత 12 నెలలుగా ఈ అట్రిషన్ రేటు స్థిరంగానే ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులు అందరికీ ఏప్రిల్- జూన్ క్వార్టర్‌లోనే వార్షిక వేతనాల పెంపును అమలు చేసినట్లు వెల్లడించిన టీసీఎస్ ఇదే సమయంలో కొత్త లేబర్ కోడ్స్‌కు అనుగుణంగా వేతన విధానాన్ని (కాంపెన్సేషన్ స్ట్రక్చర్) కూడా మార్చినట్లు తెలిపింది.

మిలియన్ డాలర్ల ఒప్పందాలు
ఏప్రిల్- జూన్ క్వార్టర్‌లో టీసీఎస్‌ ఆర్డర్ బుక్ బాగానే ఉంది. మొత్తం 9.5 బిలియన్ డాలర్ల వరకు విలువైన ఆర్డర్లను సంపాదించింది. మన కరెన్సీలో చూస్తే ఈ విలువ రూ. 90 వేల కోట్లకు పైనే ఉంటుంది. ఇందులో ఎస్‌కేఎఫ్‌తో 800 మిలియన్ డాలర్ల విలువైన ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ డీల్ ఉంది. సర్వీస్‌నౌతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం, యూరప్ బేస్డ్ ఫార్చూన్ గ్లోబల్ 50 కంపెనీతో కూడా మల్టీ మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది.

నష్టాల్లోనే ముగిసిన టీసీఎస్ షేరు
అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా సంస్థ మంచి ఫలితాలు సాధించిందని, వృద్ధిని కొనసాగించిందని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతి వాసన్ చెప్పారు. ఏఐ వ్యాపారంలోనూ పుంజుకుంటున్నామని తెలిపారు. ఇక గురువారం రోజు స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాల్ని వెల్లడించగా అంతకుముందు బీఎస్ఈలో షేరు 0.52 శాతం నష్టంతో రూ. 2047.75 వద్ద ముగిసింది. ఇక NSE లో కూడా స్వల్ప నష్టంతో రూ. 2049.50 వద్ద స్థిరపడింది. సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 7.41 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ. 3414 గా ఉండగా, కనిష్ఠ ధర రూ. 1976.80 గా ఉంది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు టీసీఎస్ షేర్లు ఏకంగా 36 శాతం వరకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

టీసీఎస్ సీఈఓ కృతివాసన్‌ పారితోషికం రూ.28 కోట్లు

రూ.లక్షల ప్యాకేజీల జాబ్స్​ వదిలి, గ్రూప్​ -1 లో డీఎస్పీ కొలువు సాధించిన చాందిని విజయగాథ