ETV Bharat / business

TCS లైంగిక వేధింపులు, మతమార్పిళ్లపై ఉన్నతస్థాయి విచారణ- ఏడుగురు ఉద్యోగుల సస్పెండ్

హెచ్‌ఆర్ మేనేజర్‌ సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు- 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య పని ప్రదేశంలో లైంగిక వేధింపులు

TCS Nashik Campus Controversy
TCS Nashik Campus Controversy ((IANS))
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2026 at 10:53 PM IST

2 Min Read
Choose ETV Bharat

TCS Nashik Campus Controversy : TCS నాశిక్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్ల వ్యవహారంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలు తనను ఎంతో కలిచివేస్తున్నాయని, వీటిని ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు TCS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తీ సుబ్రమణియన్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి విచారణకు ఆయన ఆదేశించారు. పోలీసు దర్యాప్తునకు సంస్థ పూర్తి సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు.

టీసీఎస్ నిందితులైన సిబ్బంది సస్పెండ్
ఉద్యోగులు ఏ రూపంలో వేధింపులకు లేదా బలవంతపు చర్యలకు పాల్పడినా ఏమాత్రం సహించేది లేదని చంద్రశేఖరన్ తేల్చిచెప్పారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సంస్థలో వ్యవస్థాపరమైన మెరుగుదలకు, దిద్దుబాటు చర్యలను వెంటనే కఠినంగా అమలు చేస్తామన్నారు. ఈ వివాదంపై ఆదివారమే స్పందించిన టీసీఎస్ నిందితులైన సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. కార్యాలయంలో ఉద్యోగుల భద్రత, శ్రేయస్సుకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది.

హెచ్‌ఆర్ మేనేజర్‌ సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాశిక్ కార్యాలయంలో వెలుగుచూసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఐటీ రంగంలో పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగ ఉద్యోగుల సంఘం 'నైట్స్' కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. టీసీఎస్ సహా మహారాష్ట్రలోని టెక్, I.T.E.S కంపెనీల్లో పోష్ చట్టం అమలుపై సమగ్రమైన ఆడిట్ నిర్వహించాలని కోరింది. TCS నాశిక్ కార్యాలయంలో పనిచేసే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు సీనియర్ సహోద్యోగులపై ఫిర్యాదు చేశారు. తమను సీనియర్ సహోద్యోగులు మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని, HR విభాగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపేందుకు పోలీసులు గత వారమే సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి టీసీఎస్ మహిళా హెచ్‌ఆర్ మేనేజర్‌ సహా ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య పని ప్రదేశంలో లైంగిక వేధింపులు
పెళ్లి పేరుతో తనను సహోద్యోగి మోసగించినట్లు ఇటీవల నాశిక్‌ క్యాంపస్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఏడుగురు మహిళా ఉద్యోగులు ముందుకొచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి చెప్పారు. వేధింపుల వ్యవహారంలో HR మేనేజర్‌ సహా ఏడుగురి పేర్లు వెలుగులోకి వచ్చాయి. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య పని ప్రదేశంలో వీరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు మహిళా ఉద్యోగులు ఆరోపించారు. అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్‌, అనుచితంగా తాకడం, నాన్ వెజ్‌ తినాలని ఒత్తిడి చేయడం వంటివి చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై హెచ్‌ఆర్‌ విభాగానికి మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్న పోలీసులు
అనంతరం విచారణలో భాగంగా పలువురు మహిళా పోలీసులు ఉద్యోగుల్లా కార్యాలయంలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. మిగిలిన వారిపై వచ్చిన అభియోగాలను నిర్ధారించేందుకు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.